కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ), బీజేపీల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. పరస్పర విమర్శలు, ఆరోపణలతో ఇరువర్గాలు రాజకీయ వేడిని పెంచుతున్నాయి. ఈ క్రమంలో టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీ, బీజేపీ నేత సువేందు అధికారిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నారద, శారద పోంజి స్కాం వంటి కుంభకోణాల్లో తనకు భాగస్వామ్యం లేదంటూ తనపై చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. తాను అధికార దుర్వినియోగానికి పాల్పడ్డానని రుజువు చేస్తే బహిరంగంగా ఉరివేసుకోడానికి సిద్ధమని సవాల్ విసిరారు.
కాగా ఇటీవలే టీఎంసీని వీడి బీజేపీలో చేరిన సీనియర్ నేత సువేందు.. పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో ఆదివారం జరిగిన ఓ ర్యాలీలో ప్రసంగిస్తూ.. అభిషేక్ బెనర్జీపై విమర్శలు గుప్పించారు. తోలాబాజ్(అధికార దుర్వినియోగానికి పాల్పడి బలవంతపు వసూళ్లు చేసేవాడు) అంటూ విరుచుకుపడ్డారు. అలాంటి వాళ్లను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలంటూ పిలుపునిచ్చారు. ఇక తన నియోజకవర్గమైన డైమండ్ హార్బర్‌లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న అభిషేక్ బెనర్జీ సువేందు వ్యాఖ్యలకు దీటుగా బదులిచ్చారు. పార్టీకి వెన్నుపోటు పొడిచిన వారికి తనను విమర్శించే హక్కులేదన్నారు. (చదవండి: 21 ఏళ్లు.. అందుకు సిగ్గుపడుతున్నా!)
ఈ మేరకు.. ‘‘లక్షణాలు బయటపడని కోవిడ్-19 రోగులు మన పార్టీలో చాలా మందే ఉండేవారు. వారి కార్యకలాపాలను మేం ట్రేస్ చేశాం. వారిని గుర్తించాం. 2019 లోక్‌సభ ఎన్నికల నాటి నుంచి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ, పార్టీని నాశనం చేసేందుకు ప్రయత్నించిన వైరస్ వెళ్లిపోవడం పట్ల నాకు చాలా సంతోషంగా ఉంది. నిజమైన తోలాబాజే నన్ను ఆ మాట అంటున్నారు. శారద స్కాంలో ఆయన పేరు బయటకి వచ్చింది. ఒక్క విషయం చెప్పనా ఫ్రెండ్.. నేను నారద, శారద కుంభకోణాల్లో భాగస్వామిని కాను. ఈడీ, సీబీఐ నాపై దాడులు చేసినా ప్రతిఫలం ఉండదు. ఏం చేయాలనుకుంటున్నారో చేసుకోండి’’ అని సువేందుకు కౌంటర్ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment