
బైక్‌ల దొంగ అరెస్ట్
ఎంవీపీకాలనీ (విశాఖ): నగరంలో ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తున్న పాత నేరస్తుడిని ఎంవీపీ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు నగర క్రైం ఏడీసీపీ మోహనరావు శుక్రవారం వివరాలు వెల్లడించారు. మార్చి 17న పెదవాల్తేర్ రిలయన్స్ మార్ట్ ఎదుట దాసరి శంకరరావు అనే వ్యక్తికి చెందిన హోండా యాక్టివా బైక్ దొంగతనానికి గురైంది. మార్ట్ ఎదుట వాహనాన్ని పార్క్ చేసిన శంకరావు పక్కనే ఉన్న చికెన్ షాపునకు వెళ్లి వచ్చేసరికి వాహనం కనిపించలేదు. దీనిపై ఎంవీపీ క్రైం పోలీసులకు ఆయన ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు ద్వారకా క్రైం సీఐ చక్రధర్‌రావు నేతృత్వంలో దర్యాప్తు ప్రారంభించారు. మార్ట్ సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. నిందితుడు చివరిగా సంచరించిన ప్రాంతాన్ని గుర్తించి, సెల్‌ఫోన్ నంబర్ కనుగొన్నారు. సెల్‌ఫోన్ ఆధారంగా నిందితుడిని పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం, కోట సీతారామపురం గ్రామానికి చెందిన పాత నేరస్తుడు కోట శివగా గుర్తించారు. ఈ నెల 24న నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా విస్తుపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి. నగరంలోని ఎంవీపీ కాలనీ, వన్‌టౌన్, టూటౌన్, త్రీటౌన్, ద్వారకా పోలీస్‌స్టేషన్ల పరిధిలో మొత్తం 17 వాహనాలను దొంగిలించినట్లు విచారణలో వెల్లడైంది. 2024 నుంచి శివ విశాఖలో వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తేలింది. అలాగే అతనిపై 31 పాత కేసులతో పాటు జీఆర్పీలో సస్పెక్ట్ షీట్ కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి దగ్గర సేకరించిన వివరాలతో 17 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం శివను కోర్టులో హాజరుపరచగా, కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసు ఛేదించడంలో ప్రతిభ చూపిన ద్వారకా క్రైం సీఐ చక్రధర్‌రావుతో పాటు ఎస్సై అప్పలరాజు, ఏఎస్సై కిశోర్‌బాబు, పీసీలు జగత్ కిరణ్, హరిప్రసాద్, సాయి, అప్పలరాజు, అగస్టీన్‌లను పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.