సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ ఆఫీస్‌పై దాడి యత్నం హేయమని ఆ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. మల్లాది విష్ణు, లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్‌కుమార్, దేవినేని అవినాష్, పోతిన మహేష్‌తో కలిసి మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. శ్రీవేంకటేశ్వరస్వామి సాక్షిగా చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని అంబటి మండిపడ్డారు. టీటీడీ లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందన్న దానిపై, ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు, పురందేశ్వరి, లోకేష్, పవన్ కల్యాణ్‌తో పాటు, ఎల్లో మీడియా దారుణ ఆరోపణ చేస్తోందని ఆయన ఆక్షేపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నుంచి దృష్టి మళ్లించడం కోసమే టీడీపీ, బీజేపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయని అంబటి అన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంపై భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) కార్యకర్తల దాడి యత్నాన్ని ఖండించిన మాజీ మంత్రి, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈ ఘటనను ఖండించాలని కోరారు. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని చంద్రబాబు ఆరోపిస్తున్నారని.. దానికి ఆధారాలు ఏమున్నాయని నిలదీశారు. అందుకు వారు చూపిస్తున్న ఎన్‌డీడీబీ (నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు) రిపోర్టు గత జూలై 23న వచ్చిందన్న ఆయన, అప్పుడు సీఎంగా ఉన్నది చంద్రబాబే అని గుర్తు చేశారు. అదే రిపోర్టుకు సంబంధించి, ఆనాడు (జూలై 23న) మీడియాతో మాట్లాడిన టీటీడీ ఈఓ, లడ్డూ తయారీ కోసం కాంట్రాక్ట్ సంస్థ పంపిన నెయ్యి నాణ్యత పరీక్షిస్తే.. అందులో వెజిటబుల్ ఆయిల్, వనస్పతి కలిపినట్లుగా తేలిందని, ఆ నెయ్యిని రిజెక్ట్ చేశామని, ఇంకా ఆ సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో పెడుతున్నామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
ఇదీ చదవండి: వాస్తవాలు నిగ్గు తేల్చాలి.. ప్రధాని మోదీకి వైఎస్ జగన్ లేఖ
ఆ తర్వాత ఈనెల 18న ఎన్డీఏ సమావేశంలో టీటీడీ లడ్డూపై చంద్రబాబు ఆరోపణల తర్వాత, 20వ తేదీన మీడియాతో మాట్లాడిన టీటీడీ ఈఓ, మాట మార్చారని గుర్తు చేశారు. తాము ఎన్డీడీబీ ల్యాబ్‌కు పంపిన శాంపిల్స్‌లో జంతువుల కొవ్వుతో తయారుచేసిన నెయ్యి కలిపినట్లు అవశేషాలు ఉన్నట్లుగా, నివేదిక వచ్చిందని తెలిపారని ప్రస్తావించారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బ తీస్తూ, టీటీడీని, శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని చంద్రబాబు తన రాజకీయాల కోసం వాడుకుంటున్నారని ఆక్షేపించారు. దీన్ని తీవ్రంగా ఖండించిన తమ పార్టీ నేత, కుటుంబంతో సహా స్వామి వారి చెంత కుటుంబ సమేతంగా ప్రమాణానికి సిద్ధమని సవాల్ చేస్తే, స్పందన లేదని అంబటి గుర్తు చేశారు. గుడ్డ కాల్చి మొహం మీద వేసి తుడుచుకోమంటున్నారని ఆక్షేపించారు.
కూటమిలో భాగమైన బీజేపీకి సంబంధించిన విభాగం బీజేవైఎం, వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి ప్రయత్నించిందన్న మాజీ మంత్రి, అది ఏదో ఒక విధంగా జగన్‌పై బురద జల్లాలనే కుట్రపూరితమైన ప్రయత్నం అని అభివర్ణించారు. అసలు బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి టీటీడీ ప్రతిష్టను దిగజార్చాలనుకుంటున్నారా? లేక జగన్ ప్రతిష్టను దెబ్బ కొట్టాలనుకుంటున్నారా? అని అంబటి నిలదీశారు.
‘దైవాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ జగన్ పరువు మీద దాడికి ప్రయత్నిస్తే శ్రీ వెంకటేశ్వరస్వామివారు కూడా సహించరు. పురందేశ్వరి.. అమ్మా ఏంటిది?. వైఎస్ జగన్ పార్టీ ఆఫీస్ దగ్గరకు వచ్చి ఏవేవో విసిరి ఆనందపడాలనుకుంటున్నారా? విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీని ఇక్కడి నుంచి తీసేస్తున్నారనే బాధతో ప్రజలు, కార్మికులు తిరుగుబాటు చేసే పరిస్థితి వచ్చింది. ఇప్పటికే ఒక పార్ట్ అమ్మేశారు. ఉద్యోగులకు జీతాలు కట్ చేశారు. అక్కడ రగిలిపోతుంటే దాన్ని డైవర్ట్ చేయాలనే దురుద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టడం చాలా దురదృష్టకరం. ఇలాంటి వాటికి కచ్చితంగా సమాధానం ఉంటుందని అంబటి స్పష్టం చేశారు.
టీటీడీ ఈఓగా శ్యామలరావును నియమించిన రోజునే, స్వామివారిని రాజకీయాల కోసం వాడుకునే ప్రయత్నం మొదలైందన్న మాజీ మంత్రి.. టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలో జరిగిన నెయ్యి టెస్ట్, ఎన్‌డీడీబీ రిపోర్ట్‌కు జగన్‌గారిని బాధ్యుడిని ఎలా చేస్తారని నిలదీశారు. అది చాలా అన్యాయం, అక్రమం, దుర్మార్గమన్న ఆయన.. ముగ్గురూ కలిసి తొండి ఆడుతున్నారని అభివర్ణించారు.
గత జూలైలో కాంట్రాక్ట్ సంస్థ పంపిన నెయ్యి నాణ్యతపై అనుమానంతో పరీక్ష చేయించామని, ఆ తర్వాత నాలుగు ట్యాంకర్లను వెనక్కు పంపించామని స్వయంగా టీటీడీ ఈఓ చెప్పిన విషయాన్ని గుర్తు చేసిన అంబటి రాంబాబు.. లడ్డూ తయారీలో కల్తీ నూనె ఎక్కడ వాడారో పవన్‌కళ్యాణ్ చెప్పాలని స్పష్టం చేశారు.
నెయ్యిలో నాణ్యత లేకపోతే, తిప్పి పంపించడం ఆనవాయితీ అని గుర్తు చేసిన మాజీ మంత్రి, 2019–24 మధ్య 18 ట్యాంకర్లు రిజెక్ట్ చేసిన విషయాన్ని తెలిపారు. అలా టీడీపీ హయాంలోనూ 14 ట్యాంకర్లు వెనక్కు పంపారని, అయినప్పటికీ నిరాధార ఆరోపణలు, విమర్శలు చేస్తూ.. గుడ్డ కాల్చి మొహాన వేస్తున్నారని ఆక్షేపించారు. నిజంగా ఆధారాలు ఉంటే, ఇలా ఆరోపణలు చేయకుండా, వాటిని చూపాలని కోరారు. ఎంత మంది చెప్పినా అబద్ధం నిజమైపోదన్న అంబటి.. జగన్ హయాంలో ప్రసాదాల తయారీలో ఏ పొరపాటు, తప్పిదం జరగలేదని స్పష్టం చేశారు. అలా జరిగి ఉంటే, నిరూపించాలని సవాల్ చేశారు.
రాష్ట్రంలో 40 శాతం ఓట్ షేర్ ఉన్న జగన్ ప్రజాదరణ తట్టుకోలేక నిత్యం ఆయనపై అసత్య ఆరోపణలు చేస్తూ నిందిస్తున్నారని, అందుకోసం చివరకు దేవుణ్ని కూడా వాడుకుంటున్నారని.. అయితే అవన్నీ శ్రీ వెంకటేశ్వరస్వామివారు చూస్తున్నారని, వారిని తప్పకుండా శిక్షిస్తారని చెప్పారు.
పవన్‌కళ్యాణ్ చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షను ప్రస్తావించిన మాజీ మంత్రి, అసత్య ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకునే చంద్రబాబు ఆ దీక్ష చేయాలని, పొరపాటు అయ్యింది కాబట్టి క్షమాపణ కూడా చెప్పి, సంప్రోక్షణ చేసుకోవాలని సూచించారు. భగవంతుడిని అడ్డు పెట్టుకుని నీచ రాజకీయాలు చేసే సంస్కృతి చంద్రబాబుది అని అంబటి రాంబాబు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment