మంత్రులు సురేష్, నాగార్జున
సాక్షి, అమరావతి: చంద్రబాబు దర్శకత్వంలోనే పవన్ కళ్యాణ్ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌పై సమావేశం నిర్వహించారని పురపాలక, సాంఘిక సంక్షేమ శాఖల మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున మండిపడ్డారు. సబ్ ప్లాన్‌పై ఈనాడు పత్రిక తప్పుడు రాతలతో ఎక్కాలు అప్పజెబుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సంతృప్త స్థాయిలో.. ఎక్కడా అవినీతికి తావు లేకుండా ఎస్సీ, ఎస్టీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్ని పథకాలు అమలు చేస్తున్నారనే విషయాన్ని పవన్ తెలుసుకోవాలన్నారు.
పవన్‌కు లెక్కలు, నిజాలు తెలియకపోతే తాము చెబుతామన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వారు వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ సంక్షేమ పాలన చూసి ఓర్వలేక రామోజీరావు తప్పుడు రాతలు రాస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాకే ఎస్సీ, ఎస్టీలకు అధిక లబ్ధి చేకూరిందన్నారు. రామోజీ తన స్వగ్రామంలో ఏ వర్గానికి ఎంత లబ్ధి జరిగిందో తెలుసుకోవాలని హితవు పలికారు.
ఐదేళ్లలో ఎస్సీలకు టీడీపీ ప్రభుత్వం ఖర్చు చేసింది కేవలం రూ.33,635 కోట్లేనన్నారు. అదే తమ ప్రభుత్వం ఈ మూడున్నరేళ్లలోనే ఎస్సీల సంక్షేమం కోసం రూ.48,909 కోట్లు ఖర్చు పెట్టిందన్నారు. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఎస్టీల కోసం కేవలం రూ.12,487 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే, తమ ప్రభుత్వం ఈ మూడున్నరేళ్లలోనే రూ.15,589 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. ఇవాళే పవన్‌కు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ గుర్తుకు వచ్చిందా? అని నిలదీశారు.
చంద్రబాబు సబ్‌ప్లాన్ నిధులు దారి మళ్లించినప్పుడు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. దత్తపుత్రుడు అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. జనాభా ప్రాతిపదికన సబ్ ప్లాన్‌ను గతంలో ఎలా వినియోగించారో పవన్ తెలుసుకోవాలన్నారు. దళిత ద్రోహి, దళిత వ్యతిరేకి అయిన చంద్రబాబును పవన్ ఎలా సమర్థిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ వర్చువల్‌గా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment