పల్లె పండగ పనులు శతశాతం పూర్తి కావాలి
● ఐదు రోజుల్లో బిల్లులు అప్‌లోడ్ చేయాలి : కలెక్టర్
పార్వతీపురం టౌన్: జిల్లాలో పల్లె పండగ కింద చేపట్టిన పనులన్నీ రానున్న ఐదు రోజుల్లో శత శాతం పూర్తి కావాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఆదేశించా రు. కలెక్టర్ సమావేశ మందిరంలో పంచాయతీరాజ్, ఐటీడీఏ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె పండగ పనుల ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ముఖ్యంగా ఫార్మ్ పాండ్స్, ప్రహరీలు, మినీ గోకులాలు, రహదారులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ నెల 25 నాటికి ఎన్ని పనులు చేయగలిగితే అన్ని పూర్తి చేయాలన్నారు. పనులు వేగవంతం చేసే ప్రక్రియలో ఎటువంటి తప్పులు చేయరాదని, నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు ఇంకా పది రోజులు గడువు ఉన్నప్పటికీ బిల్లులు సమర్పించేందుకు ఐదు రోజులు మాత్రమే గడువు ఉందన్నారు. ఈ లోగా పనులు పూర్తి కావాలన్నారు. పూర్తి చేసిన పనులకు సంబంధించిన బిల్లులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. ఇంజనీరింగ్ అధికారుల అభీష్టం మేరకు లక్ష్యాలను నిర్దేశించామని, అయినప్పటికీ ఇప్పటి వరకు 40 శాతం పనులు పూర్తి చేసారని తెలిపారు. మిగిలిన 60శాతం పనులు పురోగతిలో ఉన్నందున ప్రతీ రోజూ ప్రగతి కనబరచాలని, నిర్లక్ష్యం వహించిన ఇంజనీర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. డ్వామా పీడీ రామ చంద్రరావు, పీఆర్ ఇంజనీరింగ్ అధికారి బి.చంద్రశేఖర్, సీతంపేట గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ అధికారి పి.రమాదేవి, పీఆర్ సాంకేతిక సలహాదారు ఎంవీఆర్ కృష్ణాజీ, డీఈఈలు, ఏఈఈలు పాల్గొన్నారు.
నాణ్యమైన జీడిపప్పును కొనుగోలు చేయాలి
వీడీవీకే సభ్యులు జిల్లాలో నెలకొల్పే జీడి పరిశ్రమకు నాణ్యమైన జీడి పప్పును రైతుల నుంచి కొనుగోలు చేసుకొనేలా సహకారం అందించాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. తన సమావేశ మందిరంలో సబ్ కలెక్టర్లు, ఏపీఎంలు, ఉద్యాన శాఖ అధికారులతో గురువా రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు అవసరమయ్యే జీడిపప్పును ముందుగా సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ ఏడాది 300మెట్రిక్ టన్నుల జీడి పప్పు వీడీవీకేల లక్ష్యం కావాలన్నారు. వ్యాపార వేత్తలు రైతుల నుంచి నాణ్యమైన జీడిపప్పును ముందస్తుగానే కొనుగోలు చేసే అవకాశం ఉన్నందున వీడీవీకే సభ్యులు త్వరితగతిన కొనుగోలు చేయాలన్నారు. జీడి పరిశ్రమకు అవసరమైన యంత్ర సామగ్రి, ప్రాసెసింగ్, క్రయ విక్రయాలు, బ్రాండింగ్, ప్యాకింగ్, రవాణా, మార్కెటింగ్ సదుపాయాలపై పూర్తిగా అవగాహన కల్పించి శిక్షణ ఇప్పించాలని సూచించారు. ఏప్రిల్ 15 నాటికి ఈ ప్రక్రియ పూర్తి కావాలన్నారు. పార్వతీపురం ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీవాత్సవ, సీతంపేట ఐటీడీఏ పీఓ సి. యశ్వంత్‌కుమార్ రెడ్డి, వెలుగు ప్రాజెక్టు అధికారి వై.సత్యంనాయుడు, ఏపీఎంలు, ఉద్యాన శాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment