
ప్రతి ఒక్కరికీ అక్షరజ్ఞానం అవసరం
పార్వతీపురంటౌన్: జిల్లాలో వయోజన విద్య కార్యక్రమం కింద శిక్షణ పొందేవారికి కనీస అక్షర జ్ఞానం ఉండాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వయోజనులు చదవడం, రాయడం, పుస్తకాల నిర్వహణ, ప్రయాణ సమయంలో అసౌకర్యానికి గురికాకుండా ఉండడం, ఫోన్‌లో వచ్చే సమాచారాన్ని అర్థం చేసుకోకపోవడం వంటి కనీస పరిజ్ఞానం కలిగి ఉండాలన్నారు. ఉల్లాస్ మొదటి దశలో గతంలో 23,944 మంది అక్షరాస్యులయ్యారని తెలిపారు. ప్రస్తుత దశలో 25,579 మంది నిరక్షరాస్యులకు మే 5వ తేదీ నుంచి సెప్టెంబర్ 8 వరకు బోధన తరగతులు నిర్వహించాలన్నారు. డ్వాక్రా సంఘాల సభ్యుల్లో చదువుకున్న వారిని బోధకులుగా ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు.
ఈ నెల 24 వరకు నిరక్షరాస్యుల సర్వే
ఈ నెల 16 నుంచి 24వ తేదీ వరకు నిరక్షరాస్యుల సర్వే చేపడతామని కలెక్టర్ తెలిపారు. 29న మండల స్థాయిలో మండల పరిషత్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, వెలుగు ఏపీఎంలతో అవగాహన సమావేశం జరుగుతుందని వివరించారు. మే 2వ తేదీన గ్రామస్థాయిలో సమావేశం జరుగుతుందన్నారు. బోధనా తరగతులు సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు అంగన్‌వాడీ కేంద్రాలు, సామాజిక భవనాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ ఎం.సుధారాణి, ఐసీడీఎస్ పీడీ టి.కనకదుర్గ, డీపీఓ కొండలరావు, సమగ్ర శిక్ష ఏపీసీ ఆర్.తేజేశ్వరరావు, డీఐపీఆర్‌ఓ లోచర్ల రమేష్, తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 16 నుంచి నిరక్షరాస్యుల సర్వే
కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్