‘‘ఫించన్లు ఆపి మొసలి కన్నీరా..?’’ బాబుపై మంత్రి మేరుగ ఫైర్‌ | Ap Minister Meruga Nagarjuna Fire On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

‘‘ఫించన్లు ఆపి మొసలి కన్నీరా..?’’ బాబుపై మంత్రి మేరుగ ఫైర్‌

Published Tue, Apr 2 2024 6:13 PM | Last Updated on Tue, Apr 2 2024 6:33 PM

Ap Minister Meruga Nagarjuna Fire On Chandrababu Naidu - Sakshi

సాక్షి, తాడేపల్లి: పింఛన్లు ఆపించి తగుదునమ్మా అంటూ చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నాడని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున ఫైర్‌ అయ్యారు. తాడేపల్లిలోని వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మేరుగ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో చంద్రబాబునాయుడు పరిస్థితి చూస్తుంటే ఎంతటికైనా దిగజారి రాజకీయాలు చేసి, రాష్ట్ర ప్రజలను నిలువునా ముంచాలని చూస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. 

‘ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుపై బాధ్యతగా ఉండే రాజకీయ నాయకుడిలా చంద్రబాబు లేనే లేడు. స్వయాన ఆయన బంధువు నిమ్మగడ్డ రమేష్‌ అనే వ్యక్తిని పక్కన పెట్టుకుని వాలంటీర్‌ వ్యవస్థపై కుట్రలు చేశాడు. నిమ్మగడ్డ సర్వీసులో ఉన్నప్పుడు మాపై కుట్రలు కుతంత్రాలతో పనిచేశాడు. ఆయన ఎన్నికల కమిషనర్‌గా ఉన్నప్పుడు కూడా ప్రభుత్వానికి బద్ధ విరోధిలా పనిచేశారు. 

ఆయనే ఈ రోజు దేశంలోనే గొప్ప సంస్కరణగా నిలిచిన వాలంటీర్‌ వ్యవస్థపై కత్తి కట్టాడు. పేద ప్రజలు, నిస్సహాయులను ఆదుకోడానికి, సంక్షేమ కార్యక్రమాలను సక్రమమైన పద్దతిలో చేరవేసే ఉద్ధేశంతో వాలంటీర్‌ వ్యవస్థను సీఎం జగన్‌ పెట్టారు. అలాంటి వ్యవస్థను అపహాస్యం చేసే విధంగా పింఛన్లు పంచకూడదని నీ బంధువు ద్వారా కోర్టులకు, ఎన్నికల కమిషన్‌కు వెళ్లి ఆ వ్యవస్థను నిలిపేశావంటే ఎంత దిగజారావో అర్ధం అవుతోంది.

వాలంటీర్లు పింఛన్లు పంచకూడదని కేసులు వేయించి, తగుదునమ్మా అంటూ మళ్లీ పింఛన్లు పంచాలంటే సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నావు.  రాష్ట్రంలో వాలంటీర్లు ఎలాంటి సర్వీసులు చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసు. వాలంటీర్‌ వ్యవస్థను ఆపి రాజకీయంగా లబ్ధిపొందాలనేదే చంద్రబాబు ఆలోచన. ఏదో ఒక విధంగా గందరగోళం సృష్టించి లబ్ధిపొందాలనే ఆలోచనతోనే చంద్రబాబు ఈ తప్పుడు చర్యకు పాల్పడ్డాడు. ఈ రోజు పింఛన్లు రాక అనేక ఇబ్బందులు పడటానికి కారణం చంద్రబాబే.

ఇదంతా చేసి ఎందుకు పింఛన్లు పంచలేదని ఇప్పుడు నువ్వే మాట్లాడుతున్నావు. అంతా నువ్వే చేసి తగుదునమ్మా అంటూ మెసేజ్‌లు పెట్టడం ఏంటి? ఎవరితో ఆపించావో నీకు తెలుసు. ఆపించిన వ్యక్తి ఎవరో నీకు తెలుసు.  నువ్వు ప్రజల్ని మోసం చేయడానికి ఎక్స్‌(ట్విట్టర్‌)లో మెసేజ్‌లు పెడుతున్నావు. నువ్వొచ్చాక పింఛన్లు ఇస్తావా? నువ్వు వచ్చేది ఏంటి బోడిగుండు? నువ్వు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదు. మళ్లీ ఇప్పుడు ఎన్నికల్లో హామీ ఇస్తున్నావు. ఈ రాష్ట్రంలో నువ్వు ఏడవలేక, 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను పెట్టుకోలేక అరువు తెచ్చుకున్నావు.

ఎస్సీ, ఎస్టీలను అపహాస్యం చేశావ్‌..ఎస్సీల్లో పుట్టకూడదు అని చెప్పావు. బీసీల తోకలను కత్తిరిస్తానన్నావు..బీసీలు జడ్జిలుగా పనికిరానన్నావు.  నువ్వు డబ్బులున్న వారి అడుగులకు మడుగులు వత్తుతున్నావు.  నా పేదవాళ్లు, నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. టిప్పర్‌ డ్రైవర్లే నిన్ను పాతాళానికి తొక్కేస్తారు చూడు చంద్రబాబు.  టిప్పర్‌ డ్రైవర్‌కి టికెట్‌ ఇచ్చారంటూ మాట్లాడతావా? ఎంత మదంతో ఉన్నావు.. మా పల్లెల్లోకి వచ్చి నువ్వు ఓట్లు అడుగుతావా? 

ఈ రాష్ట్రంలో రాజ్యాంగాన్ని నువ్వు అపహాస్యం చేస్తే పేదవారి స్థితిగతులను మార్చడానికి సీఎం జగన్‌ పనిచేస్తున్నారు. టిప్పర్‌ డ్రైవర్‌గా ఉన్న నా ఎస్సీ సోదరుడికి...అంబేద్కర్‌ గారు కల్పించిన అవకాశాన్ని సీఎం జగన్‌ అమలు చేస్తున్నారు. మా డ్రైవర్లు అంటే నీకు అంత తేలిక. ఆటోలు, టిప్పర్లు, లారీలు నడుపుతున్న ప్రతి డ్రైవర్‌ చంద్రబాబు అంతాన్ని పంతంగా తీసుకోవాలి. 

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావడానికి సిద్ధంగా ఉన్నారు. చరిత్ర పునరావృతం అవుతుంది. కాసుకో  చంద్రబాబూ..నీ కుట్రలు, కుతంత్రాలు సీఎం జగన్‌ ముందు చెల్లవు.  మా పార్టీలో ఉన్నదంతా పేదలు. వారే జగన్‌ గారిని అక్కున చేర్చుకుంటున్నారు.  ఏ బ్లేడో, ఏ కత్తో..ఎక్కడ జరిగిందో పవన్‌ కల్యాణే చెప్పాలి.  విలువలు లేని మాటలు, విశ్వసనీయత లేని మాటలు పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతుంటే మేమెందుకు సమాధానం చెప్పాలి? వారెన్ని మాటలు మాట్లాడినా ప్రజలు వారిని తుంగలో తొక్కుతారు’  అని మేరుగ మండిపడ్డారు. 

ఇదీ చదవండి.. ఏపీలో రేపటి నుంచి పెన్షన్ల పంపిణీ.. విధి విధానాలివే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement