కూటమి నాయకుల గలాటా
● మండల సమావేశంలో ఉద్రిక్తం
● ఎమ్మెల్సీని సమావేశానికి
రానీయకుండా కూటమి ఎత్తులు
● సుమారు మూడు గంటల పాటు నాటకీయ పరిణామాలు
పాలకొండ: కూటమి నాయకుల నక్కజిత్తుల ఎత్తులతో పాలకొండ మండల సర్వసభ్య సమావేశం సోమవారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. జీవోలను కాదని వారు చెప్పిన విధంగా సమావేశం నిర్వహించేలా అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో గందరళగోళంగా మారింది. పోలీసులు, అఽధికారులు కూటమి నాయకుల చేష్టలను చూస్తూ చేష్టలుడిగి ఉండాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించి వివరాలు పరిశీలిస్తే..సోమవారం ఉదయం 10 గంటలకు మండల సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌కు ఆహ్వానం పంపలేదు. అయినప్పటికీ జీవో నంబర్ 44 ప్రకారం తాను సమావేశానికి వెళ్లే హక్కు ఉందంటూ ఎమ్మెల్సీ విక్రాంత్, ఎంపీటీసీలు, సర్పంచ్‌లతో పాటు సమావేశ మందిరానికి ఉదయం 11 గంటలకు చేరుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఎంపీడీవో కార్యాలయానికి చేరుకుని కింద ఎంపీపీ గదిలో కూర్చున్నారు. కూటమికి చెందిన సభ్యులు అక్కడే కూర్చుని ఎమ్మెల్సీ విక్రాంత్‌ను సమావేశ మందిరం నుంచి పంపిచేస్తేనే తాము ఆ సమావేశానికి వస్తామని ఎంపీడీవోకు తెలిపారు. దీంతో ఎంపీడీవో విజయరంగారావు ఎమ్మెల్సీ విక్రాంత్‌ను సమావేశ మందిరం నుంచి బయటకు వెళ్లిపోవాలని కోరారు. దీనిపై విక్రాంత్ స్పందిస్తూ జీవో 44 ప్రకారం తాను సమావేశానికి రావడానికి హక్కు ఉందని తాను సమావేశంలో ఉంటానని పట్టుబట్టారు. ఎంపీడీవో పోలీసుల ద్వారా విక్రాంత్‌ను బయకు పంపించేందుకు ప్రయత్నించడంతో అక్కడ గందరగోళం నెలకొంది. మండలంలోని ఇతర ప్రాంతాల నుంచి సమావేశ మందిరానికి చేరుకున్న కూటమి నాయకులు అరుపులు, కేకలు వేస్తూ కవ్వింపు చర్యలకు దిగారు. సీఐ చంద్రమౌళి, ఎస్సై ప్రయోగమూర్తిలు విక్రాంత్‌ను సమావేశం నుంచి వెళ్లిపోవాలని కోరారు. దీనిపై విక్రాంత్ మాట్లాడుతూ జీవో 44 చెల్లదని ఎంపీడీవో రాతపూర్వకంగా ఇస్తే వెళ్లిపోతానని స్పష్టం చేశారు. దీంతో ఎంపీడీవో పంచాయతీరాజ్ చట్టం మేరకు జీవో 44 చెల్లదని విక్రాంత్‌కు నోటీసు అందించారు. అనంతరం ఎమ్మెల్సీ విక్రాంత్, తమ సభ్యులతో పాటు 2.30 గంటలకు బయటకు వెళ్లిపోయారు.
మండలిలో ఫిర్యాదు చేస్తా: ఎమ్మెల్సీ విక్రాంత్
ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సమావేశానికి తనను హాజరుకాకుండా అవమానపరిచిన సంఘటనపై ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ తీవ్రంగా స్పందించారు. మండల అభివృద్ధి కోసం తగిన సూచనలు సలహాలు అందించాలని, ఈ ప్రాంత రైతుల సమస్యలపై చర్చించాలని తాను సమావేశానికి హాజరైనట్లు తెలిపారు. కూటమి నాయకుల ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గి జీవో44ను విస్మరించారని విమర్శించారు. దీనిపై తాను శాసన మండలి చైర్మన్‌కు ఫిర్యాదు చేస్తానని, న్యాయపరంగా పోరాటం చేస్తానని తెలిపారు.
ఏక పక్షంగా సమావేశం..
మండల సమావేశం సోమవారం మధ్యాహ్నం నుంచి కూటమి నాయకులతో అధికారులు ఏకపక్షంగా కొనసాగించారు. వాస్తవానికి మండలంలో 12 మంది ఎంపీటీసీలు ఉంటే వారిలో 10మంది వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలే. వారిలో నలుగురు ఎంపీటీసీలను ఇటీవల కూటమి నేతలు తమ పార్టీలో చేర్చుకున్నారు. అప్పటికీ ఇరుపార్టీలకు 6 చొప్పున ఎంపీటీసీలు ఉన్నారు. ఇక సర్పంచ్‌ల విషయంలో 33 పంచాయతీలకు 25 పంచాయతీల్లో వైఎస్సార్ మద్దతుదారులే సర్పంచ్‌లుగా ఉన్నారు. ఎమ్మెల్సీ విక్రాంత్‌తో పాటు వారంతా వెళ్లిపోవడంతో ఉన్న కూటమి మద్దతు దారులతోనే సమావేశం పూర్తిచేశారు.
కూటమి నాయకుల గలాటా
కూటమి నాయకుల గలాటా
Comments
Please login to add a commentAdd a comment