జగిత్యాలఅగ్రికల్చర్: వ్యవసాయ శాస్త్రవేత్తలు రాత్రింబవళ్లు కష్టపడి పరిశోధనలు చేసి.. అత్యుత్తమ విత్తనాలు తయారు చేసినప్పటికీ వాటి ఫలాలు వివిధ కారణాలతో రైతుల చెంతకు చేరడం లేదు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు సమన్వయంతో సాగులో సమస్యలను ఎప్పటికప్పుడు తీర్చాల్సి ఉన్నా.. ముందుకు కదలడం లేదు. ఈ నేపథ్యంలో సాగులో సమస్యలపై చర్చించేందుకు ఉత్తర తెలంగాణ జోనల్ స్థాయి శాస్త్రవేత్తల సదస్సు పొలాస పరిశోధన స్థానంలో గురువారం ప్రారంభం కానుంది. ఈ సదస్సు రెండురోజుల పాటు నిర్వహించనున్నారు. జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, 10 జిల్లాల వ్యవసాయాధికారులు పాల్గొననున్నారు.
మూడు ఉమ్మడి జిల్లాలకు కేంద్రం పొలాస
జగిత్యాలలోని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం మూడు ఉమ్మడి జిల్లాలైన కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు కేంద్రం. ఈ కేంద్రం పరిధిలోనే ఆయా జిల్లాలోని వ్యవసాయ పరిశోధన స్థానాలు, డాట్ సెంటర్లు, కృషి విజ్ఞాన కేంద్రాలు పనిచేస్తాయి. వీటిల్లో దాదాపు 60 నుంచి 70 మంది వ్యవసాయ శాస్త్రవేత్తలు పనిచేస్తుంటారు. పొలాస వ్యవసాయ పరిశోధన స్థానంలో వరి, వేరుశనగ, నువ్వు పంటల సాగు విధానాలు, సాగు నీటి యాజమాన్యంపై పరిశోధనలు చేస్తుంటారు. కరీంనగర్ పరిశోధన స్థానంలో మొక్కజొన్న, పెద్దపల్లిలోని కూనారం పరిశోధన స్థానంలో వరి, మొక్కజొన్న పంటలు, ఆదిలాబాద్ పరిశోధన స్థానంలో పత్తి, జొన్న, వరి, సోయాచిక్కుడు, ముథోల్ పరిశోధన స్థానంలో వర్షాధార పత్తి, రుద్రూర్ పరిశోధన స్థానంలో చెరుకు, వరి పంటల సాగు విధానంపై పరిశోధనలు సాగుతుంటాయి. అయితే పరిశోధన ఫలాలను ఎప్పటికప్పుడు రైతులకు తెలియజేసేందుకు శాస్త్రవేత్తలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ప్రతి సీజన్‌లో తమ పరిశోధన స్థానాల్లో సాగు చేసిన పంటలను తిలకించేలా ప్రదర్శన క్షేత్రాలు, సాగు సమస్యలు తెలుసుకునేలా కిసాన్ మేళాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ నిధుల కొరతతో ఎప్పుడో ఒకసారి మమ అన్పించేలా జరుగుతుంటాయి.
సమన్వయం అంతంతే..
జిల్లాలోని ఆయా మండలాల్లో పనిచేసే వ్యవసాయ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తల మధ్య సమన్వయం లోపిస్తోంది. కనీసం ప్రతి పంటల సీజన్‌లో నెలకోమారు ఉండేలా సమావేశాలు కనిపించడం లేదు. రైతులకు సాగులో సమస్యలు, సందేహాలు వచ్చినప్పుడు ఎక్కడకు వెళ్లాలో తెలియడం లేదు. రైతులు కొత్త పంటలు సాగు చేద్దామనుకున్నా.. ఏ పంట విత్తనం ఎక్కడ దొరుకుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. క్షేత్రస్థాయిలో రైతులు పొలాలను సందర్శించేందుకు వెళ్లినప్పుడు వ్యవసాయాధికారులు అందుబాటులో ఉండటం లేదు. వ్యవసాయాధికారులు ఏదైనా సమస్యపై శాస్త్రవేత్తల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ సకాలంలో క్షేత్ర సందర్శనకు రావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. రైతులు శాస్త్రవేత్తలు, అధికారుల చుట్టూ తిరగలేక ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఫర్టిలైజర్ దుకాణాలను ఆశ్రయించి వారు ఇచ్చిన మందులు పిచికారీ చేస్తున్నారు.
పొలాలకు చేరని పరిశోధనలు
శాస్త్రవేత్తల పరిశోధనలు రైతుల చెంతకు చేరడం లేదు. శాస్త్రవేత్తలు శ్రమటోడ్చి రూపొందించిన విత్తనాలను రైతులు ఆదరిస్తుంటే.. కొన్ని రకాల విత్తనాల విషయమే రైతులకు తెలియని పరిస్థితి ఉంది. రైతులు ఏం కావాలనుకుంటున్నారు..? ఎలాంటి పరిశోధనలు చేస్తే రైతులకు ఉపయోగం ఉంటుందనే విషయాలపై ఆలోచించకుండా.. మూస ధోరణిలో ఉన్నతాధికారులు అదేశాల మేరకు పరిశోధనలు చేస్తున్నారు. రైతులు ప్రధానంగా కూలీలు, మార్కెటింగ్ సమస్యను ఎదుర్కొంటున్నారు, వాతావరణ మార్పులతో పంటల్లో తెగుళ్లు, పురుగుల విజృంభన ఎక్కువవుతుంది. ప్రతి సీజన్‌లో అధిక దిగుబడినిచ్చే విత్తనాల కోసం రైతులు వెతుకులాడుతున్నారు. ప్రైవేట్ విత్తన కంపెనీలు రక రకాల పేర్లతో విత్తనాలు తయారు చేసి రైతులకు విక్రయిస్తుంటే.. నిధుల కొరతతో అనుకున్న స్థాయిలో పరిశోధన స్థానాల్లో విత్తనోత్పత్తి జరగడం లేదు.
రెండు రోజుల పాటు సాగు సమస్యలపై సదస్సు
హాజరుకానున్న ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల శాస్త్రవేత్తలు
రైతల కోసం పరిశోధనలు చేయాలి
శాస్త్రవేత్తలు మూస ధోరణిలో కాకుండా రైతులకు అవసరమైన పరిశోధనలు చేసి అభిమానాన్ని చూరగొనాలి. వరి పంటకు ప్రత్యామ్నాయ పంటలు, కోతుల సమస్యపై ప్రధానంగా దృష్టి పెట్టాలి. వాతావరణ మార్పులు రైతులకు పెద్ద సమస్యగా మారింది. వాటిపై పరిశోధనలు చేయాలి.
– సత్యనారాయణరెడ్డి, జిల్లా ఉత్తమ రైతు, నాగారం, ధర్మపురి మండలం
రైతుల ఆదాయం పెరిగేలా..
రైతుల ఆదాయం పెరిగేలా శాస్త్రవేత్తల పరిశోధనలు సాగాలి. సాగులోని సమస్యలను ఎప్పటికప్పుడు రైతులతో చర్చించాలి. సాగులో వస్తున్న సమస్యలు రైతులకు సవాల్ విసురుతున్నాయి. నామమాత్రంగా సమావేశాలు నిర్వహించడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు.
– వెల్ముల రాంరెడ్డి, వ్యవసాయ వర్సిటీ
సలహా మండలి మాజీ సభ్యుడు, పూడూరు
పరిశోధనలు రైతుకు చేరితేనే సార్థకత!
పరిశోధనలు రైతుకు చేరితేనే సార్థకత!
పరిశోధనలు రైతుకు చేరితేనే సార్థకత!