గిరిశిఖర గ్రామాల్లో ఆగని మరణాలు
శృంగవరపుకోట: గిరిశిఖర గ్రామాల్లో మరణమృదంగం వినిపిస్తోంది. ఒక తల్లి గర్భశోకం మరిచిపోకముందే మరో తల్లికి గర్భశోకం కలుగుతోంది. ఎస్.కోట మండలం ధారపర్తి పంచాయతీ వరుస మరణాలతో వణుకుతోంది. స్పందించాల్సిన వైద్యారోగ్యశాఖ చేష్టలుడిగి చూస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరణాలు ఏకారణంతో జరుగుతున్నాయన్న కనీస విచారణ లేకుండా వైద్యులు చేతులు దులిపేసుకుంటున్నారని గిరిజనులు వాపోతున్నారు. ధారపర్తి గ్రామానికి చెందిన కురిన బోయిన గంగులు–సీతమ్మల ఐదు నెలల కుమారుడు మంగళవారం ఉదయం విజయనగరంలోని ఘోషా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. రెండు నెలల కిందట ఇదే పంచాయతీకి చెందిన జన్ని విజయ్ అనే చిన్నారి తనువుచాలించాడు. ఈ ఘటనపై ఆదివాసీ గిరిజన సంఘ సభ్యులు, చనిపోయిన చిన్నారి తల్లిదండ్రులు, కుటుంబీకులు అంతా తమ ప్రాణాలకు సరైన గ్యారంటీ దక్కడం లేదని, చిన్నారుల ప్రాణాలు గాలిలో కలిసి పోతుంటే వైద్యసిబ్బంది నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారంటూ ఆందోళనకు దిగారు. చిన్నారుల మరణానికి సకాలంలో వాక్సినేషన్ వేయకపోవడమే కారణమన్న వాదన వినిపిస్తోంది. పంచాయతీలోని చిన్నారులకు వాక్సినేషన్ లేకుండా చేసిన భారీ తప్పిదానికి వైద్యారోగ్యశాఖ అధికారులు ఇద్దరు ఉద్యోగులను బదిలీ చేసి చేతులు దులిపేసుకున్నా... చిన్నారుల మరణాలు అందరినీ కలచివేస్తున్నాయి.
రిఫర్ చేశాం..
ధారపర్తికి చెందిన చిన్నారి మరణం పట్ల ఎస్.కోట ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నీల స్పందించారు. తొలుత చిన్నారి తక్కువ బరువుతో పుట్టాడని, జిల్లా కేంద్రంలో ఘోషా ఆస్పత్రిలో వైద్య సేవలు అందజేశారు. ఈ నెల 3వ తేదీన చిన్నారికి ఆయాసం రావడంతో ఎస్.కోట ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. వారం రోజుల పాటు వైద్యసేవలు అందజేశాం. కోలుకున్నాక ఈ నెల 10న డిశ్చార్జ్ చేశాం. తిరిగి 23వ తేదీ రాత్రి 11.30కి చిన్నారి ఆరోగ్యం క్షీణించిందంటూ ఆస్పత్రికి తెచ్చారు. ఎలాంటి సమస్య లేకున్నా ఆయాసం తగ్గక పోవడంతో జీవక్రియలకు సంబందించి ఇబ్బంది ఉండొచ్చని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ పిడియాట్రిక్స్‌కు 24వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటలకు రిఫర్ చేశాం. ఘోషా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి చనిపోయినట్టు తెలిసిందని తెలిపారు.
అనారోగ్యంతో మరో చిన్నారి మృతి
అంతు చిక్కని కారణాలు
ఆందోళనలో ధారపర్తి గిరిజనులు
వ్యాక్సినేషన్ లేకపోవడమే కారణమా?
గిరిశిఖర గ్రామాల్లో ఆగని మరణాలు
Comments
Please login to add a commentAdd a comment