
డీ పట్టాభూముల ఆక్రమణపై దళితుల ఆగ్రహం
పార్వతీపురంటౌన్: కూటమి ప్రభుత్వం అధికారం చేట్టిన తరువాత దళితుల సమస్యలు పట్టించుకోవడంలేదంటూ భామిని మండలంలోని లివిరి గ్రామ దళిత రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. 30 ఏళ్ల కిందట ఇచ్చిన డీ పట్టా భూముల ఆక్రమణకు నిరసనగా కలెక్టరేట్ వద్ద మంగళవారం ధర్నా చేశారు. కష్టపడి పెంచిన నీలగిరి, జీడి తోటలను అనకాపల్లికి చెందిన గుర్రం వరప్రసాద్ అనే వ్యక్తి అక్రమంగా తరలించుకుపోతున్నాడంటూ గగ్గోలు పెట్టారు. అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంపై ఆవేదన వ్యక్తంచేశారు. ఇటీవల నిర్వహించిన భూ సర్వేలో తమ డీపట్టా భూములను పరిగణనలో తీసుకోలేదని, దీనివల్లే ప్రైవేటు వ్యక్తులు ఆక్రమణలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మండల సర్వేయర్, వీఆర్‌ఓల ఆధ్వర్యంలో సర్వేలు నిర్వహించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ కార్యదర్శి కూరంగి మన్మథరావు, ఐటీటీయూసీ జిల్లా కార్యదర్శి ఆర్‌వీఎస్ కుమార్, నాయకులు జనార్దన్, ఇ.వి.నాయుడు పాల్గొన్నారు.
కష్టం మాది ఫలితం వేరేవారిది
30 ఏళ్ల కిందట ప్రభుత్వం మాకు అప్పగించిన భూముల్లో నీలగిరి పంట వేసి జీవనోపాధి సాగిస్తున్నాం. ప్రస్తుతం మా భూములు తమవంటూ అనకాపల్లికిచెందిన వ్యక్తి దౌర్జన్యం చేస్తున్నారు. మేము సాగుచేసిన నీలగిరిని తరలించుకుపోతున్నారు. తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. జిల్లా అధికారులు తక్షణమే మాకు న్యాయంచేయాలి.
– శాంతమ్మ, లివిరి గ్రామం
ఆదుకోండి సారూ..
ప్రభుత్వం మాకు ఇచ్చిన డీ పట్టా భూములకు ప్రస్తుతం రక్షణ కరువైంది. తహశీల్దార్‌కు విన్నవించుకున్నా ఫలితం లేదు. దళితులమైన మా భూములపై పెత్తందారులు అజామాయిషీ చెలాయిస్తున్నారు. అధికారులు స్పందించి భూములకు రక్షణ కల్పించాలి.
– టి.లచ్చమ్మ, లివిరి గ్రామం
30 ఏళ్ల కిందట ఇచ్చిన భూముల ఆక్రమణపై ఆందోళన
కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపిన భామిని మండలం లివిరి గ్రామ దళిత రైతులు
పట్టించుకొనేవారే కరువయ్యారు
తమ సమస్యను పరిష్కరించాలని కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. అధికారులు డబ్బున్న వారిని, అధికారం ఉన్న వారినే పట్టించుకుంటున్నారు. మా లాంటి పేదవాళ్లని ఎవరూ పట్టించుకోవడం లేదు. మా పిల్లా, పాపలతో ఎలా బతకాలి. అధికారులు స్పందించి మా భూములను మాకు అప్పగించి ఆదుకోవాలి.
– జి. చిన్నమ్మి, లివిరి గ్రామం

డీ పట్టాభూముల ఆక్రమణపై దళితుల ఆగ్రహం

డీ పట్టాభూముల ఆక్రమణపై దళితుల ఆగ్రహం

డీ పట్టాభూముల ఆక్రమణపై దళితుల ఆగ్రహం