సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు, 2021 చివరి రోజున రాజ్యసభలో హింసకు పాల్పడిన 12 మంది విపక్ష ఎంపీలపై తాజాగా సస్పెన్షన్ వేటు విధించారు. వీరంతా పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సభకు హాజరుకాకుడదని తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. భద్రతా సిబ్బందిపై ఉద్దేశపూర్వకంగా అసాధారణ దుష్ప్రవర్తన, ధిక్కార, హింసాత్మక, వికృత ప్రవర్తన కారణంగా వీరిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు.
సస్పెండ్ చేసిన వారిలో ఆరుగురు కాంగ్రెస్ నేతలతో పాటు శివసేన నేత ప్రియాంక చతుర్వేది, అనిత్ దేశాయ్, టీఎంసీ డోలా సేన్, శాంతా ఛెత్రి, సీపీఎం నేత ఎలమరం కరీం, మరో సీపీఐ నేత ఉన్నారు. ఈ ఏడాది వర్షాకాల పార్లమెంట్ సమావేశాల చివరి రోజైన ఆగస్టు 11న లోక్‌సభలో పెగాసస్ స్పైవేర్‌పై చర్చించాల్సిందిగా అధికార, విపక్షాల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో విపక్ష నేతలు మహిళా సిబ్బందిపై చేయి చేసుకున్నారనే ఆరోపణలు వెలుగు చూశాయి.
(చదవండి: క్రిప్టోకరెన్సీపై కేంద్రం కీలక నిర్ణయం..!)
జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ (నేషనలైజేషన్) సవరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి సూచించాలని డిమాండ్ చేసినప్పటికీ దాన్ని ఆమోదించడంతో సభ దద్దరిల్లింది. ఇక సీసీటీవీ ఫుటేజీలో ప్రతిపక్ష సభ్యులు రాజ్యసభలో భద్రతా సిబ్బంది మీదకు దూసుకెళ్లడం కనిపించింది. నల్లజెండాలు చేతపట్టుకున్న ఎంపీలు టేబుల్స్ పైకిఎక్కి ఫైళ్లు, పత్రాలు చెల్లాచెదురు చేయడం సీసీటీవీలో రికార్డయ్యింది.
(చదవండి: మహిళా ఎంపీలతో సెల్ఫీ.. ‘ఇదేం బుద్ధి’ అంటూ శశి థరూర్‌పై విమర్శలు)
మహిళా మార్షల్స్‌పై విపక్షాలు అసభ్యంగా ప్రవర్తించాయని ప్రభుత్వం ఆరోపించగా, ప్రతిపక్షం ఒక ఉమ్మడి ప్రకటనలో "మహిళా ఎంపీలతో సహా ప్రతిపక్ష నాయకులు, సభ్యులపై చేయి చేసుకోవడానికిగాను ప్రభుత్వం బయటి వ్యక్తులను తీసుకువచ్చింది" అని ఆరోపించింది. ఈ క్రమంలో నాటి హింసాత్మక ఘటనకు సంబంధించి 12 మంది ఎంపీలపై తాజాగా సస్పెన్షన్ వేటు వేశారు.
Comments
Please login to add a commentAdd a comment