సాక్షి, తాడేపల్లి: పారిశ్రామికంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఓర్వలేకపోతున్నారని, అందుకే అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. బుధవారం ఉదయం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి ఏ పరిశ్రమ వచ్చినా అది వారే తెచ్చినట్లు లోకేష్ చెబుతున్నారని, వెయ్యి కోట్లు పెట్టుబడులు పెట్టే సంస్థలను వందల సంఖ్యలో తెచ్చామంటున్నారని, వాళ్ల నాన్న చంద్రబాబుకు వాటికి శంకుస్థాపన చేసే సమయం కూడా లేదని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. అదే నిజమైతే.. టీడీపీ హయాంలో వచ్చిన పరిశ్రమలు, పెట్టుబడుల జాబితా విడుదల చేయాలని సవాల్ చేశారు. చంద్రబాబు రోజూ మతి తప్పి మాట్లాడుతుంటే.. లోకేష్ వెయిట్ లాస్ కోసం ట్రీట్‌మెంట్ తీసుకుని మైండ్ లాస్ చేసుకుని మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
పారిశ్రామికంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు.. అభివృద్ధిని అడ్డుకునేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. గతంలో అవకాశం ఇచ్చినా ఆయన ఏం చేయలేకపోయారు. కానీ, ఇప్పుడు మేం ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తున్నాం. వనరుల్ని గుర్తించి.. రాష్ట్రాన్ని దేశవిదేశాలకు ప్రమోట్ చేస్తున్నాం. అయినా కూడా భరించలేక ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారు.
గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన మాటలకు, చేసిన ఎంవోయూలకు పొంతనే లేదని విమర్శించారు మంత్రి అమర్నాథ్. టీడీపీ ఒక డ్రామా కంపెనీ అని అభివర్ణించిన మంత్రి అమర్నాథ్.. నేపాల్ గుర్ఖాలకు సూటూ బూటూ తగిలించి ఎంవోయూలు చేసిన ఘనత చంద్రబాబుదని, అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఒకవైపు తాము అభివృద్ధి చేస్తుంటే.. ప్రతీది తామే చేశామంటూ చంద్రబాబు ప్రకటించుకోవడం విడ్డూరంగా ఉందని, ప్రజలు అంతా గమనిస్తుంటారని చంద్రబాబు, నారా లోకేష్‌లకు హితవు పలికారు.
అసలు మీరు చేసిన అభివృద్ధి ఏంటి? రాష్ట్రంలో 972 కిలోమీటర్ల సముద్ర తీరాన్ని మీ(చంద్రబాబు) హయాంలో ఎందుకు ఉపయోగించలేదు..?. అసలు ఐదేళ్లలో అసలు మీరు ఏమీ చేసారో చెప్పండి. సమ్మిట్ల పేరుతో డ్రామా చేయడం తప్ప మీరు చేసింది ఏమిటి..?. మీరు చేసిన MOU లకు ఒక్కసారి సమాధానం చెప్పగలరా..?. ఒక్క ఫోన్ కాల్ తో ప్రతి సహకారం అందిస్తామని సీఎం జగన్ స్పష్టంగా చెప్పారు. వార్డ్ మెంబర్‌గా గెలవలేని నువ్వు(నారా లోకేష్‌ను ఉద్దేశించి).. సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హత లేదని విమర్శలను తిప్పి కొట్టారు మంత్రి అమర్నాథ్.
జగన్ ప్రజల మేలు కోరతారు.. చంద్రబాబు చావు కోరే రకం
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో సంక్షేమం, శ్రేయస్సు, అభివృద్ధి, సంతోషం అనే నాలుగు స్థంభాలపై పాలన సాగుతోందని మంత్రి చెప్పారు. ప్రభుత్వాలుగా కేంద్రం, రాష్ట్రాల మధ్య సంబంధాలే ఉంటాయి కానీ, మోదీ దగ్గరకు వెళ్లి చంద్రబాబు లాగా వేషాలు వేయడం చేతకాదని స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజల మంచి కోరితే.. చంద్రబాబు చావు కోరే రకం అని తెలిపారు. బ్రాహ్మణితో తగవులు ఉంటే మీ ఇంట్లో పరిష్కరించుకోండి అని లోకేష్‌కి హితవు పలికారు. ఏనాడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోని సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతమ్మను రాజకీయాల్లోకి లాగి బ్రాహ్మణిని తిట్టించాలన్నదే లోకేష్ ఉద్దేశమా అని ప్రశ్నించారు. లోకేష్‌లా బీచ్, స్విమ్మింగ్ పూల్ చదువులు సీఎం జగన్ చదవలేదన్నారు. సీఎం ఏమి చదివారో అందరికీ తెలుసునన్నారు.
టీడీపీని కాపాడడం పవన్ బాధ్యత
మోదీ దగ్గర వేషాలు వేసే తత్వం పవన్ కళ్యాణ్‌ది అని, అదసలు కాపుల పార్టీ కాదని, కమ్మ జనసేన అని ఎద్దేవా చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ‘పార్టీని నడుపుతున్నది నాదెండ్ల మనోహర్ కాదా?. ఈ రాష్ట్రంలోని కాపులు జనసేనను మీదేసుకునే పరిస్థితి లేదు. దమ్ముంటే 175కి 175 స్థానాల్లో పోటీ చేస్తాం అని చెప్పమనండి. అసలు పవన్ కళ్యాణ్ బాధ్యత వైజాగ్ ను కాపాడటం కోసం కాదు...టీడీపీనీ కాపాడటం ఆయన బాధ్యత అంటూ చురకలు అంటించారు మంత్రి గుడివాడ అమర్నాథ్.
పెద్ద పారిశ్రామికవాడల్లో టెక్స్‌టైల్ పార్కులు
రాష్ట్రంలో టెక్స్‌టైల్ రంగం ప్రోత్సాహానికి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి గుడివాడ అమర్‌నాథ్ చెప్పారు. 100 ఎకరాలకు పైబడి ఉన్న పెద్ద పారిశ్రామికవాడల్లో టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. బుధవారం అమరావతి సచివాలయంలో చేనేత, వస్త్ర పరిశ్రమ, ఆప్కో, లేపాక్షి, ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆప్కో ఉత్పత్తులకు మరింత ప్రాచుర్యం కల్పించేలా మార్కెటింగ్ కన్సల్టెంట్‌ను నియమించాలన్నారు. కొత్త జిల్లా కేంద్రాలు, డిమాండ్ ఉన్న చోట్ల లేపాక్షి షోరూంలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా అమలు చేయాలని చెప్పారు.
స్థానికులకు 75 శాతం ఉద్యోగాలివ్వడంలో మేం రాజీపడడం లేదు. ఎంఎస్‌ఎంఈలకు పాత బకాయిలు కూడా ఇస్తున్నామని మంత్రి గుర్తు చేశారు. ప్రజా సంక్షేమం, శ్రేయస్సు, అభివృద్ధి, సంతోషం అనే నాలుగు స్థంబాల మీద సీఎం జగన్ పాలన కొనసాగుతోందని, పరిశ్రమల ఏర్పాటు.. ఉపాధి కల్పన ఇలా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే అభివృద్ధి దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: పరిశ్రమలకు ప్రోత్సాహంలో ముందెన్నడూ చూపనంత చొరవ!
Comments
Please login to add a commentAdd a comment