
పాల ఉత్పత్తి పెంపే లక్ష్యం
రామభద్రపురం: భవిష్యత్‌లో పాల ఉత్పత్తితో పాటు మేలు జాతి దూడల వృద్ధికి ప్రత్యేక దృష్టిసారించామని పశుగణాభివృద్ధి సంస్థ ముఖ్యకార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. రామభద్రపురం మండలం ఆరికతోట పంచాయతీ మధుర గ్రామం జగన్నాథపురంలో హెచ్‌ఎఫ్ పాడి ఆవుకు పిండం బదిలీ పద్ధతిలో జన్మించిన మొదటి గిర్ జాతి దూడను జేడీ వైవీ రమణతో కలిసి మంగళవారం పరిశీలించారు. దూడ ఆరోగ్యానికి అవసరమైన మందులను పాడిరైతుకు అందజేశారు. రాష్ట్రంలో పిండ బదిలీ ప్రక్రియపై 45 మంది పశువైద్యాధికారులకు శిక్షణ ఇచ్చినట్టు వెల్లడించారు. 350 పశువులకు పిండ బదిలీ ప్రక్రియ జరిపితే 15 నుంచి 20 శాతం ఫలితాలు సాధించగలిగామన్నారు. పిండం బదిలీ పద్ధతిలో మేలు జాతి దూడను సంవత్సరం కాలంలోనే పొందవచ్చన్నారు. దేశీయ గిర్, సాహివాల్, ఒంగోలు జాతి గోవుల పరిరక్షణకు ఈ విధానం అవలంభిస్తున్నామని తెలిపారు. పిండమార్పిడి ప్రయోగంలో సత్ఫలితాన్ని సాధించిన ఆరికతోట పశువైద్యుడు సురేష్‌ను అభినందించారు. కార్యక్రమంలో ఎల్‌డీఏ జి.రాధాకృష్ణ, డీడీ దామోదర్, ఏడీ ఎల్.విష్ణు పాల్గొన్నారు.
మేలు జాతి దూడల వృద్ధిపై ప్రత్యేక దృష్టి
రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ సీఈఓ
శ్రీనివాసరావు