UP Assembly Election 2022: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ నుంచి ఎన్నికల బరిలోకి దిగడంతో.. మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా రేసులోకి దూసుకొచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీచేస్తారని ఎస్పీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆజంగఢ్ ఎంపీగా ఉన్న అఖిలేష్.. శాసనసభ ఎన్నికల్లో పోటీచేయడం ఇదే తొలిసారి. అయితే అఖిలేష్ ఎక్కడి నుంచి పోటీచేస్తారనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. అంచనా ప్రకారం, అఖిలేష్ యాదవ్ తూర్పు యూపీ నుంచి లేదా హై-ప్రొఫైల్ కలిగిన లక్నో వంటి సెంట్రల్ నియోజకవర్గాన్ని ఎంచుకోవచ్చు. ఒకటి కంటే ఎక్కువ సీట్ల నుంచి పోటీ చేసే అవకాశం కూడా ఉంది.
చదవండి: (రాజకీయ దురంధరుడైన తండ్రినే వ్యూహాలతో మట్టికరిపించి..)
కాగా, ఉత్తర్‌ప్రదేశ్‌లో గడిచిన ఎన్నికల్లో అధికారపగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రులంతా అసెంబ్లీ బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపించలేదు. యూపీలో 2007 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారపగ్గాలు చేపట్టిన బీఎస్పీ అధినేత్రి మాయావతి ఎన్నికల్లో ప్రత్యక్ష పోరుకు దిగలేదు. శానమండలి సభ్యురాలిగా ఎన్నికై ముఖ్యమంత్రిగా పనిచేశారు. అనంతరం జరిగిన ఎన్నికల్లోనూ ఆమె అసెంబ్లీకి పోటీ చేయలేదు. ఇక సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌యాదవ్ సైతం పార్లమెంట్‌కు గెలిచినా, 2012లో ఆయన పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో ఎమ్మెల్యే బరిలో దిగలేదు. మండలి నుంచి ఎన్నికై సీఎంగా కొనసాగారు. ఇక ఐదుసార్లు ఎంపీగా గెలిచిన ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సైతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment