సాక్షి, పెద్దపల్లి: అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్‌లో జరుగుతాయనే ప్రచారం నేపథ్యంలో ప్రధాన పార్టీలు సర్వేల జపం చేస్తున్నాయి. బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించగా, మిగతా పార్టీలు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించాయి. సర్వేల ఆధారంగా, ప్రజల్లో ఉన్న పలుకుబడి తెలుసుకున్నాకే టికెట్లు కేటాయిస్తామని ఇప్పటికే స్పష్టం చేశాయి. దీనికి అనుగుణంగా ఆయా పార్టీలు సర్వే చేస్తున్నాయి.
మరికొందరు రెబల్ అభ్యర్థులు.. తాము పోటీలో ఉండాలా, వద్దా అనే విషయం తేల్చుకోవడానికి వివిధ సంస్థలతో సర్వే చేయిస్తున్నారు. దీనికితోడు బీఆర్‌ఎస్ అభ్యర్థుల ఖరారు తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థుల గ్రాఫ్ పెరిగిందా? లేదా తెలుసుకునేందుకు అధిష్టానం సర్వే చేయిస్తోంది. మరికొందరు సొంతంగానే లోకల్ ప్లేవర్‌తో సర్వే చేయించుకుంటున్నారు.
మరోపక్క నియోజకవర్గ ప్రజల నాడీ తెలుసుకునేందుకు వారి మొబైల్, మేసేజ్‌ల ద్వారా అభిప్రాయాలు సేకరిస్తున్నాయి పలు సర్వే సంస్థలు. వీటికి అదనంగా వాట్సప్, ఫేస్‌బుక్, ఎక్స్(ట్విట్టర్), ఇన్‌స్ట్రాగామ్.. ఇలా ఏ సోషల్ మీడియా చూసినా ఇలాంటి పోస్టులే కనిపిస్తున్నాయి. పోస్టులతోపాటు రిపోర్టులు, వాటికింద అనుచరుల ఒపీనియన్లు, వాదోపవాదాలు, తిట్ల పురాణాలతో సామాజిక మాధ్యమాలను మోతమోగిస్తున్నారు.
నియోజకవర్గ ప్రజలు ఏం అనుకుంటున్నారు?
► అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రంలో జరిగేవే అయినా.. ఆయా నియోజకవర్గాల్లో ముఖ్యమైన అంశాలు ఏమిటనే దానిపై సర్వే ఏజెన్సీలు ఫోకస్ చేస్తున్నాయి.
► నియోజకవర్గంలో పెండింగ్ అంశాలు, వాటిని పరిష్కరించడానికి ప్రస్తుత ఎమ్మెల్యే ఏం చేశారు? ఎవరు గెలిస్తే ఆయా సమస్యలు పరిష్కరించే ఆస్కారం ఉంది? అనే అంశాలపై ప్రజల నుంచి వివరాలు సేకరిస్తున్నాయి.
► ప్రజలు చెప్పే సమాచారాన్ని, ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఏ డైరెక్షన్‌లో సాగాలి? ఎలాంటి అంశాలు ఎంచుకోవాలి? అనే దానిపై నేతలు కసరత్తు చేస్తున్నారు.
► వచ్చే ఎన్నికల్లో ఎంచుకోవాల్సిన ప్రచారాస్త్రాలు, ఇవ్వాల్సిన నినాదాలపై ఇప్పటికే అన్ని పార్టీల నేతలు కసరత్తు చేస్తున్నారు.
► ప్రజల ఆకాంక్షలు, అవసరాలనే ప్రచారాస్త్రాలుగా మలచుకోవాలని భావిస్తున్నారు.
మొబైల్ ఫోన్లకు ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పా న్స్..
మొబైల్ ఫోన్లకు ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పా న్స్(ఐవీఆర్) ద్వారా ‘మీరు ఏ పార్టీకి మద్దతు తెలుపుతారు.. మా పార్టీ అభ్యర్థులకు మ ద్దతు ఇస్తారా’ అని అడుగుతున్నాయి. ‘మీరు ఫలానా ఆయనకు మద్దతు తెలిపితే ఒకటి నంబరు నొక్కండి. ఇంకొకరికి మద్దతు తెలి పితే 2, మరో ఆయనకు మద్దతు తెలిపితే 3 నంబరు నొక్కండి’ అంటూ వారి పేర్లు చెబు తూ ఆన్‌లైన్ ఫోన్‌కాల్స్ వస్తున్నాయి.
ఓటర్లు ఫోన్లు ఎత్తకపోతే మళ్లీమళ్లీ చేస్తున్నారు. పూర్తిగా కాల్ విని నంబర్లను నొక్కిన తర్వాత మళ్లీ ఫోన్లు రావడం లేదని ఓటర్లు చెబుతున్నారు. అత్యధికంగా మద్దతు తెలిపిన అభ్యర్ధులకే టికెట్లు ప్రకటించే అవకాశం ఉండటంతో సర్వే సంస్థలు ఓటర్ల మనోగతం తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని తెలుస్తోంది. కాంగ్రెస్, బీజేపీలు ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించి అభ్యర్థులను ఖరారు చేసేపనిలో ఉన్నాయి. ఎమ్మెల్యే సీట్లు ఆశిస్తున్న వారిలో ఎవరికి ప్రజల మద్దతు ఉందనే అంశాలను ఆయా పార్టీల వ్యూహకర్తలు సందేశాల ఆధారంగా ఫీడ్‌బ్యాక్ సేకరించే పనిలో నిమగ్నమవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment