సాక్షి, న్యూఢిల్లీ : భారత్-చైనా సరిహద్దులో పరిస్థితులపై రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన చేశారు. తూర్పు లడఖ్‌లో ఇరుదేశాల సైనిక బలగాల ఉపసంహరణ దిశగా చర్చలుకొనసాగుతున్నాయని పార్లమెంట్‌లో గురువారం వెల్లడించారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు తెరపడేలా చైనాతో కీలక ఒప్పందం చేసుకున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఈ మూరకు చైనా రక్షణమంత్రితో చర్చించల అనంతరం, పూర్తిస్థాయిలో సైనిక బలగాల ఉపసంహరణపై అంగీకారం కుదిరిందని ప్రకటించారు. మిగిలిన సమస్యలను కూడా పరిష్కరించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేయనున్నామని రాజ్‌నాథ్ రాజ్యసభకు వివరించారు. దీంతో భారత, చైనా సరిహద్దుల్లో గతకొన్ని నెలలుగా కొనసాగుతున్న ఉద్రికత్తకు ఎట్టకేలకు తెరపడినట్టయింది. (చైనా బలగాల ఉపసంహరణ ప్రారంభం)
చైనాకు ఒక్క అంగుళం భూమి కూడా వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన ఆయన సైనికులు అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించారంటూ భారత జవాన్లపై ప్రశంసలు కురిపించారు. మూడు సిద్ధాంతాల ఆధారంగా సమస్య పరిష్కరించుకోవాలని చైనాకు సూచించామనీ రక్షణమంత్రి వెల్లడించారు. ఏ దేశమైనా ఏకపక్షంగా వాస్తవ నియంత్రణ రేఖను మార్చే ప్రయత్నం చేయకూడదనీ ఇరువైపుల నుంచి ప్రయత్నాలు ఉంటేనే ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగుతాయన్నారు. లడఖ్ సరిహద్దులో కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెరపడేలా బలగాల ఉపసంహరణపై చైనాతో కీలక ఒప్పందానికొచ్చామనీ ఈ ఒప్పందంతో ఇరుదేశాలు దశల వారీగా పరస్పర సమస్వయంతో బలగాలను ఉపసంహరించుకోనున్నాయని ఆయన తెలిపారు. ప్యాంగ్యాంగ్ సరస్సుకు ఉత్తరాన ఉన్న ఫింగర్ 8 వద్ద చైనా బలగాలు ఉంటాయి. భారత బలగాలు ఫింగర్ 2 వద్ద ఉన్న పర్మనెంట్ బేస్ వద్ద ఉంటాయని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ‘తూర్పు లడఖ్‌లో ప్రస్తుత పరిస్థితి’ పై రాజ్‌నాథ్ సింగ్ ఈ రోజు సాయంత్రం 5.00 గంటలకు లోక్‌సభలో ఒక ప్రకటన చేయనున్నారని రక్షణ మంత్రి కార్యాలయం వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment