ఉపశమనం ఇచ్చిన చిరు జల్లులు
భామిని: మండలంలో పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం కురిసిన చిరు జల్లులతో వాతావరణం కాస్త చల్లబడింది. రోజంతా మబ్బులు పట్టి సాయంకాలానికి చిరు జల్లులు కురువడంతో ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు. కొద్ది రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. ఈ సమయంలో కురిసిన వర్షం వాతావరణాన్ని చల్లబరిచింది.
యువతకు పీఎం ఇంటర్న్‌షిప్ : కలెక్టర్
పార్వతీపురం టౌన్: ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ కార్యక్రమాన్ని యువత సద్వినియోగం చేసుకొవాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 31వ తేదీ వరకు గడువుందని తెలిపారు. పది, ఇంటర్, డిగ్రీ, డిప్లమో, బీటెక్ ఉత్తీర్ణులైన వారు దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన 500కు పైగా ప్రముఖ పరిశ్రమలలో ఇంటర్న్‌షిప్ పొందవచ్చని సూచించారు. వయస్సు 21 నుంచి 24 మధ్య ఉండాలని, ఏడాదికి కుటుంబ ఆదాయం రూ.8 లక్షల్లోపు ఉండాలని తెలిపారు. ఏడాది పాటూ జరిగే ఈ శిక్షణకు ఎంపికై న వారికి నెలకు రూ.5000 స్టైఫండ్ లభిస్తుందని, అలాగే ఒకే మొత్తంగా రూ.6000 ప్రొత్సాహకాన్ని కూడా అందజేయడం జరుగుతుందని వివరించారు. ఎంపికై న వారికి ప్రధానమంత్రి జ్ఞానజ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాల కింద బీమా రక్షణ కల్పించడం జరుగుతుందని తెలిపారు. వివరాలకు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ కార్యాలయాన్ని సంప్రదించవచ్చనని సూచించారు.
మే 1 నుంచి సాలూరు – విశాఖ పాసింజర్ రైలు!
బొబ్బిలి: సాలూరు – విశాఖ పాసింజర్ రైలు మే 1 నుంచి నడపనున్నట్టు రైల్వే వర్గాల ద్వారా తెలిసింది. ఈ రైలు రోజుకు రెండు సార్లు విశాఖ, సాలూరు మధ్య బొబ్బిలి జంక్షన్ మీదుగా నడవనుంది. చాలా ఏళ్లుగా ఇక్కడ ఉన్న బొబ్బిలి రైల్ బస్సు కొన్ని ట్రిప్పులను బొబ్బిలి – సాలూరు మధ్య నడిపేవారు. నిత్యం కిక్కిరిసే ప్రయాణికులతో నడుస్తున్న ఈ రైల్‌బస్ కరోనా కారణంగా రైల్వే అధికారులు నిలిపివేశారు. అనంతరం సాధారణ రైళ్లు, ఎక్స్‌ప్రెస్‌లు, గూడ్స్ రైళ్లు పట్టాలెక్కినా రైల్‌బస్‌ను రైల్వే వర్గాలు నడపలేదు. కొన్నాళ్ల కిందట రైల్వే వర్గాలు విశాఖ, సాలూరు మధ్య బొబ్బిలి మీదుగా రైలును నడపనున్నట్టు ప్రకటించాయి. దీనికోసం రైలు ట్రాక్‌ను పటిష్టపరిచారు కూడా! చివరకి మళ్లీ వాయిదా పడింది. అయితే ఈ రైలును ఈ ఏడాది మే 1 నుంచి నడపనున్నట్టు తెలుస్తోంది. రైల్వే సాంకేతికాఽధికారులు సాలూరు లైన్ వద్ద ఆదివారం గేటును అమర్చారు. బొబ్బిలి నుంచి రైలు బయలుదేరిన వెంటనే రాజ్‌మహల్ వద్ద లెవెల్ క్రాసింగ్ ఉంది. ఇక్కడ క్యాబిన్‌ను కూడా నిర్మించి ఇప్పుడు గేటు కూడా ఏర్పాటు చేశారు. ఈ విషయమై రైల్వే సాంకేతికాధికారులు మే 1 నుంచి విశాఖ, సాలూరు రైలును నడపనున్నట్టు వెల్లడించారు.
ఘనంగా నృత్య కళాభారతి వార్షికోత్సవం
విజయనగరం టౌన్: భారతీయ విద్యాకేంద్ర నిర్వహణలోని నృత్య కళాభారతి ద్వితీయ వార్షికోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. సద్గురు శ్రీ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాన్ని నిర్వహించారు. నృత్య కళాభారతి నుంచి గుమ్చీ, శంకరమఠం, కోట మీదుగా బీవీకే పాఠశాల వరకూ తిరువీధి ఉత్సవాన్ని నిర్వహించారు. అనంతరం పాఠశాలలో త్యాగరాజ స్వామి పూజాకార్యక్రమం, పంచరత్న సేవ అనంతరం త్యాగరాజ విరచిత పంచరత్న కీర్తనలను కళాకారులు ఆలపించారు. కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ ఎం.ఏడుకొండలు ఆధ్వర్యంలో నిర్వహించిన సేవా కార్యక్రమంలో మహారాజా సంగీత, నృత్య కళాశాల అధ్యక్షులు కెఎవిఎల్‌ఎన్. శాస్త్రి పట్టణానికి చెందిన కళాకారులు ఎం.నీలాద్రిరావు, రాంచరణ్, పద్మావతి, రామచంద్ర శేఖర్, పద్మప్రియ, కళాభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment