
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు అరెస్ట్‌పై టీడీపీ నేతలు, ఆయన కుటుంబ సభ్యుల కంటే పవన్ కల్యాణ్ ఎక్కువగా స్పందించారని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కర్నూల్ నుంచి చంద్రబాబును తాడేపల్లి తీసుకొచ్చే లోపు లూథ్రాకి ఒక ఫ్లైట్, పవన్‌కి ఒక ఫ్లైట్ బుక్ చేసారు. కేసులను మభ్యపెట్టడానికి లూథ్రా, ప్రజల్ని మభ్యపెట్టడానికి పవన్ కల్యాణ్ ఉన్నారని ప్రజలకు అర్థమైందన్నారు.
‘‘నడి రోడ్డుపై పడుకుని చంద్రబాబు కోసం పవన్ కల్యాణ్ తాపత్రయపడ్డారు. 2019లో అన్ని తిట్లు తిట్టిన తర్వాత కూడా పవన్ ఎందుకు చంద్రబాబు పంచన చేరారు. అరెస్ట్ తర్వాత పవన్.. లోకేష్‌ను ఓదార్చుతూ.. చంద్రబాబును అభిమానిస్తూ మాట్లాడారు. అమలాపురంలో 2 వేల మంది రౌడీలు జన సైనికులను చంపాలని కుట్ర పన్నినట్టు తనకి సమాచారం వచ్చిందని పవన్ మాట్లాడారు. సేమ్ అదే సీన్ పుంగనూరులో రిపీట్ అయ్యింది. చంద్రబాబు ప్రతీ కుట్రలో పవన్‌కు భాగస్వామ్యం ఉంది’’ అని అడపా శేషు పేర్కొన్నారు.
‘‘రాష్ట్రంలో ఎన్నో హత్యలకు చంద్రబాబు కారకుడు. వంగవీటి రంగా మరణానికి కుట్ర చేసింది చంద్రబాబే. వంగవీటికి రంగా హత్యకు చంద్రబాబు కారకుడని ఆయనకు టీ ఇచ్చిన వ్యక్తికి తెలియదా?. ముద్రగడను రోడ్డుపై ఈడ్చినపుడు పవన్ కనిపించలేదు. పవన్‌కు ఉన్న జనాదరణకు కారణం చిరంజీవి, కాపు కులమే కారణం. కాపు కులానికి పవన్ కళ్యాణ్ చేసిందేమీ లేదు. అన్నయ్య చిరంజీవి పేరు చెప్పుకోలేని వ్యక్తి పవన్. కాపు కులస్తులందరూ గమనించాలి. పవన్ పూర్తిగా ముసుగు తీసేసాడు.’’ అని అడపా శేషు మండిపడ్డారు.
‘‘వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కాపులు ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందుతున్నారు. పవన్‌కు బుక్ చేస్తున్న ఛార్టర్డ్ ఫ్లైట్‌లు, ఆయన ఆస్తులపై విచారణ జరపాల్సిన అవసరం ఉంది. పవన్ పొలిటికల్ ప్రొడ్యూసర్స్ ఎవరు?. రంగా హత్య నుంచి కాపులంతా చంద్రబాబు పతనం కోసం ఎదురు చూస్తున్నారు. చంద్రబాబుపై అనేక కేసులు ఉన్నాయి. ఇక బయటకు రాడు. టీడీపీ ముఖ్యమంత్రి అభ్యర్థి లోకేషా, బాలకృష్ణా, పవన్ కళ్యాణా తేల్చుకోవాలి’’ అంటూ అడపా శేషు వ్యాఖ్యానించారు.
చదవండి: అందుకే బాబును జైల్లోనే ఉంచాలనేది: ఏఏజీ