జీడి పిక్క.. బతుకు పక్కా అన్నారు...
పార్వతీపురంటౌన్: ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పంటలకు గిట్టుబాటు ధర ఉండడం లేదు... ప్రభుత్వం నుంచి రైతులకు పెట్టుబడి సాయం అందని ద్రాక్షగా మారింది.. విద్య, వైద్య సదుపాయాలు, ఉపాధి అవకాశాల కల్పనపై కూటమి ప్రభుత్వం కినుక వహిస్తోంది.. ప్రాజెక్టుల ఆధునికీకరణకు బడ్జెట్‌లో కనీస నిధులు కేటాయించలేదు.. వస్తున్న ఖరీఫ్‌కు సాగునీరు ప్రశ్నార్థకంగా మారింది.. జీడి పంటకు మద్దతు ధర లేదు.. గిరిజన ప్రాంత అభివృద్ధి ఎండమావిగా కనిపిస్తోంది.. అత్యవసర వేళ డోలీ కష్టాలు వీడడంలేదు.. పల్లెపండగ అంటూ మొదలెట్టిన పనులు ‘ఎక్కడివేసిన గొంగలి అక్కడే’ అన్న చందంగా ఉన్నాయి.. సంక్షేమ పథకాల హామీలన్నీ ఆచరణ శూన్యంగానే కనిపిస్తున్నాయంటూ గిరిజనులు ఆందోళన బాట పట్టారు. పార్వతీపురం కలెక్టరేట్ వద్ద సోమవారం చేపట్టిన 48 గంటల నిరసన దీక్షను మంగళవారం సాయంత్రం వరకు కొనసాగించారు. సమస్యలు పరిష్కరించాలంటూ నినదించారు. ఇచ్చిన హామీలు అమలుచేయాలని కూటమి నేతలను డిమాండ్ చేశారు. వ్యయప్రయాసల కోర్చి ప్రతి సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదికకు రాలేమని, గతంలో వలే సచివాలయ స్థాయిలోనే సమస్యలు పరిష్కరించాలని కోరారు. పలు డిమాండ్లను వినిపించారు. దీక్షల్లో గిరిజన సంఘాల నాయకులు ఎం.తిరుపతిరావు, లక్ష్మణరావు, కె.రామస్వామి, కె.సీతారాం, ఎస్.అప్పారావు, ఎస్.రామారావు, కె.ప్రసాద్, శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు.
చదువుకునేలా చూడండి
వైద్య కళాశాల ఏదీ?
జిల్లాలోని రెండు ఐటీడీఏల గిరిజనులతో జీడి పిక్క.. బతుకు పక్కా అంటూ గతంలో టీడీపీ ప్రభుత్వమే మొక్కలు వేయించింది. కష్టపడి తోటలు పెంచిన గిరిజనుల నుంచి జీడి పిక్కలు కొనుగోలు చేసేవారే నేడు కరువయ్యారు. దళారులకు చౌకగా అమ్ముకోవాల్సి వస్తోందని గిరిజన రైతులు వాపోయారు. జీసీసీ పరిధిలో 80 కేజీల జీడిపిక్కల బస్తా రూ. 16 వేలకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సీతంపేట, కురుపాం, సాలూరు గిరిజన ప్రాంతాల్లో జీడి ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని కోరారు.
కలెక్టరేట్ వద్ద 48 గంటల పాటు నిరసన దీక్ష
పంటలకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్
విద్య, వైద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని వినతి
మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ నినాదాలు
సంక్షేమ పథకాలు అందడంలేదంటూ ఆవేదన
జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులే నూటికి 95 మంది ఉన్నారు. వీరిలో చాలా మంది డబ్బులు ఖర్చుపెట్టి ప్రైవేటు కళాశాలల్లో చదువుకోలేని పరిస్థితి. ఎక్కువగా గిరిజనులు ఎంఏ, ఎమ్మెస్సీ, ఇంజినీరింగ్ వంటి కోర్సులు చదవడానికి దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. సకాలంలో ఫీజురీయింబర్స్‌మెంట్ విడుదల చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక కష్టాలతో చదువుకు దూరమవుతున్నారు. ప్రభుత్వం స్పందించి గిరిజనులకు విద్యావకాశాలను అందుబాటులోకి తేవాలని గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ప్రాథమికోన్నత పాఠశాలలను ఎత్తేసే ప్రయత్నాలను విరమించుకోవాలన్నారు.
గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం జిల్లాకు మెడికల్ కళాశాలను మంజూరు చేసింది. రూ.600 కోట్ల ఖర్చుతో ఏర్పాటుచేసే వైద్య కళాశాలను కూటమి ప్రభుత్వం రద్దుచేయడాన్ని గిరిజన సంఘాల నాయకులు తప్పుబట్టారు. రాష్ట్రంలో మెడికల్ కళాశాల లేని జిల్లాగా పార్వతీపురం మన్యం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. కురుపాం, పాలకొండ, సాలూరు నియోజకవర్గాల్లో 100 పడకల ఆస్పత్రుల పనులను తక్షణమే పూర్తిచేసి మెరుగైన వైద్యసేవలందేలా చూడాలని కోరారు.
జీడి పిక్క.. బతుకు పక్కా అన్నారు...
Comments
Please login to add a commentAdd a comment