ఏ దేశానికేగినా, ఎందుకాలిడినా..
మొదట అడిగేది నీవెక్కడి వాడివోయ్ అనే!
అలా చెప్పుకోవడానికి అస్తిత్వమే లేకపోతే..
మనకంటూ ఓ ఊరు, ఓ ఉనికే లేకపోతే...
ఎంతో దుర్భరంగా ఉంటుంది కదా!
తమ పూర్వీకుల తాలుకూ ఇళ్లు,,
జ్ఞాపకాలు నదీగర్భంలో కలిసిపోతే...
రచ్చబండ, చేదబావి, ఊరిచెరువు...
ఈతపళ్లు... ఈ జ్ఞాపకాలన్ని కనుమరుగైపోతే...
మెరుగైన జీవనానికంటూ పట్టణాలకు పరుగులు పెడుతున్న నేటి కుర్రకారుకు వాటి విలువ తెలియకపోవచ్చు..
కానీ మట్టిలో ఆడి.. ఎండిన చెరువుల మడుల్లో పాపెర్లు పట్టిన చిట్టి చేతులకు తెలుసు అవెంతటి విలువైన జ్ఞాపకాలో...
నా పల్లెకేమైందని...
గొంతుకేదో అడ్డం పడుతోంది.. మాట పెగలట్లేదు!
మార్పు ఓ నిరంతర ప్రక్రియ. కొత్తనీరు వచ్చి నపుడు పాతనీరు కొట్టుకుపోతుంది. అభివృద్ధి జరగాల్సిందే కానీ... ఉన్న గతాన్నంతా ఊడ్చేసి మాత్రం కాదు. పుట్టిన ఊరితో, పెరిగిన వీధితో, చెడ్డీ దోస్తులతో పెనవేసుకున్న బంధాలు మాత్రం ఎన్నేళ్లయినా... ఎంత ఎత్తుకు ఎదిగినా... గుండెను తడుముతూనే ఉంటాయి. ఒక్కసారైనా ఊరెళ్లి మనోళ్లందరినీ కలిసి రావాలని మనసు ఆరాటపడుతూనే ఉంటుంది. ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే.. ఉత్తరప్రదేశ్ సోన్‌భద్ర్ జిల్లా దుద్ధి అసెంబ్లీ నియోజకవర్గంలోని 11 గ్రామాలకు ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలే చివరి ఎన్నికలుగా మారాయి. దీంతో సుమారు 25 వేల మంది ఓటర్లు ఉన్న ఈ 11 గ్రామాల్లో అసెంబ్లీ ఎన్నికల హడావుడి ఏమాత్రం కనిపించట్లేదు. సోన్‌భద్ర్‌లో నిర్మిస్తున్న కన్హర్ డ్యామ్ చుట్టూనే రాజకీయం తిరుగుతోంది.
2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్టీ రిజర్వ్ అయిన దుద్ధి నియోజకవర్గంలో అప్నాదళ్ (సోనేలాల్)కు చెందిన హర్ ఇరాం బీఎస్పీ అభ్యర్థిపై 1,085 ఓట్ల తేడాతో గెలుపొందగా, ఈ నియోజకవర్గంలోనే అత్యధికంగా 8,522 మంది ప్రజలు నోటాకే మొగ్గు చూపారంటే పరిస్థితి ఏరకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సుమారు రూ.2,700 కోట్లతో నాలుగు దశాబ్దాలుగా నిర్మాణంలో ఉన్న కన్హర్ డ్యామ్‌ను వచ్చే ఏడాది కల్లా సిద్ధం చేసేందుకు కొన్నేళ్లుగా చర్యలు వేగవంతం అయ్యాయి. సోన్‌భద్ర్ జిల్లాలోని అమ్వార్ గ్రామంలో పాగన్ నది, కన్హర్ నది సంగమం వద్ద జరుగుతున్న డ్యామ్ నిర్మాణంతో సిందూరి, భీసూర్, కోర్చి గ్రామాలతో పాటు కలిపి మొత్తం 11 గ్రామాలు ముంపునకు గురికానున్నాయి. దీంతో పరిహారం, పునరావాసం విషయంలో తాము చేస్తున్న పోరాటానికి రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ఎవరూ సహకరించట్లేదని ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు.
చదవండి: (మీసం మెలేసేది రైతన్నే!)
కన్హర్ డ్యామ్ కోసం 1976 నుంచి 1982 వరకు ప్రజల నుంచి భూమిని తీసుకుని ప్రభుత్వం పరిహారం కూడా అందించింది. అయితే 1984లో ఆనకట్ట పనులు ఆగిపోవడంతో ప్రజలు ఎవరూ గ్రామాలు ఖాళీ చేయలేదు. కాగా ఇప్పుడు 40 ఏళ్ల తర్వాత మళ్లీ కన్హర్ డ్యామ్ పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు 65% భూసేకరణ పూర్తయిందని నీటిపారుదలశాఖ అధికారులు పేర్కొన్నారు. దీంతో 2013 కొత్త భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని ముంపు గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. 2023 వర్షాకాలానికి ముందే ఈ మెయిన్ డ్యాంలో నీటిని నిల్వ చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. దాంతో ఈసారి ఈ 11 గ్రామాలకు చెందిన ప్రజలు బరువెక్కిన గుండెతో కన్నీటి బొట్టునే చూపుడు వేలిపై సిరా చుక్కగా మలచుకొని... తమదిగా చెప్పుకోగలిగే ప్రాంతంలో ఆఖరిసారిగా ఓటేసి... తట్టాబుట్టా సర్దుకొని తలోవైపు వెళ్లిపోనున్నారు. – సాక్షి, న్యూఢిల్లీ
Comments
Please login to add a commentAdd a comment