9వ రోజు మేమంతా సిద్దం బస్సు యాత్రలో నినదించిన సింహపురి ప్రజానీకం
నెల్లూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథ పట్టిన జనవాహిని
(మేమంతా సిద్ధం బస్సు యాత్ర నుంచి)సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కుల మతాలకు అతీతంగా తమకు మేలు చేసిన సీఎం వైఎస్ జగన్‌ను దగ్గరి నుంచి చూడాలని, వీలైతే మాట్లాడాలని ఊరూ వాడల్లోని చిన్నా, పెద్దా తరలివచ్చి శనివారం 9వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు బ్రహ్మరథం పట్టారు. ‘మళ్లీ నువ్వే కావాలి జగన్’ అంటూ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు.
కావలి బహిరంగ సభ జన సంద్రాన్ని తలపించింది. చింతారెడ్డిపాలెంలోని రాత్రి బస నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ యాత్ర ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. అంతకు ముందు తనను కలిసిన నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కావలి, సర్వేపల్లి, ఆత్మకూరు, ఉదయగిరి, కందుకూరు నియోజకవర్గాలకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఎన్నికల కార్యాచరణపై సీఎం జగన్ దిశా నిర్దేశం చేశారు.
ఈ క్రమంలో చింతారెడ్డిపాలెం రోడ్‌షోలో ఓ మహిళ తన బిడ్డ అనారోగ్య బాధను చెప్పుకునేందుకు ఎదురు చూస్తుండడాన్ని గమనించిన సీఎం.. దగ్గరకు పిలిపించుకుని మాట్లాడారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. భగత్‌సింగ్ కాలనీకి చేరుకునే సరికి జాతీయ రహదారిపై భారీగా హాజరైన మహిళలు ఘన స్వాగతం పలికారు.
అడుగడుగునా ఘన స్వాగతం
కోవూరు నియోజకవర్గం పడుగుపాడులో పలువురు మహిళలు గుమ్మడికాయలతో దిష్టితీసి సీఎం విజయాన్ని కాంక్షించారు. బుల్లితెర నటుడు రియాజ్ సైతం సీఎంను కలిసి బస్సు యాత్రకు సంఘీభావం తెలిపారు. అనంతరం సున్నబట్టి, తిప్ప మీదుగా సీఎం రోడ్ షో నిర్వహించారు.
మధ్యాహ్నం 12 గంటలకు రాజుపాళ్యంలో మండుటెండను సైతం లెక్కచేయకుండా ఎదురు చూస్తున్న అక్కచెల్లెమ్మలను ఆప్యాయంగా పలకరించి సంక్షేమ పథకాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. చింతరెడ్డిపాలెం నుంచి సింగరాయకొండ వరకు చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారిపై ప్రజాభిమానం వెల్లువెత్తింది. బస్సు దిగి సీఎం జగన్ మహిళలు, వృద్ధులను పలుకరించారు.
ఎండను లెక్క చేయని అభిమానం
ఐదేళ్ల పాలనలో తాము ఆర్థికంగా నిలదొక్కుకుని, ఆత్మగౌరవంతో జీవించడానికి చేదోడుగా నిలిచిన సీఎం జగన్‌ను ఒక్కసారైనా చూడాలన్న ప్రజల కోరిక ముందు భగభగమండే సూరీడు సైతం చిన్నబోయాడు. మిట్ట మధ్యాహ్నం 41 డిగ్రీలకు పైగా ఉన్న ఎండను సైతం లెక్క చేయకుండా తిప్ప, గౌరవరం, కావలి బైపాస్‌లో మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, చంటిబిడ్డ తల్లులు రోడ్లపై బారులు తీరి జననేతను చూడటానికి పోటీపడ్డారు.
మార్గం మధ్యలో భారీ గజమాలతో సత్కరించారు. సీఎం జగన్ 4.30 గంటలకు రోడ్‌షో ద్వారా కావలిలోని సభా స్థలికి చేరుకున్నారు. సభ అనంతరం సీఎం బస్సు యాత్ర ఏలూరుపాడు, ఉలవపాడు మీదుగా 7 గంటలకు సింగరాయకొండ క్రాస్‌కు చేరుకుంది. ఉదయం నుంచి సీఎం రాక కోసం ఎదురు చూస్తున్న ప్రజలు గజమాలతో స్వాగతం పలికారు.
అనంతరం ఓగురు మీదుగా 8 గంటలకు కందుకూరుకు చేరుకున్న సీఎం జగన్ బస్సు యాత్రపై బంతిపూల వర్షం కురిసింది.పొన్నలూరు, వెంకుపాలెం మీదుగా ప్రకాశం జిల్లాలోని జువ్విగుంట క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్ చేరుకున్నారు.
జనసంద్రమైన కావలి
పెద్ద ఎత్తున కదలివచ్చిన జనం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి మద్దతుగా కావలిలో నినాదాలు హోరెత్తించారు. జాతీయ రహదారి జనాలతో కిక్కిరిసిపోయింది. సీఎం జగన్ నాయకత్వంపై ప్రజల్లో విశ్వాసానికి జనసంద్రమే ప్రతీక అని పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.
ఆ బిడ్డను చూడకపోతే ఎలా?
సూరీడు నడినెత్తిపైకి వచ్చాడు.. ఎండ వేడికి రోడ్డు సెగలు పుట్టిస్తోంది.. చెట్టు నీడలోనూ చెమట చుక్క ఆరట్లేదు.. ఇంతలో నెత్తిపై తుండు గుడ్డతో బక్కపల్చని శరీరంతో 70 ఏళ్ల వృద్ధురాలు కావలి పట్టణ శివారులో కనిపించింది. ఎవరి కోసమో ఎదురు చూస్తోంది. ‘ఏం అవ్వా.. మండుటెండలో ఇక్కడేం చేస్తున్నావు’ అని అడిగితే.. ‘జగన్ బాబు ఇంకా రాలేదా.. ఎంత దూరంలో ఉన్నాడు..’ అని ఎదురు ప్రశ్నించింది.
‘ఈ వయసులో ఒక పక్క గస పోస్తూ ఎందుకీ తిప్పలు’ అంటే.. ఒకింత కోపంతో చూసింది. నాలాంటోళ్లు ఎందరికో ఆయన ఎంతో మేలు చేశాడు. ‘అలాంటి బిడ్డ మా ఊరికి వచ్చినప్పుడు చూడకపోతే ఎలా? నా పేరు శాంతమ్మ. నాకు ముగ్గురు ఆడ బిడ్డలు. పెళ్లిళ్లు చేసుకుని వెళ్లిపోయారు. అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తుంటారు.
కానీ.. జగన్ బాబు నా బాగు కోసం ప్రతి నెలా 1వ తేదీనే ఇంటికి పింఛన్ పంపించాడు. అది ఇప్పుడు ఇంటికి రాకుండా వాళ్లు (టీడీపీ)ఆపేశారు. అందుకే జగన్‌బాబు ఏం చేబితే అది చేద్దామని ఇక్కడికి వచ్చాను’ అని చెప్పింది. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో శాంతమ్మలాంటి ఎంతో మంది అవ్వాతాతలు కనిపించారు.
Comments
Please login to add a commentAdd a comment