సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. లోక్ కల్యాణ్ సంకల్ప్ పత్ర్ పేరుతో ఉన్న ఈ మేనిఫెస్టోను పార్టీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, యూపీ బీజేపీ చీఫ్ స్వతంత్ర దేవ్ సింగ్ మంగళవారం విడుదల చేశారు. రైతులు, యువత, బాలికల సంక్షేమమే ప్రధానాంశంగా మేనిఫెస్టో రూపొందించింది. ఐదేళ్లపాటు రైతులకు ఉచిత కరెంట్ ఇస్తామని.. వరి, గోధుమలపై కనీస మద్దతు ధర పెంచుతామని హామీ ఇచ్చింది. 15 రోజుల్లో చెరకు బకాయిలు చెల్లించేలా చర్యలు చేపడతామని, లేకుంటే మిల్లుల నుంచి వడ్డీ వసూలు చేస్తామని తెలిపింది.
(చదవండి: హిజాబ్ వివాదం విషపూరిత కుట్ర: శివకుమార్)
రూ.1500 పెన్షన్, ఉచిత బస్సు ప్రయాణం
అయోధ్యలో రామాయణ విశ్వవిద్యాలయం ఏర్పాటుచేయడంతోపాటు వచ్చే ఐదేళ్లలో మూడు కోట్ల కొత్త ఉద్యోగాలు కల్పిస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. రాణి లక్ష్మీబాయి యోజన కింద కాలేజీ విద్యార్థినులకు ఉచిత స్కూటీలు, యువ శశక్తీకరణ్ యోజన కింద యువతకు 2కోట్ల ట్యాబ్‌లు ఇస్తామని బీజేపీ వాగ్దానం చేసింది. 60 ఏళ్లు నిండిన మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం, దివ్యాంగులు, వృద్ధులకు రూ.1500 పెన్షన్, మా అన్నపూర్ణ కేంటీన్ల ద్వారా రాయితీ భోజనం, హోలీ, దిపావళికి పేదలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామని హామీ ఇచ్చింది.
లవ్ జిహాద్ చట్టంలో నిబంధనలు కఠినతరం చేస్తామని చెప్పింది. 10 ఏళ్ల జైలుశిక్ష, లక్ష రూపాయల వరకూ జరిమానా విధించేలా చట్టంలో మార్పులు తథ్యమని స్పష్టం చేసింది. దిగ్గజ గాయని లతా మంగేష్కర్ పేరిట ఆర్ట్స్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటుచేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. కాగా, ఫిబ్రవరి 6నే మేనిఫెస్టో విడుదల చేయాల్సి ఉండగా.. లతా మంగేష్కర్ మృతి చెందడంతో వాయిదా పడింది. యూపీ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ఫిబ్రవరి 10న జరగనుంది.
(చదవండి: ప్రధాని మోదీ వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు ఘాటు విమర్శలు)
Comments
Please login to add a commentAdd a comment