తండ్రికి న్యాయం చేయాలంటూ వేడుకోలు.. లోకేష్‌కు అమిత్‌ ‘షా’క్‌ | Amit Shah Shock To Lokesh On Chandrababu Cases And Arrest | Sakshi
Sakshi News home page

తండ్రికి న్యాయం చేయాలంటూ వేడుకోలు.. లోకేష్‌కు అమిత్‌ ‘షా’క్‌

Published Fri, Oct 13 2023 1:08 PM | Last Updated on Fri, Oct 13 2023 3:39 PM

Amit Shah Shock To Lokesh On Chandrababu Cases And Arrest - Sakshi

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ముసుగు తొలగించారు. ఆమె ఏపీ బీజేపీపగ్గాలు చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు పరోక్షంగా చంద్రబాబు నాయుడికి మద్దతు ఇస్తూ వస్తోన్న పురందేశ్వరి ఇపుడు బాహాటంగానే తన బంధువు అయిన బాబు కుటుంబానికి సహకరించేందుకు నడుం బిగించారు.  చంద్రబాబు అరెస్ట్ తర్వాత నెలరోజులుగా ఢిల్లీలో మకాం వేసిన లోకేష్‌కు బీజేపీ అగ్రనేతల అపాయింట్ మెంట్ కూడా దొరకలేదని ప్రచారం జరిగింది. తాజాగా లోకేష్‌ను తీసుకుని పురందేశ్వరి కేంద్ర మంత్రి అమిత్ షా తో భేటీ ఏర్పాటు చేయడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అపాయింట్‌మెంట్‌ కోసం పైరవీలు
రూ. 371 కోట్ల రూపాయలు  పకోడీల్లా నమిలేయడానికి స్కెచ్ గీసి అడ్డంగా దొరికిన చంద్రబాబు నాయుడిని సెప్టెంబరు 9న ఏపీ సిఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నాన్న అరెస్ట్ కాగానే అమాంతం ఢిల్లీ ఫ్లైట్ ఎక్కేశారు నారా లోకేష్. తన తండ్రిని కాపాడుకోడానికి బీజేపీఅగ్రనేతల కాళ్లా వేళ్లా పడి బతిమాలాడుకోడానికి ఆయన విశ్వ ప్రయత్నాలు చేశారు. బీజేపీలో చేరిన టీడీపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్‌లతో పాటు టీడీపీ ఎంపీ కనకమేడలతోనూ బీజేపీ పెద్దలతో అపాయింట్‌మెంట్‌ కోసం పైరవీలు చేయించుకున్నారు.

పెద్దమ్మ చేయి పట్టుకుని ఢిల్లీకి
అయితే లోకేష్‌కు ఎవరూ అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. దీనిపైనే లోకేష్ స్పందిస్తూ తాను బీజేపీ నేతలను కలవడానికి అసలు ప్రయత్నించనే లేదన్నారు లోకేష్. జోకేంటంటే ఎవరూ అడక్కుండానే లోకేష్ ఈ వ్యాఖ్య చేసి అడ్డంగా దొరికిపోయారు. ఎంతకీ అపాయింట్‌మెంట్‌ దొరక్కపోవడంతో నిరాశలో ఉన్న లోకేష్ సిఐడీ విచారణకు ఏపీ వచ్చారు. విచారణ ముగిసిన మరుక్షణమే మళ్లీ ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు. ఈ సారి పెద్దమ్మ దగ్గుబాటి పురందేశ్వరి చేయి పట్టుకుని ఢిల్లీ వెళ్లారు.

అమిత్ షా అయిష్టంగానే
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు అయిన పురందేశ్వరి కేంద్ర మంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్‌ అడిగినా ముందుగా  దొరకలేదు. ఆమె పదే పదే ప్రాధేయ పడ్డంతో ఇక చేసేది లేక అమిత్ షా అయిష్టంగానే సరే అన్నారని సమాచారం. తీరా ఆ సమయం వచ్చే సరికి పురందేశ్వరితో పాటు లోకేష్ రావడం చూసిన అమిత్ షాకు విషయం అర్ధమైనట్లుంది. వెంటనే తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని పక్కన పెట్టుకుని లోకేష్ తో భేటీ అయ్యారు.
చదవండి: అమిత్‌షాతో లోకేష్‌ భేటీ.. ఫిర్యాదు చేస్తే నమ్మేస్తారా!

కిషన్ రెడ్డిని పక్కన పెట్టుకుని లోకేష్‌తో భేటీ
గతంలో కూడా చంద్రబాబు నాయుడు అమిత్ షాతో భేటీకి వెళ్లినపుడు.. అమిత్ షా చాలా జాగ్రత్త తీసుకుని పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాను అర్జంట్‌గా పిలిపించుకుని ఆయన సమక్షంలోనే చంద్రబాబుతో భేటీ అయ్యారు. తాను ఒక్కరే బాబుతో మాట్లాడితే.. ఎల్లో మీడియా దానికి ఎన్నో కథలు అల్లి పుంఖాను పుంఖాలుగా వార్తలు వండి వార్చే ప్రమాదం ఉందన్న భయంతోనే అమిత్ షా నాడు నడ్డాని పెట్టుకున్నారు. ఇపుడు అదే కారణంతో కిషన్ రెడ్డిని పక్కన పెట్టుకుని లోకేష్‌తో భేటీ అయ్యారు.

నిందితుడి వయసును పరిగణనలోకి తీసుకోరు
ఈ సందర్భంగా లోకేష్ తన తండ్రిని అన్యాయంగా అరెస్ట్ చేసి అక్రమంగా జైలుకు పంపారని..73 ఏళ్ల వయసులో ఆయన్ను ఇబ్బంది పెట్టడమే కాకుండా తనను కూడా వేధిస్తున్నారని చెప్పినట్లు సమాచారం. దానికి అమిత్ షా స్పందిస్తూ.. నేరం చేయని వాళ్లు భయపడాల్సిన అవసరం లేదని.. నేరం చేసిన వారే కంగారు పడతారని అన్నట్లు భోగట్టా. ఇక చట్ట ప్రకారం విచారణ జరిగేటపుడు నిందితుడి వయసును పరిగణనలోకి తీసుకోరని అమిత్ షా చెప్పినట్లు సమాచారం.

చేస్తే విడిచి పెట్టవు
తప్పు చేస్తే నువ్వైనా నేనైనా.. చంద్రబాబు అయినా చట్టం ముందు అంతా సమానమే అని  ముక్తాయించిన అమిత్ షా న్యాయ వ్యవస్థలు ఎవరికీ అన్యాయం చేయవని..అదే సమయంలో తప్పు చేస్తే విడిచి పెట్టవని అన్నారట. అంతే తప్ప లోకేష్‌కు ఎలాంటి భరోసా ఇవ్వలేదని అంటున్నారు. అమిత్ షా సమాధానాలు విన్నాక లోకేష్ వదనం ఆముదం తాగినట్లు అయిపోయిందని  సమాచారం.

లోకేష్ డీలా
భేటీ అనంతరం లోకేష్‌, పురందేశ్వరి బయలు దేరబోతోండగా.. పురందేశ్వరిని పిలిచిన అమిత్ షా ఇటువంటివి ఎంటర్‌టైన్‌ చేయకండి అని సున్నితంగా మందలించినట్లు భోగట్టా. మొత్తం మీద పెద్దమ్మను తీసుకుని బీజేపీ కేంద్రమంత్రిని కలిసినా ఎలాంటి భరోసా దక్కకపోవడంతో లోకేష్ చాలా డీలా పడ్డారని బయటకు వచ్చిన తర్వాత ఆయన్ను చూసిన వారు అంటున్నారు. ఎవరితో భేటీ అయినా..చివరకు సిఐడీ విచారణకు హాజరు అయినా బయటకు వచ్చిన తర్వాత ఏదో ఒకటి మాట్లాడే లోకేష్ అమిత్ షా ఇచ్చిన షాకులతో  ఎవరితోనూ మాట్లాడకుండానే వెళ్లిపోయారు.
చదవండి: నెల్లూరులో జనసేనకు భారీ షాక్‌

పురందేశ్వరి ఏ హోదాలో వెళ్లింది..
ఇక పురందేశ్వరి వ్యవహార శైలిపై ఏపీ  బీజేపీనేతలు ఆశ్చర్యపోతున్నారు. రాష్ట్ర నేతలెవరితోనూ చెప్పకుండా ఆమె ఢిల్లీ వెళ్లారట.  పరుచూరు వెళ్తున్నానని  పార్టీ నేతలకు చెప్పారని.. ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఢిల్లీ వెళ్లారని పార్టీ వర్గాలంటున్నాయి. ఇంతకీ పురందేశ్వరి లోకేష్‌కు పెద్దమ్మగా ఢిల్లీ వెళ్లారా? కేవలం భువనేశ్వరికి  అక్కగా  ఆమె భర్తను కాపాడ్డానికి వెళ్లారా? లేక ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా వెళ్లారా? అని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.

ఏపీ బీజేపీకి తీరని నష్టమే
నారా వారి బంధువుగా ఆమె వెళ్తే అది ఆమె ఇష్టం. అది ఆమె వ్యక్తిగతం. కానీ ఏపీ బీజేపీ అధ్యక్షురాలి హోదాలో ఈ పైరవీ చేస్తే మాత్రం అది ఏపీ బీజేపీకి తీరని నష్టమే అంటున్నారు రాజకీయ పండితులు. అమిత్ షాను అపాయింట్ మెంట్ కి ఒప్పించే సమయంలోనూ లోకేష్‌కు అపాయింట్ మెంట్ ఇస్తే తెలంగాణాలో కమ్మ సామాజిక వర్గ ఓటర్లు బీజేపీవైపు మొగ్గు చూపే అవకాశాలున్నాయని పురందేశ్వరి వివరించినట్లు తెలుస్తోంది. అయితే అన్ని విషయాలపైనా అవగాహన ఉన్న అమిత్ షా ఎలాంటి  ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయారట.
- కుర్చీ కింద కృష్ణయ్య

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement