పెద్దపల్లి: డబ్బుపై ఆశ.. వివాహేతర సంబంధం కారణంగా వారికి రక్త బంధం గుర్తు రాలేదు.. తోబుట్టువులే కాలయములై ఇంట్లో నిద్రిస్తున్న తమ అన్నపై పెట్రోల్ పోసి, నిప్పంటించి, కడతేర్చారు.. ఈ విషాద ఘటన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని కొత్తూరులో చోటుచేసుకుంది.
దీంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పోలీసులు, గ్రామస్తుల వివరాల ప్రకారం.. కొత్తూరుకు చెందిన గాలిపెల్లి బక్కయ్య–వినోద దంపతులకు ఇద్దరు కూమారులు, ఒక కూతురు ఉన్నారు. కూతురు పుష్పలతను సుల్తానాబాద్ మండలంలోని సుగ్లాంపల్లికి చెందిన బైరి అనిల్‌కు ఇచ్చి, వివాహం చేశారు. పెద్ద కుమారుడు అశోక్(36) ఐదేళ్లు దుబాయిలో ఉండి, పది నెలల క్రితమే స్వగ్రామం వచ్చాడు.
అతని తమ్ముడు నరేశ్ జూలపల్లి మండల కేంద్రంలో బైక్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. అశోక్ దుబాయిలో ఉంటూ సంపాదించిన డబ్బులను తన తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలో జమ చేశాడు. వాటితో నరేశ్ ధర్మారం మండల కేంద్రంలో రెండు గుంటల భూమి కొనుగోలు చేసి, తన పేరిటే రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. తండ్రి బక్కయ్య అనారోగ్యంతో మంచానికే పరిమితం కావడంతో ఇంటి వ్యవహారాలు చూసుకున్నాడు.
తమ్ముడికి వివాహేతర సంబంధం..
ఈ క్రమంలో కొత్తూరుకే చెందిన ఓ వివాహితతో అశోక్ తమ్ముడు నరేశ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమెను ఇంటికి తీసుకువస్తానని దుబాయి నుంచి వచ్చిన తన అన్నతో చెప్పాడు. దీనికి అతను కుటుంబానికి చెడ్డ పేరు వస్తుందని, తనకు పెళ్లి కావాల్సి ఉందని అభ్యంతరం చెప్పాడు. నరేశ్ ప్రవర్తన నచ్చని అశోక్ తాను పంపించిన డబ్బుల లెక్క చెప్పాలని నిలదీశాడు.
డబ్బులు తిరిగి ఇవ్వాలని చెల్లి, బావపై ఒత్తిడి
అశోక్ తన బావ అనిల్‌కు కూడా అవసరం నిమిత్తం దుబాయి నుంచి డబ్బులు పంపించాడు. వాటిని తిరిగి ఇవ్వాలని చెల్లి పుష్పలత, బావపై ఒత్తిడి చేశాడు. దీంతో ఎలాగైనా అశోక్‌ను చంపాలని నరేశ్, పుష్పలత, అనిల్ నిర్ణయించుకున్నారు.
20 రోజుల క్రితం రాత్రి అతను ఇంట్లో నిద్రిస్తుండగా దాడి చేశారు. ఈ విషయమై అశోక్ ధర్మారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇది కుటుంబ వ్యవహారంగా భావించిన పోలీసులు కులపెద్దల సమక్షంలో పంచాయితీ చేసుకొని, కలిసి ఉండాలని సూచించారు.
స్నేహితుల ఇళ్లలో ఉన్నాడు..
5 రోజుల క్రితం కులపెద్దలు అశోక్, నరేశ్‌లను పిలిపించి తల్లిదండ్రులు బతికున్నంత కాలం ఆస్తుల జోలికి వెళ్లవద్దని, చెరో రూ.లక్ష వారి వద్ద నుంచి తీసుకోవాలని సూచించారు. దీనికి అన్నదమ్ములిద్దరూ అంగీకరించారు.
అయితే తనకు ప్రాణహాని ఉందని అనుమానించిన అశోక్ ఇంటికి రాకుండా గ్రామంలోని స్నేహితుల ఇళ్లలో ఉన్నాడు. దీంతో బయట ఎందుకు ఉంటున్నావని ఇంటికి వెళ్లి, కలిసి ఉండాలని కుల పెద్దలు సూచించారు. దీంతో మంగళవారం రాత్రి ఇంటికి వచ్చి నిద్రించాడు. బుధవారం తెల్లవారుజామున నరేశ్, పుష్పలత, అనిల్ అతను బయటకు రాకుండా తలుపు గడియపెట్టారు.
కిటికీలో నుంచి నిప్పంటించారు..
నిద్రలో ఉన్న అశోక్‌పై కిటికిలో నుంచి పెట్రోల్ పోసి, నిప్పంటించారు. మంటలకు అశోక్ లేచి, బయటకు వచ్చే ప్రయత్నం చేసినప్పటికీ సాధ్యం కాలేదు. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి వరుసకు అన్న అయిన కొక్కుల రాంనారాయణ ఫిర్యాదు మేరకు ఆ ముగ్గురిపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు.
సంఘటన స్థలాన్ని పెద్దపల్లి ఏసీపీ మహేశ్, సీఐ అనిల్, ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ పరిశీలించి, వివరాలు సేకరించారు. నరేశ్, పుష్పలత, అనిల్‌పై స్థానికులు దాడి చేసేందుకు ప్రయత్నించగా అడ్డుకొని, పోలీస్ వాహనంలో ధర్మారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment