సాక్షి, గుంటూరు: ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన క్షేత్రంగా వున్న తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు తీసుకున్న చర్యలు హైడ్రామాను తలపిస్తున్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆరోపించారు. గుంటూరు క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన టీటీడీ చైర్మన్, ఈఓ, జేఈఓ, తిరుపతి ఎస్పీలపై చర్యలు తీసుకునే ధైర్యం చంద్రబాబుకు లేదని అన్నారు. వైఎస్సార్‌సీపీపై అక్రమ కేసులు బనాయించేందుకే ఈ నలుగురితో కూడిన క్రిమినల్ ముఠాను చంద్రబాబు తిరుమల తిరుపతిలో నియమించుకున్నారని.. ఈ ముఠాకు నాయకుడు చంద్రబాబేనని విమర్శించారు. తొక్కిసలాటకు బాధ్యులుగా కిందిస్థాయి ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం దారుణమని అన్నారు.
ఇంకా ఆయన ఏమన్నారంటే..
అంతర్జాతీయంగా తిరుమల తిరుపతి ఆలయానికి గొప్ప గుర్తింపు ఉంది. ఇక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా మొత్తం ప్రపంచం దీనిని గమనిస్తుంది. అటువంటి క్షేత్రంలో ప్రణాళికా లోపం కారణంగా వైకుంఠ ద్వార దర్శనంకు వచ్చిన భక్తులు తొక్కిసలాటకు గురై ఆరుగురు మృతి చెందడం చాలా పెద్ద ఘటనగా భావించాలి. కోట్లాధి మంది శ్రీవారి భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం ఇది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చాలా సీరియస్‌గా చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ సీఎం చంద్రబాబు ఈ ఘటనపై వ్యవహరించిన తీరు అత్యంత అభ్యంతరకరం. డీఎస్సీ, గోశాల డైరెక్టర్ లను సస్పెండ్ చేయడంతో చేతులు దులుపుకున్నారు.
క్రిమినల్ ముఠాను కాపాడుకునేందుకే చంద్రబాబు తిరుపతి పర్యటన
తిరుపతిలో తొక్కిసలాట సంఘటన జరిగిన వెంటనే సీఎం చంద్రబాబు, హోం, రెవన్యూ, ఎండోమెంట్ మంత్రులతో కలిసి ఘటనా స్థలికి వెళ్లి అధికారులు, మృతుల కుటుంబాలు, క్షతగాత్రులతో మాట్లాడారు. దీనిపై చిత్తశుద్దితో చర్యలు తీసుకుంటారని అందరూ భావించారు. కానీ సీఎం మాత్రం తన అనుకూల అధికారులుగా, కావాలని తిరుమల తిరుపతిలో పోస్టింగ్‌లు ఇచ్చి ప్రోత్సహిస్తున్న ఆ నలుగురిపై ఈగ కూడా వాలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అసలు చంద్రబాబు ఈ ఘటనపై హుటాహుటిన తిరుపతికి వెళ్ళింది బాధితులు, భక్తుల కోసం కాదు. తను పెంచి పోషిస్తున్న క్రిమినల్ ముఠాలోని నలుగురిని కాపాడుకునేందుకే.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ నలుగురూ వైయస్ఆర్ సీపీకి చెందిన వారిపై ఎలాంటి తప్పుడు కేసులు పెట్టాలా అనే ఆలోచనతోనే పనిచేస్తున్నారు. గత టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈఓ థర్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను కేసుల్లో ఎలా ఇరికించాలా అనే లక్ష్యంతోనే పనిచేస్తున్నారు. దీనిలో భాగంగానే లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందీ, ఇవే లడ్డూలను అయోధ్యలోని రామాలయంకు కూడా పంపారంటూ అత్యంత దారుణమైన తప్పుడు ప్రచారానికి పాల్పడ్డారు.
వైఎస్ జగన్ రాకుండా అడుగడుగునా ఆటంకాలు
తొక్కిసలాటలో చనిపోయిన మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు తిరుపతికి వెళ్ళే క్రమంలో వైయస్ జగన్ గారికి కావాలనే అనేక అడ్డంకులు సృష్టించారు. చివరికి ట్రాఫిక్ క్లియర్ చేయకుండా ఆయన వాహనాలకు ఆటంకాలు కల్పించారు. వైఎస్ జగన్ కారు కాలినకడన వెళ్లి బాధిత కుటుంబాలను కలిసి, వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.
ఇదీ చదవండి: బాబే మొదటి ముద్దాయి: వైఎస్ జగన్
ముందు నుంచే జగన్.. తిరుపతిలో బాధిత కుటుంబాలను కలవకూడదనే కుట్రతోనే ప్రభుత్వం పనిచేసింది. ముందుగా సీఎం వెళ్లడం, తరువాత వేరుగా డిప్యూటీ సీఎం వెళ్ళడం ద్వారా సమయం లేకుండా చేయాలన్న లక్ష్యంతోనే దిగజారుడు రాజకీయం చేశారు. ఎక్కడ వైఎస్ జగన్ బాధితులను కలిసి, జరిగిన దానిపై వాస్తవాలు మాట్లాడతారో, ఎక్కడ ప్రజల్లో దీనిపై ఆగ్రహం వ్యక్తమవుతుందోనని ప్రభుత్వం భయపడింది. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు తిరుపతి తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన వ్యక్తులపై చర్యలు తీసుకోకపోతే భక్తులు సహించరు. ఆ భగవంతుడు కూడా క్షమించడు.
పోలీసుల తప్పుడు కేసులను భయపడేది లేదు
పిల్లి బాబూరావు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై మాపై గుంటూరు పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేశారు. దీనిపై ఎల్లో మీడియాలో అంబటి సోదరులపై క్రిమినల్ కేసు అంటూ పెద్ద కథనాలను ప్రచురించారు. పిల్లి బాబూరావు నాకు తెలియదు. ఈ కేసుకు సంబంధించి సమాచారం తెలియగానే డీఎస్సీ, సీఐలతో మాట్లాడాను. ఈ కేసులో ఎప్పుడు మీరు విచారణకు పిలిచినా హాజరవుతాను, లేదా అరెస్ట్ చేసేందుకు వస్తామన్నా కూడా పూర్తిగా సహకరిస్తాను అని చెప్పాను. ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేశాను. బాద్యుడైన పౌరుడిగా చట్టాన్ని గౌరవిస్తాను. దీనిపై భయంతో క్వాష్ కు, యాంటిసిపేటరీ బెయిల్ కు ప్రయత్నించను. చంద్రబాబు, లోకేష్ లు చెప్పారని అర్థరాత్రి పూట వచ్చి మా తలుపులు కొట్టవద్దు. ఎప్పుడ రమ్మని ఫోన్ చేసినా నేనే స్వయంగా పోలీస్ స్టేషన్ కు వస్తాను. ఇటువంటి తప్పుడు కేసులను భయపడేది లేదు. పారిపోవాల్సిన అవసరం అంతకన్నా లేదు.
Comments
Please login to add a commentAdd a comment