సమర్థతకు, నమ్మకానికి, విశ్వసనీయతకు వైఎస్ జగన్ సర్కారు పెద్దపీట వేసింది. జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కష్టపడి పనిచేసిన వారిద్దరికీ తగిన ప్రతిఫలం దక్కింది. ఉత్తరాంధ్రలో బలమైన సామాజిక వర్గానికి చెందిన బీసీ (కొప్పెలవెలమ)కు చెందిన బూడి ముత్యాలనాయుడికి, కాపు సామాజిక వర్గానికి చెందిన గుడివాడ అమర్‌నాథ్‌కు మంత్రులుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అవకాశం కల్పించారు. అందరూ ఊహించినట్లుగానే పార్టీ ఆవిర్భావం నుంచి జగనన్న వెంటే నడుస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారిద్దరికీ కొత్త కేబినెట్‌లో చోటు దక్కింది. వార్డు మెంబర్ నుంచి విప్‌గా ఎదుగుతూ.. ఇప్పుడు మంత్రిగా బూడి బాధ్యతలు చేపట్టనున్నారు. కార్పొరేటర్ స్థాయి నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎదుగుతూ తాజా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు గుడివాడ అమర్‌నాథ్. ఉమ్మడి జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు లభించడంతో ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండగా.. సంబరాల వాతావరణంలో పార్టీ శ్రేణులు సందడి చేస్తున్నాయి. ఉత్తరాంధ్రలో బలమైన సామాజిక వర్గాలకు చెందినవారు కావడంతో రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ పార్టీ మరింత బలోపేతం కానుంది.
సాక్షి, విశాఖపట్నం: సంబరాలు మిన్నంటాయి. అభిమాను ల సందడి ఆకాశమే హద్దుగా సాగింది. మిఠాయిలు, బాణసంచా వెలుగులు, అభినందన పూమాలలు.. పండగ వాతావరణాన్ని తీసుకువచ్చింది. అనకాపల్లి జిల్లా నుంచి ఇద్దరికి కొత్త మంత్రివర్గంలో స్థానం దక్కడం వైఎస్సార్‌సీపీ శ్రేణులకు డబుల్ ధమాకాలా నిలిచింది. ఉదయమంతా శ్రీరామనవమి వేడుకల్లో గడిపిన వారంతా మధ్యాహ్నం నుంచీ గంతులు, కేరింతలతో సందడి చేశారు.
నమ్మకానికి మారుపేరు...
సర్పంచ్‌గా పనిచేసిన తన తండ్రి బాటలోనే బూడి ముత్యాలనాయుడు వార్డు మెంబరు నుంచి ఉప సర్పంచ్, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ పదవులు చేపట్టి 2014లో మాడుగుల శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌గా, శాసనసభా పక్ష ఉపనేతగా వ్యవహరించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 2014లో వైఎస్సార్‌సీపీ రెండు ఎమ్మెల్యే స్థానాల్ని గెలుచుకోగా.. ఒక ఎమ్మెల్యే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సమయంలో బూడిని కూడా పార్టీలో చేర్చుకునేందుకు టీడీపీ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా జగనన్న వెంటే నిలిచారు. ఆయనతో ఊపిరి ఉన్నంతవరకు ఉంటానని బహిరంగంగా ప్రకటించారు. నమ్మకానికి మారుపేరుగా నిలిచారు. ఆ నమ్మకం 2019 ఎన్నికలో ఎమ్మెల్యేగా భారీ విజయా న్ని తీసుకొచ్చింది. అనంతరం ప్రభుత్వ విప్‌గా మూడేళ్లు వ్యవహరించారు. ఇప్పుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కొత్త కేబినేట్‌లో మంత్రిగా అవకాశం కల్పించారు.
తండ్రికి తగ్గ తనయుడిగా... : పేరుకు తగ్గట్టుగానే తన తండ్రి గుడివాడ గుర్నాథరావులాగే గుడివాడ అమర్‌నాథ్ పోరాటయోధుడిగా నిలిచారు. తండ్రికి తగ్గ తనయునిగా జిల్లాలో చురుకైన యువ రాజకీయ నేతగా ఎదిగారు. అమర్‌నాథ్‌ది రాజకీయ కుటుంబం. తాత గుడివాడ అప్పన్న ఎమెల్యేగా పనిచేశారు. ఆయన కుమారుడు గుడివాడ గుర్నాథరావు ఎమ్మెల్యేగా, ఎంపీగా, రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేశారు. మళ్లీ ఆయన తనయుడు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు మంత్రి పదవి వరించింది. తాత నుంచి వారసత్వ రాజకీయం ఉన్నా.. గుడివాడ అమర్‌నాథ్ తనంతట తానే రాజకీయంగా ఎదిగారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలైనప్పటికీ ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా వైఎస్సార్‌సీపీ వెంటే నిలిచారు.
జగన్‌మోహన్‌రెడ్డికి అత్యంత ఆప్తునిగా గుర్తింపు పొందారు. 2014లో వైఎస్సార్‌సీపీ ఓటమిపాలై అత్యంత కష్టకాలంలో ఉన్న సమయంలో రాజకీయ దిగ్గజాలు పార్టీకి దూరమయ్యారు. ఆ సమయంలోనే యువకుడైన అమర్‌నాథ్ జిల్లా పార్టీ పగ్గాలను అందుకొని వైఎస్సార్‌సీపీని ముందుకు నడిపించారు. సీనియర్లను, యువకులను సమన్వయం చేసుకుంటూ జిల్లాలో వైఎస్సార్‌సీపీ బలోపేతం అవ్వడంలో కీలకంగా వ్యవహరించారు. 2007లో విశాఖ కార్పొరేటర్‌గా 22 సంవత్సరాల వయస్సులోనే ఎన్నికయ్యారు.
2008లో జిల్లా ప్రణాళిక సంఘం సభ్యునిగా వ్యవహరించారు. 2018 నుంచి అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతల్ని చేపట్టారు. జిల్లాలోని కీలకమైన రైల్వేజోన్ కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసి ఆమరణ నిరాహారదీక్షకు పూనుకున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షునిగానూ, అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్తగానూ పనిచేసిన అమర్‌నాథ్ అనకాపల్లి అసెంబ్లీలో పార్టీని బలోపేతం చేయడంలో కృషి చేశారు. 2019లో అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.
మూడు జిల్లాల్లో సంబరాలు...
ఉమ్మడి విశాఖ జిల్లాలో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ప్రభుత్వ విప్, మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌లిద్దరినీ మంత్రులుగా ప్రకటించడంతో మూడు జిల్లాల్లో వైఎస్సార్‌సీపీ పార్టీ శ్రేణులు, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
సీఎంకు ధన్యవాదాలు
నన్ను నమ్మి మంత్రిగా అవకాశం కల్పించిన సీఎం వై.ఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు. ఎలాంటి బాధ్యత అప్పగించినా..దానిని సమర్థవంతంగా నిర్వర్తిస్తాను. ఒకవైపు సంక్షేమం, అభివృద్ధి..మరోవైపు వైఎస్సార్‌సీపీ పార్టీ బలోపేతానికి కృషిచేస్తాను. ప్రభుత్వం అందించే ప్రతి ఫలాన్ని ప్రజలకు అందేలా కృషి చేస్తాను. సీఎం జగనన్న అడుగుజాడల్లో...నా తండ్రి దారిలో ప్రజల కోసం పనిచేస్తాను.
– గుడివాడ అమర్‌నాథ్
సైనికుల్లా పనిచేస్తాం...
కొత్త కేబినెట్‌లో మంత్రిగా అవకాశం కల్పించినందుకు చాలా సంతోషంగా ఉంది. నాపై నమ్మకంతో మంత్రిగా అవకాశం కల్పించిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటాను. మళ్లీ వైఎస్సార్‌సీపీని అధికారంలోకి తీసుకురావడానికి సైనికుల్లా పనిచేస్తాం. ఓ చిన్న గ్రామంలో రైతు కుటుంబంలో పుట్టాను. వార్డు మెంబర్‌గా రాజకీయ అరంగేట్రం చేశాను. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. ఇన్నాళ్లూ ప్రభుత్వ విప్‌గా అవకాశమిచ్చారు. ఇప్పుడు మంత్రిని చేశారు. నా తుది శ్వాస ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటా... ప్రజల కోసం, పార్టీ కోసం పనిచేస్తా. – బూడి ముత్యాలనాయుడు
Comments
Please login to add a commentAdd a comment