పులి ఆచూకీ కోసం జల్లెడ
ముత్తారం(మంథని): నాలుగు రోజులుగా సంచరిస్తున్న పెద్దపులి జాడకోసం అటవీశాఖ అధికారులు అడవులను జల్లెడ పడుతున్నారు. అడవిశ్రీరాంపూర్ కోయచెరువు సమీపంలోని గుడ్డెలుచెలుక ప్రాంతంలో ఈనెల 2న పెద్దపులి పాదముద్రలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. మరుసటి రోజు అటవీ ప్రాంతంలో వెతికినా పులి జాడ లభించలేదు. ఈనెల 3న మానేరు తీరం నుంచి పారుపల్లి, శాలగుండ్లపల్లి యాతల్ చెరువు ద్వారా సర్వారం కాలువ వెంట మైదంబండ మీదుగా మచ్చుపేట భగుళ్లగుట్టకు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. ఐదేళ్లక్రితం భగుళ్లగుట్టలో ఓ పులి ఆవును చంపిన స్థలాన్ని, ఇతర ప్రాంతంలోనూ అటవీశాఖ అధికారులు బుధవారం పరిశీలన చేశారు. అయినా, ఆనవాళ్లు లభించలేదు. మండలంలో ప్రవేశించిన పులి ఆనువాళ్లు కని పించిన రోజు తర్వాత మరుసటిరోజు కనిపిస్తున్నాయని అధికారులు అంటున్నారు. దీనిని బట్టి చూస్తే పులి ఆచూకీ ఆనవాళ్లు గురువారం కనిపించే అవకాశం ఉందని స్థానికులు చర్చించు కుంటున్నారు. భగుళ్లగుట్ట, రామగిరిఖిలా నుంచి కాల్వశ్రీరాంపూర్ మీదుగా పెద్దపల్లి ప్రాంతం వైపు వెళ్తుందా? లేదా భగుళ్లగుట్ట నుంచి రామ గిరి మండలం గుడిమెట్టు మీదుగా మళ్లీ ముత్తా రం, మంథని మండలంలోని అటవీ ప్రాంతాల్లోకి వెళ్లుందా? అని పలువురు చర్చించుకుంటున్నారు. పశువులకాపరులు, రైతులు, రాత్రి పూట ప్రయాణం చేసే వాహనాదారులు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు కోరుతున్నారు.
భగుళ్ల గుట్ట నుంచి పెద్దపల్లి వైపు వెళ్లే అవకాశం
లేదా మళ్లీ ముత్తారం, మంథనికి చేరొచ్చంటున్న స్థానికులు
Comments
Please login to add a commentAdd a comment