27న విజ్ఞాన యాత్ర
పార్వతీపురంటౌన్: విజ్ఞాన యాత్రలో భాగంగా ఈ నెల 27న ఒడిశా రాష్ట్రం రాయగడలోని ఆరు ప్రాంతాలను విద్యార్థులు సందర్శించనున్నారు. ఈ మేరకు సైన్స్ ఎక్స్‌పోజర్ విజిట్ వాల్‌పోస్టర్‌ను కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌తో పాటు విద్యాశాఖ, సమగ్రశిక్ష అధికారులు శనివారం ఆవిష్కరించారు. రాయగడ పరిసర ప్రాంతాల్లోని మినరల్ వాటర్ ప్లాంట్ అండ్ బేవరేజ్ లిమిటెడ్, జె.కె.పేపర్ మిల్లు, నాగావళి ప్లాంటోరియం అండ్ సైన్స్ మ్యాజియం, పీమాకేం లైమ్‌స్టోన్ ఇండస్ట్రీ, ఇండియన్ మెటల్స్ అండ్ ఫెర్రో ఎల్లాయిస్ లిమిటెడ్, ఫారంపాత్ సందర్శన కోసం జిల్లా నుంచి 130 మంది విద్యార్థులతో పాటు 30 మంది ఉపాధ్యాయులు వెళ్లనున్నారు. కార్యక్రమంలో డీఈఓ ఎన్.తిరుపతినాయుడు, జిల్లా సైన్స్ అధికారి లక్ష్మణ్, సమగ్ర శిక్ష ఏసీపీ ఆర్.శంకర్, తదితరులు పాల్గొన్నారు.
25 వరకు గడువు పెంపు
పార్వతీపురం: బీసీ వర్గాలకు మంజూరు చేసే స్వయం ఉపాధి యూనిట్ల దరఖాస్తు గడువును ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు పొడిగించినట్లు బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్.గడ్డెమ్మ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని బీసీ, ఈబీసీ అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తిగల వారు హెచ్‌టీటీ పీఎస్://ఏపీఓబీఎంఎంఎస్.ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్.ఇన్ వెబ్‌సైట్‌లో దరఖాస్తులను సమర్పించాలన్నారు. సమర్పించిన దరఖాస్తులను ఆయా మండలాల్లోని ఎంపీడీఓలకు, మున్సిపల్ కమిషనర్‌కు అందజేయాలని పేర్కొన్నారు.
ఏనుగుల జోన్ వద్దు
సీతానగరం: మండలంలోని అమ్మాదేవి కొండ చుట్టూ ఉన్న ప్రజల ప్రాణాలకు ముప్పుతేచ్చే ఏనుగుల జోన్ ఏర్పాటుకు నిరసనగా సీపీఎం ఆధ్వర్యంలో శనివారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఏనుగుల జోన్ ఏర్పాటుచేసి వ్యవసాయం చేయకుండా చేయొద్దన్నారు. రైతుల పొట్టకొట్టొద్దంటూ నినదించారు. జోన్ ఏర్పాటుపై ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు బి.అప్పా రావు, రెడ్డి వేణు, ఈశ్వరరావు, రమణమూర్తి, వెంకటరమణ, రాంబాబు, పి.సింహాచలం, తవుడన్న, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
క్షయ నిర్మూలనలో
భాగస్వాములు కావాలి
పార్వతీపురంటౌన్: క్షయ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ కోరారు. ఈ నెల 24న ప్రపంచ క్షయ నిర్మూలన దినోత్సవం సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో శనివారం పోస్టర్ విడుదల చేశారు. క్షేత్ర స్థాయిలో సర్వే చేసి క్షయ వ్యాధి లక్షణాలున్న వారిని గుర్తించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో కఫం పరీక్షలు, ఎక్స్‌రే యంత్రాలు, సిబినాట్, 19 ఆర్‌టీపీసీఆర్ టీబీ నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉన్నాయ న్నారు. వ్యాధిగ్రస్తులకు 6 నెలలకు సరిపడా మందులు ఇవ్వడంతో పాటు ప్రతినెల రూ. 1000 చొప్పున ఖాతాలో జమచేయాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎస్.భాస్కరరావు, జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి.జగన్‌మోహన్‌రావు, జిల్లా క్షయ నియంత్రణ అధికారి వినోద్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment