
ముందుకు.. వెనక్కి!
● కొత్తపల్లి– మనోహరాబాద్ రైల్వేలైన్ కోసం కదులుతున్న ఫైళ్లు ● సిరిసిల్లలో 751 ఎకరాల సేకరణకు రూ.400 కోట్లు వెచ్చింపు ● దాచారం నుంచి బోయినపల్లి వరకు భూమిని గుర్తించిన అధికారులు ● మరో 107 ఎకరాల కోసం రూ.69 కోట్లు అవసరం ● మిడ్‌మానేరులో 37ఎకరాలకు బదులుగా కోనరావుపేటలో భూమి ● కరీంనగర్‌లోనూ 50 ఎకరాలు సేకరించిన అధికారులు
కరీంనగర్‌లో 50 ఎకరాలకు రూట్ క్లియర్
కొత్తపల్లి– మనోహరాబాద్ రైల్వేట్రాక్ కోసం గంగాధర మండలం ఉప్పర మల్యాల రెవె న్యూ గ్రామం పరిధిలోని ఉప్పరమల్యాల, రంగారావుపల్లెలో 50.19 ఎకరాల భూసేకరణ ప్రక్రియ కొలిక్కి వచ్చింది. ఈ భూమిలో కొత్తపల్లి– వేములవాడ మధ్య ఐదు కిలోమీటర్ల రైల్వే ట్రాక్‌ను అధికారులు నిర్మించనున్నారు. ఈ భూమితోపాటు ఇక్కడ ఉన్న 23 ఇళ్లను ప్రభుత్వం రైల్వేశాఖకు అప్పగించడంతో పనులు మొదలు కానున్నాయి. ఇంటికి రూ.15లక్షలు, ఎకరానికి రూ.20 లక్షల చొప్పున చెల్లిస్తున్నారు. గత సెప్టెంబరులో ఈ భూమిపై అభ్యంరాలపై నోటిఫికేషన్ వేసిన ప్రభుత్వం గ్రామసభలతో కొలిక్కి తీసుకొచ్చింది. వేములవాడ నుంచి వచ్చే ఈ ట్రాక్ గంగాధర సమీపంలోని కొత్తపల్లి స్టేషన్‌కు అనుసంధానం చేయడంతో మార్గం పూర్తవుతుంది.
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
కొత్తపల్లి– మనోహరాబాద్ రైల్వేలైన్ భూసేకరణలో అధికారులు కాస్త వేగం పెంచినట్లు కనిపిస్తోంది. ఈ పనుల్లో నెలకొన్న జాప్యాన్ని చూస్తుంటే.. ఒకడుగు ముందుకుపడితే.. రెండడుగులు వెనక్కి అన్నట్లుగా ఉంది పరిస్థితి. ప్రస్తుతమైతే ఈ పనుల కోసం ఇటు సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలో రెవెన్యూ అధికారులు దస్త్రాలను చకచకా ముందుకు కదుపుతున్నారు. ప్రస్తుతం సిరిసిల్ల జిల్లాలో పనులు కొనసాగుతున్నాయి. దాచారం నుంచి బోయినపల్లి వరకు దాదాపు 954 ఎకరాల భూమిని అధికారులు రైల్వేలైన్ కోసం గుర్తించగా ఇప్పటి వరకూ 751 ఎకరాలు సేకరించారు. భూములు కోల్పోయిన రైతులు, నిర్వాసితులకు రూ.400 కోట్ల వరకు ప్రభుత్వం చెల్లించింది. రైల్వేలైన్ కోసం దాదాపు 107ఎకరాల భూమిని ఇప్పటికే అధికారులు గుర్తించారు. ఈ భూమికి పరిహారంగా మరో రూ.69 కోట్ల వరకు నిర్వాసితులకు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఈ నిధులు విడుదల కావాల్సి ఉంది. ఇవి వస్తే భూసేకరణ ప్రక్రియ మరింత వేగవంతమవుతుంది. మరోవైపు మిడ్‌మానేరు పరిధిలోని చింతల్‌మెట్, తాడూరు పరిధిలోని దాదాపు 37ఎకరాల అటవీభూమిని సేకరించారు. ఇందకోసం ప్రత్యామ్నాయంగా కోనరావుపేటలో మరో 40 ఎకరాల భూమిని అటవీ ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు అప్పగించారు.
సిరిసిల్ల వరకు పనులు నత్తనడకే
మనోహరాబాద్– కొత్తపల్లి వరకు దాదాపు 151 కిలోమీటర్లకు రూ.1167 కోట్లతో 2016లో ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రస్తుతం 79కిలోమీటర్ల మేర ట్రాక్ పనులు పూర్తయి.. సిద్దిపేట వరకు రైలు సర్వీసు అందుబాటులోకి వచ్చింది. సిద్దిపేట నుంచి సిరిసిల్ల వరకు జల, రోడ్ల మార్గాలు అధికంగా ఉన్న కారణంగా ఇక్కడ కల్వర్టులు, వంతెనలకు నిధుల విడుదల్లో జాప్యంతో పనులు ఆలస్యంగా నడుస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం.. 2023 మార్చిలోనే రైల్వే పనులు సిరిసిల్ల వరకు పూర్తికావాలి. సిద్దిపేట నుంచి కొత్తపల్లి వరకు ట్రాక్ పనులు పూర్తయేందుకు దాదాపు రూ.850 కోట్ల వరకు నిధులు అవసరం అవుతాయని దక్షిణమధ్య రైల్వే అంచనా వేస్తోంది. ఈ లెక్కన చూస్తే.. కొత్తపల్లి వరకు ట్రాక్ పనులు పూర్తయ్యేందుకు మరో రెండేళ్లు పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మార్గం పూర్తయితే రాజధానితోపాటు జగిత్యాల మీదుగా ముంబై, పెద్దపల్లి మీదుగా ఢిల్లీ, వరంగల్‌కు మార్గం సుగమం అవుతుంది.