డెత్‌లైన్‌ బెట్టింగ్‌! | - | Sakshi
Sakshi News home page

డెత్‌లైన్‌ బెట్టింగ్‌!

Published Thu, Mar 27 2025 12:25 AM | Last Updated on Thu, Mar 27 2025 12:27 AM

డెత్‌

డెత్‌లైన్‌ బెట్టింగ్‌!

గురువారం శ్రీ 27 శ్రీ మార్చి శ్రీ 2025

ఒంటరి గువ్వలు

ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామానికి చెందిన బండి స్వామి(28) ఆటో నడపడంతోపాటు ఎల్లారెడ్డిపేటలో పాల డెయిరీ పెట్టుకున్నాడు. ఈక్రమంలో ఏర్పడ్డ పరిచయాలతో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో రూ.18లక్షలు పోగొట్టుకున్నాడు. నిండా మునగడంతో పాలడెయిరీ, ఆటోలను సైతం అమ్మేశాడు. అయినా అప్పులు తీరకపోవడంతో మనోవేదనకు గురై 2024 నవంబర్‌ 11న పురుగుల మందు తాగి ప్రాణాలు కోల్పోయాడు. స్వామి మృతితో భార్య స్వప్న, ఇద్దరు పిల్లలు సాద్విన్‌, వర్షిత ఒంటరివారయ్యారు. స్వప్న ప్రస్తుతం బీడీలు చుడుతుండగా.. వారికి ఆసరాగా స్వామి తండ్రి లక్ష్మీనారాయణ మిర్చీ బండి పెట్టుకొని కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు.

బలైన విద్యార్థి

తిమ్మాపూర్‌ మండలం మన్నెంపల్లికి చెందిన సిరికొండ నిఖిల్‌రావు(22)హైదరాబాదులో అగ్రికల్చర్‌ బీఎస్సీ థర్డ్‌ ఇయర్‌ చదువుతున్నాడు. ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడి భారీ ఎత్తున డబ్బులు పోగొట్టుకున్నాడు. దీంతో మనస్తాపం చెంది 10 రోజుల క్రితం గ్రామంలోని ఓ వ్యవసాయబావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాగా చదువుకొని కుటుంబానికి ఆసరాగా ఉంటాడునుకున్న కొడుకు ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు బలికావడంతో ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు.

బెట్టింగ్‌ యాప్‌లలో డబ్బులు పెడితే నిమిషాల్లోనే ఐదింతలు..పదింతలు అవుతాయనే ప్రకటనలు.. ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ చేస్తే క్షణాల్లోనే మీ జీవితాలు మారుతాయనే యాడ్స్‌.. యువతను ఆకర్షిస్తున్నాయి. చదువుకునే విద్యార్థులు.. అప్పుడప్పుడే జీవితాల్లో స్థిరపడుతున్న యువత.. పిల్లాపాపలతో కుటుంబాలను నెట్టుకొస్తున్న మధ్యవయసు వారు.. అందరూ బాధితులే. కష్టపడి సంపాదించిన సొమ్మును బెట్టింగ్‌ యాప్‌లు, ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లు, ఐపీఎల్‌ బెట్టింగ్‌లలో పెడుతూ నిండా మునుగుతున్నారు. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి బయటకు రాలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాదిలో దాదాపు 10 మంది వరకు ఆత్మహత్య చేసుకున్నారు. ఇటీవల రాష్ట్రంలో బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేస్తున్న యూట్యూబర్లు.. ఇన్‌ఫ్లుయన్సర్లు.. బుల్లితెర..వెండితెర నటీనటులపై కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో బెట్టింగ్‌యాప్‌లు, ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ బాధిత కుటుంబాల పరిస్థితిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

– సాక్షి,పెద్దపల్లి/కరీంనగర్‌ టౌన్‌/ఎల్లారెడ్డిపేట/తిమ్మాపూర్‌/శంకరపట్నం

ఈజీమనీ వల.. జీవితాలు విలవిల

అప్పుల ఊబిలోకి లాగుతున్న అత్యాశ

మనీ సంపాదించవచ్చనే ప్రకటనలకు ఆకర్షణ

బెట్టింగ్‌యాప్‌లు, ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లలో పెట్టుబడులు

నిండా మునిగాక బయటకు రాలేకపోతున్న యువత

ప్రాణాలు తీసుకుంటున్న వైనం

రోడ్డున పడుతున్న కుటుంబాలు

సిటీలకే పరిమితమైన బుకీలు పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోనూ బెట్టింగ్‌ దందా సాగిస్తున్నారు. వీరి ఆధ్వర్యంలో స్థానికంగా ఉండే వారిని ఏజెంట్లగా నియమించుకుంటున్నారు. వీరు బెట్టింగ్‌లకు పాల్పడే వారిని గుర్తించి ఫోన్‌ నంబర్లతో టెలిగ్రామ్‌ గ్రూపు ఏర్పాటు చేస్తున్నారు. ఇలా చేసినందుకు ఏజెంట్లకు కమీషన్ల రూపంలో భారీగానే ముట్టజెప్పుతున్నారు. బెట్టింగ్‌లకు పాల్పడేవారు ఇతరులకు అర్థంకాకుండా కోడ్‌ భాషలు ఉపయోగిస్తున్నారు. కోడ్‌ల ప్రకారం బెట్టింగ్‌లు పెడుతున్నారు. గతేడాది ఐపీఎల్‌ సీజన్‌ పూర్తయ్యాక వచ్చిన డబ్బులతో గోదావరిఖనికి చెందిన బెట్టింగ్‌ నిర్వాహకులు పోలీసులకు చిక్కడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

కేసులు నమోదైతే చిక్కులు తప్పవు

గతంలో బెట్టింగ్‌లో పట్టుబడితే వారిపై పెట్టి కేసులు నమోదు చేసేవారు. ప్రస్తుతం పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తున్నారు. పోలీసుల రికార్డులో పేరు, చిరునామా, ఎలాంటి నేరానికి పాల్పడ్డారు అనే వివరాలు ఉంటున్నాయి. ఒక్కసారి కేసు నమోదైతే ప్రభుత్వ ఉద్యోగం లేదా విదేశాలకు వెళ్లాల్సి వస్తే ఇబ్బందులు తప్పవు. ప్రైవేటు కంపెనీలు సైతం ఉద్యోగావకాశాలు ఇవ్వవు.

ఇలా గుర్తించండి

బెట్టింగ్‌యాప్‌ బాధితులు ఎక్కువగా స్నేహితులు, కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటారని పలు సర్వేలు తెలుపుతున్నాయి. ఎక్కువ సమయం ఫోన్‌లో లీనం కావడం, తెలిసిన వారు, స్నేహితుల వద్ద అప్పులు చేయడం, ఇంట్లో వారికి తెలియకుండానే డబ్బులు తీసుకెళ్లడం వంటివి చేస్తుంటారు.

ఇలా ఫిర్యాదు చేయండి

తెలంగాణలో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ నిషేధం. బెట్టింగ్‌కు పాల్పడిన, ప్రోత్సహించినా, సహకరించినా చట్టరీత్యా చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. బెట్టింగ్‌పై ఆన్‌లైన్‌లో www. cybercrime. gov. in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయవచ్చు. అంతేకాకుండా టోల్‌ఫ్రీ నంబర్‌ 1930లోనూ కాల్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చు.

పెద్దపల్లి జిల్లాలో

కొన్ని సంఘటనలు

● 2025 మార్చి 21న మంథని మండలం విలోచవరం గ్రామానికి చెందిన సాయితేజ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు అలవాటు పడటంతో రూ.6లక్షల వరకు అప్పుల పాలయ్యాడు. ఇంట్లో విషయం తెలియడంతో మళ్లీ బెట్టింగ్‌ల జోలికి వెళ్లనని హామీ ఇవ్వగా నమ్మిన కుటుంబసభ్యులు అప్పులు తీర్చారు. తిరిగి సాయితేజ బెట్టింగ్‌లకు పాల్పడి రూ.4లక్షల వరకు అప్పులు చేశాడు. అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు.

● 2024 జూలై 4న సుల్తానాబాద్‌లో రాత్రి వేళ వాహనాలు తనిఖీ చేస్తుండగా.. రూ.33.10 లక్షల నగదుతో బెట్టింగ్‌ యాప్‌ నిర్వాహకులు పట్టుబడ్డారు. దీంతో ముగ్గురిపై కేసు నమోదు చేసి, ఐదు ఫోన్లు సీజ్‌ చేశారు.

● సుల్తానాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఒకరు క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడి సుమారు రూ.5లక్షల వరకు నష్టపోయాడు. అవి తీర్చేందుకు లోన్‌యాప్స్‌లో అప్పులు చేశాడు. తల్లిదండ్రులకు తెలిసి మందలించడంతో మళ్లీ అటువైపు వెళ్లలేదు. ఐపీఎల్‌ పేరుతో ప్రతీ ఇంటిలోకి తొంగిచూస్తున్న బెట్టింగ్‌ భూతం బారినపడకుండా కుటుంబసభ్యులే రక్షించాల్సిన అవసరం ఉంది.

న్యూస్‌రీల్‌

డెత్‌లైన్‌ బెట్టింగ్‌!1
1/7

డెత్‌లైన్‌ బెట్టింగ్‌!

డెత్‌లైన్‌ బెట్టింగ్‌!2
2/7

డెత్‌లైన్‌ బెట్టింగ్‌!

డెత్‌లైన్‌ బెట్టింగ్‌!3
3/7

డెత్‌లైన్‌ బెట్టింగ్‌!

డెత్‌లైన్‌ బెట్టింగ్‌!4
4/7

డెత్‌లైన్‌ బెట్టింగ్‌!

డెత్‌లైన్‌ బెట్టింగ్‌!5
5/7

డెత్‌లైన్‌ బెట్టింగ్‌!

డెత్‌లైన్‌ బెట్టింగ్‌!6
6/7

డెత్‌లైన్‌ బెట్టింగ్‌!

డెత్‌లైన్‌ బెట్టింగ్‌!7
7/7

డెత్‌లైన్‌ బెట్టింగ్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement