ఎడపాడి పళనిస్వామి, పొన్నయ్యన్
సాక్షి ప్రతినిధి, చెన్నై: మొన్నటి వరకు పన్నీర్‌సెల్వంతో పోరాడిన ఎడపాడి పళనిస్వామికి కొత్త తలనొప్పి వచ్చిపడింది. పార్టీ నుంచి పొన్నయ్యన్‌ను బహిష్కరించాలని మాజీ మంత్రులు కొందరు అప్పుడే నిరసన గళం విప్పారు. కన్యాకుమారి జిల్లాకు చెందిన పార్టీ ప్రముఖుడొకరు పొన్నయన్‌తో రహస్య సంభాషణ చేసినట్లుగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఆడియో, ఆయనను బహిష్కరించాలనే డిమాండ్ ఎడపాడిని ఇరుకునపెట్టింది.
చదవండి: మరో కొత్త వివాదం.. అన్నాడీఎంకే ఖజానాపై ‘వారిద్దరి’ కన్ను
ఆడియోలోని వివరాలు.. మాజీ మంత్రి కేపీ మునుస్వామి డీఎంకే మంత్రి దురైమురుగన్ సిఫార్సుతో క్వారీల కాంట్రాక్టు పొంది నెలకు రూ.2 కోట్లు సంపాదిస్తున్నట్లు, అలాగే మాజీ మంత్రి తంగమణి సైతం తన అక్రమాస్తులను ఏసీబీ దాడుల నుంచి కాపాడుకునేందుకు సీఎం స్టాలిన్‌కు మద్దతుగా వ్యవహరిస్తున్నారని, మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు సీవీ షణ్ముగం గురించి విమర్శలు చేసినట్లు, ఎంజీఆర్, జయలలితల గురించి అమర్యాదగా మాట్లాడినట్లు ఆ సంభాషణల్లో ఉన్నాయి.
అంతేగాక తంగమణి, వేలుమణి దొంగలు, డబ్బు, కాంట్రాక్టులు ఇచ్చి 42 మంది ఎమ్మెల్యేలను గుప్పిట్లో పెట్టుకున్నారని, వాస్తవానికి ఎడపాడికి కేవలం 9 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మద్దతు పలుకుతున్నారని కూడా మాట్లాడారు. ఈ కారణంగా పొన్నయ్యన్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలని ఎడపాడిపై మాజీ మంత్రులు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆడియో సంభాషణలను పొన్నయ్యన్ ఖండించారు. సాంకేతిక పరిజ్ఞానంతో తన గొంతుకను ప్రచారంలోకి తెచ్చారని ఆరోపించారు. మాజీ మంత్రులపై తాను తప్పుగా మాట్లాడలేదని పేర్కొన్నారు. అయితే, మొత్తం ఈ ఆడియోల వివాదం కోర్టుకెక్కగా గురువారం విచారణ జరగనుంది.
పన్నీర్, శశికళపై నిఘా
పార్టీ పగ్గాలు చేజారిపోవడంతో పన్నీర్‌సెల్వం, శశికళ ఏకంకావాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు అన్నాడీఎంకే నేతలు అనుమానిస్తున్నారు. వీరిద్దరూ రహస్యంగా కలుసుకుని మంతనాలు సాగిస్తున్నారనే సమాచారం అందడంతో నిఘాపెట్టి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎడపాడిపై జరుపుతున్న న్యాయపోరాటంలో నెగ్గకుంటే మరో మార్గంలో రాజకీయంగా దెబ్బకొట్టేందుకు పన్నీర్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదే అదనుగా పన్నీర్‌ను తమవైపు తిప్పుకోవాలని కొందరు, జయ అన్న కుమార్తె, కుమారులైన దీప, దీపక్ పన్నీర్‌సెల్వంను ఇంటికి విందుకు ఆహా్వనించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ విందుకు శశికళను కూడా ఆహ్వానిస్తాం, కలిసి కొత్త పార్టీ స్థాపించి ఎడపాడి ఎత్తుగడలను చిత్తుచేయవచ్చని పన్నీర్‌కు గాలం వేస్తున్నట్లు సమాచారం. అయితే ప్రచారాన్ని ఓపీఎస్ వర్గీయులు నిర్ధారించడం లేదు.
17న ఎమ్మెల్యేలతో ఎడపాడి సమావేశం
పారీ్టలో ఇంతటి గందరగోళ పరిస్థితులు కొనసాగుతుండగా ఈనెల 17వ తేదీన ఎమ్మెల్యేలతో ఎడపాడి పళనిస్వామి సమావేశం నిర్వహిస్తున్నారు. 18వ తేదీన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్, పన్నీర్ బహిష్కరణతో ప్రధాన ప్రతిపక్ష ఉపనేత పదవి భర్తీపై ఆనాటి సమావేశంలో చర్చించనున్నారు.
అత్యవసర విచారణకు నో
అన్నాడీఎంకే కార్యాలయానికి వేసిన సీలును తొలగించాలని కోరుతూ వేసిన పిటిషన్‌ను అత్యవసర కేసుగా విచారించాలని ఎడపాడి పళనిస్వామి, ఓ పన్నీర్‌సెల్వం తరపున చేసిన అభ్యర్థనను మద్రాసు హైకోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్లు బుధవారం విచారణకు రాగా, ఎడపాడి తరపున పిటిషన్ వేసింది ఎమ్మెల్యే కావడం వల్ల ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లి సాధారణ కేసుగా జాబితాలో చేరుస్తామని తెలిపారు. ఇక పన్నీర్‌సెల్వం తరపున దాఖలైన పిటిషన్‌పై కూడా ఆదే విధానాన్ని అనుసరిస్తామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment