లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం బరిలోకి దిగిన ప్రధాన రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెట్టాయి. ప్రత్యర్థులపై మాటల తూటాలతో విరుచుకుపడుతున్నాయి. బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ అగ్ర నాయకులు శనివారం పరస్పర విమర్శలతో రాజకీయ వేడి రగిలించారు. యూపీకి యోగి పాలన అవసరం లేదని.. ‘యోగ్య’ పాలన కావాలని సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ అన్నారు. తమ పార్టీ జామ్( జన్‌ధన్, ఆధార్, మొబైల్) పాలన అందిస్తోందని బీజేపీ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు.
బీజేపీవి విధ్వంసకర రాజకీయాలు
గోరఖ్‌పూర్‌లో సమాజ్‌వాదీ పార్టీ 'రథయాత్ర'లో అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. యోగి ప్రభుత్వం హయాంలో ఆజంగఢ్ 'మాఫియా రాజ్'గా మారిందని, ప్రతిష్ట మసకబారిందని విమర్శించారు. బీజేపీ విధ్వంసకర రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. సీఎం యోగిపై కేసులు ఉపసంహరించుకుంటున్నారని ఆరోపించారు.
‘జామ్’ పాలన అందించాం
సమాజ్‌పార్టీ హయాంలో యూపీలో అభివృద్ధి శూన్యమని అమిత్ షా ధ్వజమెత్తారు. అఖిలేశ్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఆజంగఢ్ లోక్‌సభ నియోజకవర్గంలో సీఎం యోగితో కలిసి స్టేట్ యూనివర్సిటీకి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాము ‘జామ్’ పాలన అందించామని చెప్పుకొచ్చారు. సమాజ్‌వాదీ పార్టీ అంటే.. జిన్నా, ఆజంఖాన్, ముక్తార్(అన్సారీ) అంటూ ఎద్దేవా చేశారు. ఇటీవల జిన్నాపై అఖిలేశ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన నేపథ్యంలో అమిత్ ఈవిధంగా కౌంటర్ ఇచ్చారు.
ఆజంగఢ్ పేరు మారుస్తాం
ముఖ్యమంత్రులుగా పనిచేసిన ములాయం, అఖిలేశ్ యాదవ్.. ఆజంగఢ్ అభివృద్ధికి చేసిందేమి లేదని సీఎం యోగి విమర్శించారు. ఆజంగఢ్ పేరును ఆర్యగఢ్ గా మార్చాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. స్టేట్ యూనివర్సిటీ రాకతో ఆజంగఢ్ కచ్చితంగా ఆర్యగఢ్ మారుతుందని ఆయన స్పష్టం చేశారు. (చదవండి: 4 గంటల పర్యటన.. రూ.23 కోట్లకు పైగా ఖర్చు)
Comments
Please login to add a commentAdd a comment