మోసాలు కావాలా? మంచి కొనసాగాలా ?  | CM YS Jagan in Etukuru meeting | Sakshi
Sakshi News home page

మోసాలు కావాలా? మంచి కొనసాగాలా ? 

Published Sat, Apr 13 2024 4:43 AM | Last Updated on Sat, Apr 13 2024 7:00 AM

CM YS Jagan in Etukuru meeting  - Sakshi

పాలకుడు మోసగాడు అయితే బతుకులు అంధకారం అవుతాయి: సీఎం జగన్‌

మీరే నా స్టార్‌ క్యాంపైనర్లు..  

ప్రతి ఇంటికీ వెళ్లి మంచికి అండగా నిలబడమని కోరాలి 

చంద్రబాబుకు ఓటు వేయడమంటే.. మరోసారి మోసపోవడమే 

ఇంటికొస్తున్న పింఛన్లు ఆపిన వారితో జరుగుతున్న యుద్ధం ఇది 

అబద్ధాల బాబుకు దత్తపుత్రుడు, వదినమ్మ వంత పాట 

ముగ్గురూ కలిసి రోడ్లపై అబద్ధాల బుర్ర కథలు చెబుతున్నారు 

ఏటుకూరు మేమంతా సిద్ధం సభలో సీఎం వైఎస్‌ జగన్‌ 

సాక్షి ప్రతినిధి, గుంటూరు: ‘మోసాల చంద్రబాబు నుంచి మన రాష్ట్రం, పేదల భవిష్యత్తును కాపాడుకునేందుకు జరుగుతున్న ఈ యుద్ధంలో మీరంతా ప్రతి ఇంటికి వెళ్లి గత 58 నెలలుగా జరిగిన మంచిని వివరించాలి. ప్రతి ఇంటికి వెళ్లి వాస్తవాలు వివరించి స్టార్‌ క్యాంపైనర్లుగా చేయాలి. ఈ మంచి కొనసాగాలంటే మీ బిడ్డ మళ్లీ రావాలి.. మోసపోకూడదంటే మీ బిడ్డకే ఓటు పడాలి అని ప్రతి గడపకూ చెప్పాలి’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి గుంటూరు శివారు ఏటుకూరు వద్ద నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభలో సీఎం జగన్‌ ప్రసంగించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. 

అందరి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ..
ఈరోజు గుంటూరులో కనిపిస్తున్న ఈ మహా జన సముద్రం చరిత్రలో ఎప్పటికి నిలిచిపోతుంది. మనందరి ప్రభుత్వానికి మద్దతుగా ఇప్పుడు జరుగుతున్న మంచిని కాపాడుకునేందుకు, ఆ మంచిని కొనసాగించేందుకు ఇక్కడికి వచ్చిన ప్రతి అ­వ్వా­­తాత, సోద­రులు, స్నేహితులకు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియచేస్తున్నా.

రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని రీతిలో ప్రతి గ్రామానికి పౌర సేవలు, విద్య, వైద్యం, రైతన్న లకు భరోసా, అక్క చెల్లెమ్మలకు సాధికారత, అవ్వాతా­తలు, వితంతువులు, దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ సే­వ­లు అందించిన మన ప్రభుత్వానికి మద్దతు పల­కడానికి మీరంతా సిద్ధమేనా? గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఏకంగా రూ.2.70 లక్షల కోట్లను ఒక్క రూపాయి కూడా లంచం, వివక్షకు తావు లేకుండా 130 సార్లు బటన్‌ నొక్కి పారదర్శకంగా నేరుగా అందించిన ఈ ప్రభుత్వానికి, మీ జగన్‌కు మద్దతుగా ఫ్యాన్‌ గుర్తుపై రెండు బటన్లు నొక్కేందుకు, మరో వంద మందికి చెప్పి నొక్కించడానికి మీరంతా సిద్ధమేనా? 

రోడ్లపై అబద్ధాల బుర్ర కథలు..
ఈ ఎన్నికల యుద్ధం కేవలం చంద్రబాబుకు, జగన్‌­కు మధ్య జరుగుతున్నది కాదు. ఈ యుద్ధం బాబు మోసాలకు, ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధం. ఇది ఇంటింటికి పెన్షన్‌ అందించిన ప్రభుత్వానికి, వాటిని ఆపిన బాబు దుర్మార్గాలకు మధ్య జరుగు­తున్న యుద్ధం. ఇది వారి మోసాలకు, మన విశ్వస­నీ­యతకు మధ్య జరుగుతున్న యుద్ధం. ఆ అబ­ద్ధాల బాబుకు ఇద్దరు వంత పాడుతున్నారు. ఒకరు దత్తపుత్రుడు, మరొక­రు ఆయన వదినమ్మ.  ఈ ము­గ్గురు కలిసి రోడ్లపై అబద్ధాల బుర్ర కథలు చెబు­తున్నారు. 2014 హామీ­ల్లో ఏ ఒక్కటీ నెరవేర్చకుండా మోసగించిన బాబు ఇప్పుడు సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవన్‌ అంటూ నమ్మబలుకుతున్నారు. 



మంచి కొనసాగాలో వద్దో ఆలోచించండి..
ఈ రోజు మీరంతా ఇంటికి వెళ్లాక కుటుంబ సభ్యులతో కలసి ఒక్క అంశంపై ఆలోచన చేయమని కోరుతున్నా. మీ బిడ్డకు ఓటు వేయడం అంటే గత 58 నెలలుగా జరుగుతున్న మంచిని మీరందరూ కొనసాగించేందుకే ఓటు వేసినట్లే. మీ బిడ్డకు కాకుండా చంద్రబాబుకు ఓటు వేయడం అంటే దాని అర్థం.. ఈ  58 నెలలుగా మీకు జరుగుతున్న మంచిని మీ అంతట మీరే మీకు వద్దని చెప్పినట్లేనని గుర్తుంచుకోవాలని కోరుతు న్నా.

58 నెలల క్రితం మీ బిడ్డ మీ అందరి ముందు నిలబడి ఫలానాది చేస్తానని ఎన్నికల మేనిఫెస్టో తీసుకొచ్చాడు. మేనిఫెస్టోను బైబిల్, భగవద్గీత, ఖురాన్‌ మాదిరిగా భావించి 99 శాతం హామీలను అమలు చేసి మీ ముందుకు వచ్చి మరోసారి ఆశీస్సులు కోరుతున్నాడు. 

సెల్‌ఫోన్‌ లైట్లతో సంఘీభావం..
వలంటీర్లు మళ్లీ మన ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్‌ బాగుండాలన్నా, పథకాలన్నీ కొనసా­గాలన్నా, లంచాలు లేని పాలన కొనసాగాలన్నా, మన పిల్లల చదువులు, బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయం, మన ఆస్పత్రులు బాగుండాలన్నా ప్రతి ఒక్కరూ ఫ్యాన్‌ గుర్తుకే ఓటు వేయా­లి. 175కి 175 అసెంబ్లీ సీట్లు, 25కి 25 పార్లమెంట్‌ సీట్లలో ఏ ఒక్కటీ తగ్గకుండా గెలిపించేందుకు మీరు సిద్ధమేనా? పేదల భవిష్యత్తు బాగుండాలని చే­స్తున్న ఈ యుద్ధానికి మీరంతా సెల్‌ఫోన్లలో టార్చి­లైట్లు వెలిగించి సంఘీభావం తెలియచేయాలి.

పాలకుడు మోసగాడైతే...
ఎలాంటి వారు రాజకీయ నాయకుడిగా ఉండాలి? ఎలాంటి వారిని మనం ముఖ్యమంత్రిగా తెచ్చుకోవాలన్న విషయంపై ప్రతి ఇంట్లో చర్చ జరగాలి. ఎందుకంటే మనం వేసే ఓటు ద్వారా రాబోయే ఐదేళ్ల జీవితం ఆ పాలకుడి చేతుల్లో పెడుతున్నాం. ఆ పాలకుడికి మంచి మనసు ఉండి మంచి చేస్తే మన జీవితాలు బాగుపడతాయి. ఆ పాలకుడు మోసగాడు అయితే మన బతుకులు అంధకారం అవుతాయి. పిల్లల జీవితాలు అస్తవ్యస్తం అవు­తాయి. అక్కచెల్లెమ్మల బతుకులు అతలాకు­తలం అవుతాయి. రైతన్నల జీవితాలు మోసపోయి ఆత్మహత్యల పాలవుతాయి. అవ్వాతాతల సంక్షేమం అడుగంటిపోతుంది. అందుకే ఈ వాస్తవా­లపై ప్రతి ఇంట్లోనూ చర్చ జరగాలని కోరుతున్నా.

గుంటూరు పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేస్తున్న కిలారు రోశయ్య, అసెంబ్లీ అభ్యర్థులు నూరి ఫాతిమా, బలసాని కిరణ్‌కుమార్, మురుగుడు లావణ్య, మేకతోటి సుచరిత, అన్నాబత్తుని శివకుమార్, విడదల రజని, అంబటి మురళీకృష్ణ, మండలి చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎంపీలు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, నందిగం సురేష్, ప్రభుత్వ విప్‌ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు మహ్మద్‌ ముస్తఫా, మద్దాళి గిరి, పార్టీ జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్, పార్టీ నేతలు నిమ్మకాయల రాజనారాయణ, మందపాటి శేషగిరిరావు, బత్తుల దేవానంద్‌ తదితరులు ఏటుకూరు సిద్ధం సభలో పాల్గొన్నారు. 

బాధలు విన్నాడు.. భరోసా ఇచ్చాడు..
తనను కలిసిన బాధితులకు సీఎం జగన్‌ ఆపన్న హస్తం 
సాక్షి, అమరావతి : మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ను పలువురు కలిసి తమవారికి వచ్చిన కష్టాలు చెప్పుకొన్నారు. వైద్యం అందించాలని కోరారు. వారి బాధలు సావధానంగా విన్న సీఎం జగన్‌.. ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి కోమాలోకి వెళ్లిన తన సోదరుడు షేక్‌ సుభానికి వైద్యం చేయించండన్నా అంటూ గుంటూరు జిల్లా క్రోసూరు మండలం ఊటుకూరుకు చెందిన బాజీబీ సీఎం జగన్‌ను వేడుకున్నారు.

సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల సమీపంలోని భాగ్యనగర్‌ కాలనీ వద్ద మేమంతా సిద్ధం బస్సు యాత్రకు సీఎం జగన్‌ వస్తున్నారని తెలుసుకుని కోమాలో ఉన్న సోదరుడిని కుటుంబ సభ్యులతో కలిసి అంబులెన్స్‌లో తీసుకొచ్చి రోడ్డుపై నిలబడింది బాజీబీ. వారిని గమనించిన సీఎం వెంటనే బస్సు దిగి సమస్యను తెలుసుకున్నారు. వీఆర్‌వోగా పనిచేస్తున్న సుభాని గత ఆగస్ట్‌లో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడని, అప్పటి నుంచి కోమాలోకి వెళ్లాడని చెబుతూ ఇప్పటి వరకు రూ.20 లక్షలు ఖర్చయ్యాయని, సీఎం సహాయనిధి ద్వారా ఎమ్మెల్యే నంబూరు శంకరరావు రూ.3 లక్షలు సాయం కూడా అందించారని సీఎం దృష్టికి తెచ్చారు.

ఇక వైద్యం చేయించే స్తోమత తమకు లేదన్నారు. వారి సమస్యను విన్న సీఎం జగన్‌.. సుభానికి ప్రభుత్వమే వైద్యం చేయిస్తుందని భరోసా ఇచ్చారు. అలాగే, దాచేపల్లి మండలం శ్రీనగర్‌కు చెందిన గంటెల వెంకటేశ్వర్లు, శారదల 12 ఏళ్ల కుమారుడు చరణ్‌కు పుట్టుకతోనే మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఎదుగూ బొదుగూ లేకుండా మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు.

మేమంతా సిద్ధం యాత్రకు ధూళిపాళ్ల శివారులో సీఎం జగన్‌ రోడ్‌ షో చేస్తుండగా బస్సు వెంట ఆ బాలుడిని ఎత్తుకుని తల్లిదండ్రులు పరుగెత్తడం సీఎం జగన్‌ గమనించి.. బస్సాపి వారిని పిలిచి వివరాలు తెలుసుకున్నారు. ఎంత ఖర్చయినా సరే చరణ్‌కు వైద్యం చేయిస్తామని తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. వైద్యానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా తన సిబ్బందిని ఆదేశించారు.   

బాబు మోసాలకు వంతపాడుతున్న వదినమ్మ, దత్తపుత్రుడు
సీఎం వైఎస్‌ జగన్‌
సాక్షి, అమరావతి: చంద్రబాబు మోసాల బుర్రకథకు తానా అంటే తందానా అంటూ ఆయన వదినమ్మ, దత్తపుత్రుడు వంతపాడుతూ రోడ్లపై కని పిస్తున్నారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ‘మీ బిడ్డకు ఓటు వేయడమంటే 58 నెలలుగా మీకు జరుగుతున్న మంచిని కొనసాగించాలని ఓటు వేస్తున్నట్లు లెక్క. అదే చంద్రబాబుకు ఓటు వేయడం అంటే దాని అర్థం.. మీకు జరుగుతున్న మంచి మాకొద్దు అని ఓటు వేసినట్లు అవుతుంది. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి’ అని ప్రజలను కోరుతూ సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు. 

భారీ వర్షంలోనూ జనం ‘సిద్ధం’
భోజన విరామం కూడా లేకుండా 9 గంటల పాటు సీఎం జగన్‌ యాత్ర 
అభిమాన సముద్రం ముందు గాలి దుమారం తేలిపోయింది. ఈదురు గాలులు వీస్తున్నా జనసందోహం చెక్కు చెదరని సంకల్పంతో జననేత కోసం నిరీక్షించింది. శుక్రవారం  మేమంతా సిద్ధం బస్సుయాత్ర  పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ధూళిపాళ్ల నుంచి గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం నంబూరు వరకు జరిగింది. యాత్ర మేడికొండూరు చేరుకునేసరికి ఈదురు గాలులతో వర్షం మొదలైంది.

జన సంద్రమే గొడుగులా సీఎం జగన్‌ కాన్వాయి ముందుకు సాగింది. గుంటూరులో మధ్యాహ్నం మూడు గంటల నుంచి  ఐదు గంటల వరకు పలుదఫాలుగా వర్షం పడింది. గాలుల ధాటికి పలు చోట్ల ఫ్లెక్సీలు ఒరిగిపోవడంతో ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాటిని నిలబెట్టడం గమనార్హం. ఏటుకూరులో భారీ వర్షం కురవడంతో సభా ప్రాంగణం మొత్తం తడిచి ముద్ద అయింది.

ప్రతిచోటా అభిమానులు, ప్రజలు భారీగా తరలిరావడంతో ముఖ్యమంత్రి జగన్‌ బస్సు యాత్ర శుక్రవారం భోజన విరామం కూడా లేకుండా తొమ్మిది గంటల పాటు నిరాటంకంగా సాగింది. గుంటూరు జిల్లాలో పేరేచర్ల నుంచి సభా ప్రాంగణం వరకు సుమారు 16 కిలోమీటర్ల మేర జనసంద్రాన్ని తలపిస్తూ రోడ్‌షో జరిగింది.  

2014 ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే..
ఒక్కసారి 2014 ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే.. నాడు కూడా ఇదే కూటమి! మేనిఫెస్టో అంటూ రంగు రంగుల కాగితాలతో ప్రజల జీవితాలతో చెలగా టమా­డారు. ఇదే చంద్రబాబు సంతకం చేసి దత్తపుత్రుడు, ప్రధాని మోదీ ఫొటోలతో పాంప్లెట్లు ముద్రించి ప్రతి ఇంటికి పంపారు. మీరు మర్చిపోతారేమోననే భయంతో టీవీలలో, పేపర్లలో ఊదరగొట్టారు. చంద్రబాబు నాటి మోసాల్లో ఒక్కసారి ముఖ్యమైన వాటిని మీకు గుర్తు చేస్తా.

రైతులకు రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ అయ్యాయా? 
♦ పొదుపు సంఘాల రుణాలు రూ.14,205 కోట్లు మాఫీ చేస్తామని చెప్పి కనీసం ఒక్క రూపాయైనా మాఫీ చేశాడా?
♦ ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద బ్యాంకులో రూ.25 వేలు డిపాజిట్‌ చేస్తామన్నాడు. మీకుగానీ, మీ ఇంటి చుట్టుపక్కల వారికిగానీ ఎవరికైనా ఒక్క రూపాయి డిపాజిట్‌ చేశారా?
♦ ఇంటికో ఉద్యోగం లేదంటే రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. ఐదేళ్లలో అంటే 60 నెలల పాటు నెలకు రూ.రెండు వేలు చొప్పున ప్రతి ఇంటికి రూ.1.20 లక్షలు ఇచ్చాడా?
♦ మహిళా ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేస్తామన్నారు. మరి చేశాడా? 
♦ సింగపూర్‌కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు.. మరి జరిగిందా?
♦ ప్రతి నగరంలో హైటెక్‌ సిటీ నిర్మిస్తామన్నాడు. మరి గుంటూరులో ఏమైనా కనిపిస్తోందా?  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement