ఆరెస్సెస్ తయారు చేసిన నాయకుడు కాదు కానీ ఆ సంస్థకే హిందుత్వ ఎజెండాపై పాఠాలు చెప్పగలరు. జన్‌సంఘ్–బీజేపీ మూలాలు ఉన్నవారు కాదు కానీ కమలం పార్టీకే దేశభక్తిపై ప్రబోధాలు చెయ్యగలరు. గోరఖ్‌నాథ్ మఠం నీడలో, స్వయంశక్తితో ఎదిగారు. హిందూరాజ్య స్థాపనే లక్ష్యమని ఎలుగెత్తి చాటుతున్నారు. కుదిరితే ఆయనని ప్రేమిస్తారు. లేదంటే ద్వేషిస్తారు/ ఆయన విషయంలో మధ్యేమార్గానికి తావే లేదు. అభిమానులు భావి భారత ప్రధానిగా కీర్తిస్తారు/ ఆయనే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్/ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా బీజేపీకి ప్రధాని మోదీ ఛరిష్మాయే బలం. కానీ యూపీలో యోగి జనాకర్షణ అదనపు బలం. మతపరంగా ఓట్లను సంఘటితం చేయడమనే ఏకైక వ్యూహంతోనే మళ్లీ సీఎం పీఠం ఎక్కాలన్న పట్టుదలతో ఉన్నారు.
చదవండి: బీజేపీని ఓడించే శక్తి గాంధీలకు లేదు! ఇలా చేస్తే సాధ్యమే..
► 1972 సంవత్సరం జూన్ 5న పాంచూర్ జిల్లా పౌరి ఘర్వాల్ (ఇప్పటి ఉత్తరాఖండ్)లో ఆనంద్‌సింగ్ బిస్త్, సావిత్రి దేవి దంపతులకు జన్మించారు
► రాజ్‌పుత్ కుటుంబానికి చెందిన యోగి అసలు పేరు అజయ్‌సింగ్ బిస్త్.
► రిషికేష్‌లో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. గణిత శాస్త్రంలో డిగ్రీ పట్టా తీసుకున్నారు
► 1990 ప్రాంతంలో అయోధ్యలో రామ మందిరం ఉద్యమంలో చేరారు. యూపీ గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ మఠం ప్రధాన పూజారి అవైద్యనాథ్‌కి ప్రథమ శిష్యుడిగా మారారు. ఆయనే అజయ్‌సింగ్ పేరుని యోగి ఆదిత్యనాథ్‌గా మార్చారు.
చదవండి: యూపీ ఎన్నికలు: కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ ఇదే
►1994లో గోరఖ్‌నాథ్ మఠం పూజారి అయ్యారు.
► రాజకీయాల నుంచి అవైద్యనాథ్ విశ్రాంతి తీసుకున్నాక ఆయన అడుగుజాడల్లో 1998లో తన 26 ఏళ్ల వయసులోనే బీజేపీ తరఫున పోటీ చేసి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అప్పట్నుంచి వరసగా అయిదుసార్లు గోరఖ్‌పూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికవుతూ వచ్చారు
► 2002లో హిందు యువ వాహిని అనే సంస్థను స్థాపించి గో సంరక్షణ, లవ్ జిహాదీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించి పార్టీతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా తన ఇమేజ్‌ను పెంచుకున్నారు.
►2014లో అవైద్యనాథ్ కన్నుమూశాక గోరఖ్‌నాథ్ మఠం ప్రధాన పూజారిగా యోగి నియమితులయ్యారు. గోరఖ్‌నాథ్ ట్రస్ట్ ఫండ్ నిర్వహించే ఆస్పత్రులు, పాఠశాలలు, కళాశాలల బాధ్యతలు కూడా తీసుకున్నారు.
►బీజేపీ అధిష్టానంతో యోగి ఆదిత్యనాథ్ సంబంధాలు ఎప్పుడూ అంత సఖ్యంగా లేవు. హిందుత్వపై బీజేపీ మెతక వైఖరి అవలంబిస్తోందన్న ఆరోపించేవారు. విభేదాలు వచ్చిన ప్రతీసారి బీజేపీ అభ్యర్థులపై తన సొంత మనుషుల్ని పోటీకి నిలిపి గెలిపించుకునేవారు. దీంతో పార్టీయే తన మాట వినే పరిస్థితి తీసుకువచ్చేవారు.
► యోగి ఒక క్రౌడ్ పుల్లర్. ఆయన మాటలు తూటాల్లా పేలుతూ ఉంటాయి. యోగి ఉపన్యాసాలు వినడానికి జనం ఎగబడతారు. ఆ లక్షణాలే బీజేపీలో ఆయనని స్టార్ క్యాంపైనర్‌ని చేశారు. 2017లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉధృతంగా ప్రచారం చేశారు. ఎన్నికల్లో గెలిచాక సూపర్‌స్టార్‌గా మారి యూపీ సీఎం పీఠాన్ని అధిరోహించారు.
►అప్పటికే గోరఖ్‌పూర్ ఎంపీగా ఉన్న ఆయన ఆ పదవికి రాజీనామా చేసి సీఎం అయ్యాక శాసనమండలికి ఎన్నికయ్యారు. ఇప్పుడు గోరఖ్‌పూర్ నుంచి తొలిసారిగా అసెంబ్లీ బరిలో దిగుతున్నారు
► అవినీతి, భయం, హింస, చీకట్లు లేని ఉత్తరప్రదేశ్ దిశగా తీసుకువెళ్లడంలో విజయవంతమవుతున్నానని యోగి పదే పదే చెప్పుకుంటున్నారు. రాష్ట్ర వార్షిక స్థూల ఉత్పత్తిని రూ.10.9 లక్షల కోట్ల నుంచి రూ.21.73 లక్షల కోట్లకి తీసుకువెళ్లినట్టు యోగి చెప్పుకున్నారు.
►శాంతి భద్రతలు అమలు ఎలా ఉంటుందో చూడాలంటే యూపీకి రండి అంటూ ఆయన సవాల్ చేస్తూ ఉంటారు. కానీ యూపీలో మహిళలపై గత అయిదేళ్లలో నేరాలు 66 శాతం పెరిగాయని స్వచ్ఛంద సంస్థల నివేదికలు చెబుతున్నాయి.
►యోగి అధికారంలోకి వచ్చాక యూపీలో జరిగిన ఘర్షణల్లో 43% మైనార్టీలపై దాడులేనని మానవహక్కుల కమిషన్ వెల్లడించింది.
► బలవంతపు మతమార్పిడుల నిషేధ చట్టం, జనాభా నియంత్రణ చట్టాన్ని తీసుకువచ్చారు.
►అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో కరోనా కట్టడికి యోగి ఆదిత్యనాథ్ తీసుకున్న చర్యల్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ప్రశంసించింది.
► ‘‘నేను హిందువుని అలా చెప్పుకోవడానికి గర్వపడతా’’ అని ప్రకటించుకుంటారు. హిందుత్వ ఎజెండా యోగిని ఈసారి ఎన్నికల్లో ఏ మేరకు ఆదుకుంటుందో చూడాలి.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment