రాజకీయంగా వైరిపక్షాలైన కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై మొగ్గలోనే వైఎస్సార్‌సీపీని తుంచేసేందుకు కుట్రలు చేశాయి. ప్రపంచ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ ఎదుర్కోనన్ని సవాళ్లు.. దాడులను ఎదుర్కొంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వాటినే సోపానాలుగా మలుచుకుంటూ.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అలుపెరుగని పోరాటం చేశారు. 45 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు.. విప్లవాత్మక సంస్కరణలతో సుపరిపాలన అందిస్తూ వైఎస్సార్‌సీపీని బలీయమైన శక్తిగా తీర్చిదిద్దారు.
సాక్షి, అమరావతి: కాంగ్రెస్ పార్టీకి రెండుసార్లు ఒంటి చేత్తో అధికారాన్ని అందించిన వైఎస్ రాజశేఖరరెడ్డి 2009 సెప్టెంబరు 2న హెలికాప్టర్ ప్రమాదంలో హఠాన్మరణం చెందారు. ఆ విషాద వార్తను తాళలేక వందలాది మంది మరణించడం.. వైఎస్ జగన్‌ను, ఆయన కుటుంబీకులను కలిచి వేసింది. అలా మరణించిన వారి కుటుంబాలను పరామర్శించడానికి ఓదార్పు యాత్ర చేపడతానని కర్నూలు జిల్లా నల్లకాలువ వద్ద 2009 సెప్టెంబరు 25న నిర్వహించిన వైఎస్సార్ సంస్మరణ సభలో వైఎస్ జగన్ ప్రకటించారు.
2010 ఏప్రిల్ 9న పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఓదార్పు యాత్ర ప్రారంభించారు. ఆ యాత్రను ఆపేయాలని కాంగ్రెస్ అధిష్టానం వైఎస్ జగన్‌ను ఆదేశించింది. ఇది రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేదని.. తల్లి వైఎస్ విజయమ్మ, సోదరి షర్మిలతో కలిసి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాందీకి వైఎస్ జగన్ వివరించినా లాభం లేకపోయింది.
ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి... వైఎస్ జగన్ ఓదార్పు యాత్రను కొనసాగించారు. దీంతో కాంగ్రెస్‌లోని కొన్ని శక్తులు, టీడీపీతో కుమ్మక్కై కుట్రలకు తెరతీశాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌కు, పులివెందుల శాసనసభ, కడప లోక్‌సభ స్థానాలకు వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ రాజీనామా చేశారు.
జనం పక్షాన పోరుబాట
ప్రజా సమస్యలపై వైఎస్ జగన్ పోరుబాట పట్టారు. ఈ నేపథ్యంలో జగతి పబ్లికేషన్స్‌కు ఆదాయపు పన్ను శాఖతో నోటీసులు జారీ చేయించడం ద్వారా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వేధింపుల పర్వాన్ని ప్రారంభించారు. అయినా వాటిని లెక్క చేయని వైఎస్ జగన్.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనే లక్ష్యంగా, రాష్ట్ర సమగ్రాభివృద్ధే ధ్యేయంగా 2011 మార్చి 11న వైఎస్సార్‌సీపీ పేరును ప్రకటించారు. ఆ మరుసటి రోజే వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో వైఎస్ సమాధి వద్ద పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.
2011 ఏప్రిల్ 12న కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. కడప లోక్‌సభ స్థానం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా వైఎస్ జగన్, పులివెందుల శాసనసభ స్థానం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా వైఎస్ విజయమ్మ పోటీ చేసి, రికార్డు మెజార్టీతో విజయం సాధించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలతో 2011 ఆగస్టు 10న వైఎస్ జగన్ ఆస్తులపై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించింది.
నైతిక విలువలే పునాది
నైతిక విలువలతో రాజకీయాలు చేయాలన్నది వైఎస్ జగన్ సిద్ధాంతం. వైఎస్సార్‌సీపీలో ఎవరైనా చేరాలంటే.. వారు ఆ పార్టీకి, ఆపార్టీ ద్వారా సంక్రమించిన పదవులకు రాజీనామా చేసి రావాలని షరతు విధించారు. దానికి కట్టుబడిన 19 మంది ఎమ్మెల్యేలు, ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ ద్వారా సంక్రమించిన పదవులకు రాజీనామా చేసి, వైఎస్సార్‌సీపీలో చేరారు. వారిని తిరిగి గెలిపించుకునేందుకు వైఎస్ జగన్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
అదే సమయంలో వైఎస్ జగన్‌ను విచారణ పేరుతో పిలిచిన సీబీఐ 2012, మే 27న అరెస్టు చేసింది. దీన్ని ప్రజలు నిరసిస్తూ ఉప ఎన్నికల్లో 17 శాసనసభ, నెల్లూరు లోక్‌సభ స్థానంలో వైఎస్సార్‌సీపీని గెలిపించారు. 2013 సెప్టెంబరు 24న వైఎస్ జగన్‌కు కోర్టు బెయిల్ ఇచ్చింది. 16 నెలలపాటు అక్రమంగా నిర్బంధించడం వల్ల ప్రజల్లో ఆదరణ మరింత పెరిగింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో 2014 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఒంటరిగా బరిలోకి దింగింది.
టీడీపీ–బీజేపీ–జనసేనతో జట్టుకట్టి బరిలోకి దిగింది. మోదీ ప్రభంజనంలో కేవలం ఐదు లక్షల ఓట్ల తేడాతో రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అధికారానికి దూరమైంది. 67 శాసనసభ స్థానాలు గెలుచుకుని బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. చంద్రబాబు కుట్రతో వైఎస్ జగన్ రెక్కలకష్టంతో గెలిచిన∙23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఫిరాయించారు. వారిపై అనర్హత వేటు వేయాలని జగన్ పోరాటం చేశారు.
ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో నలుగురిని మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా రాజకీయాల్లో నైతిక విలువకు నాటి సీఎం చంద్రబాబు సమాధి కట్టారు. దీన్ని నిరసిస్తూ.. ప్రజల్లోనే తేల్చుకుంటానని ప్రకటిస్తూ 2017 అక్టోబర్ 26న శాసనసభ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు వైఎస్ జగన్ ప్రకటించారు.
చరిత్రాత్మకం.. ప్రజా సంకల్పం
తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్ద నుంచి 2017 నవంబర్ 6న ప్రజా సంకల్ప పాదయాత్రను వైఎస్ జగన్ ప్రారంభించారు. 14 నెలలుపాటు 3,648 కి.మీ.ల దూరం ఈ యాత్ర సాగింది. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ప్రజలు అఖండ విజయాన్ని అందించారు. దేశ చరిత్రలో 50 శాతానికిపైగా ఓట్లతో 151 శాసనసభ (87 శాతం), 22 లోక్‌సభ (88 శాతం) స్థానాలను వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది. 2019 మే 30న ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.
తొలి మంత్రివర్గంలో 56 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చి.. ఐదు డిప్యూటీ సీఎం పదవుల్లో నాలుగు ఆ వర్గాలకే ఇచ్చి.. హోంశాఖ మంత్రిగా తొలిసారిగా ఎస్సీ మహిళను నియమించి సామాజిక విప్లవానికి వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. 2022 ఏప్రిల్ 11న పునర్ వ్యవస్థీకరణ ద్వారా మంత్రివర్గంలో ఏకంగా 70 శాతం పదవులు ఆ వర్గాల వారికి ఇచ్చి, సామాజిక సాధికారత సాధనలో దేశానికే రోల్ మోడల్‌గా నిలిచారు.
దేశ చరిత్రలో ఎక్కడా లేని రీతిలో నామినేటెడ్ పదవుల్లో, పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు.. మహిళలకు రిజర్వు చేసేలా చట్టం తెచ్చి మరీ పదవులు ఇచ్చారు. ఎమ్మెల్సీ, రాజ్యసభ, స్థానిక సంస్థల పదవుల్లోనూ ఆ వర్గాలకే పెద్దపీట వేశారు. అధికారంలోకి వచ్చిన 45 నెలల్లోనే 98 శాతానికిపైగా హామీలను అమలు చేశారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు వెన్నుదన్నుగా నిలిచారు.
గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజల గుమ్మం వద్దకే ప్రభుత్వాన్ని తీసుకెళ్లారు. 13 జిల్లాలను పునర్ వ్యవస్థీకరించి.. 26 జిల్లాలను ఏర్పాటు చేశారు. ఎన్నో పథకాల ద్వారా పేద, దిగువ మధ్యతరగతి వర్గాలకు అండగా నిలిచారు. జనరంజక పాలన అందిస్తుండటంతో ప్రజలు పంచాయతీ, మున్సిపాలిటీ, జిల్లా పరిషత్, ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు, అభ్యర్థులను గెలిపించారు.
వైఎస్సార్‌సీపీ ప్రస్థానంలో కీలక ఘట్టాలు
Comments
Please login to add a commentAdd a comment