ఇది ప్రజాస్వామ్యం..
వేర్వేరు మార్గాలు.. విభిన్న ధోరణులు.. విరుద్ధ ఆలోచనలు.. వైవిధ్య స్వభావాలకు ఆస్కారమిచ్చే విశిష్ట విధానం. భావ ప్రకటన స్వేచ్ఛ నాందిగా.. రాజ్యాంగ సంకల్పం పునాదిగా.. స్వతంత్ర భావాలకు పూచీపడే అత్యున్నత సంవిధానం. ఇక్కడ స్థాయితో నిమిత్తం లేకుండా ఎవరైనా నచ్చిన ఆలోచన ధోరణిని అనుసరించవచ్చు. తమ భావాలను ఎలుగెత్తి ప్రకటించవచ్చు. ప్రజాస్వామ్య వేదికలు చేరేందుకు ఎన్నికల దారిలో అడుగు ముందుకు వేయవచ్చు. ఇది మనకు తెలిసిన పద్ధతి.
ఇదా ప్రజాస్వామ్యం?
అయితే అందరికీ తెలిసిన ప్రజాస్వామ్యాన్ని పాతర పెట్టే విధంగా ఈ జిల్లాలో ఒక చోట ఆదివారం కుటుంబస్వామ్యం పడగ విప్పింది. రాజకీయ దురహంకారం బుసకొట్టింది. దశాబ్దాల తరబడి ఏలుబడిలో ఉన్న గ్రామంలో ఎప్పటి మాదిరిగానే తమ గళమే వినిపించాలని.. తమ బలమే కనిపించాలని పంతం పట్టిన ఓ నాయకుడి బంధుగణం.. అందుకు అనుగుణంగా పావులు కదిపింది. అయితే ఈ సారి తొలిసారి ఆ పల్లెలో ఓ సాహసస్వరం మొలకెత్తింది. నిరసన గళం వినిపించింది. అంతా తలదించే చోట నేనున్నాంటూ ఓ శిరస్సు ధైర్యంగా శిఖరమై నిలబడింది. అంతే రాజకీయ గండభేరుండాలకు కళ్లుబైర్లు కమ్మడమే కాదు.. కోపం పరాకాష్టకు చేరింది. అంతా తమ ఇలాకా అనుకుని విర్రవీగే చోట కాస్త వ్యతిరేకతైనా వినిపిస్తే ఇంకేముందీ? ద్వేషం బుసకొట్టింది. రోషం కసిగా కోర విసిరింది. రాబంధుగణం తమ సేనలతో మోహరించి యుద్ధ వాతావరణాన్ని సృష్టించింది. భయోత్పాతాన్ని నెలకొల్పింది.
దౌర్జన్యానికి తలపడింది. దుర్మార్గానికి ఒడిగట్టి.. వేరే గొంతు నులిమేసేందుకు తెగపడింది. ఆదివారం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి ఊళ్లో ఆ కుటుంబం ఉక్కు గోళ్లలో ఉన్న నిమ్మాడలో జరిగిందిది. ఏకగ్రీవాలు ఒద్దేఒద్దని ప్రతిపచ్చ పెద్ద సుద్దులు చెబుతూ ఉంటే.. అదే స్వరంలో ప్రజాస్వామ్యానికి పూచీపడ్డట్టు ప్రకటనలు గుప్పించే ఎన్నికల అధికారి హోరెత్తిస్తూ ఉంటే.. నామినేషన్ వేస్తానన్నందుకు ఓ మామూలు వ్యక్తిపై జరిగిన అరాచకమిది. మరి నిబంధనల గీటు దాటనివ్వబోమని గంభీరంగా సెలవిచ్చే అధికారం ఏం చేస్తుంది? అందరి మదిలో ప్రశ్న ఇది.
ప్రజాస్వామ్యమేదో తేల్చాల్సిన తరుణమిది.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : కోటబొమ్మాళి మండలం నిమ్మాడ గ్రామంలో కింజరాపు అచ్చెన్నాయుడు నియంతగా మారారు. సొంతూరులో అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు. నియంతృత్వ పోకడతో జనాలను వేధిస్తున్నారు. బెదిరింపులు.. దౌర్జన్యాలు... ఆపై దాడులు ఇక్కడ అలవాటుగా మారిపోయింది. అది భూముల విషయంలోనైనా కావొచ్చు.. పంచాయతీ ఎన్నికలైనా అవ్వొచ్చు. తాను చెప్పినట్టు జరగకపోతే ఎంతకైనా తెగిస్తారు. తాజాగా నిమ్మాడ పంచాయతీ ఎన్నికల నామినేషన్ విషయంలో కూడా అదే జరిగింది. ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలు.. ఒక్కసారిగా వాతావరణం వేడెక్కిపోయింది. అచ్చెన్న కుటుంబం, అనుచరుల వీరంగం, దౌర్జన్యంతో రణరంగంగా మారింది. తమకు వ్యతిరేకంగా నామినేషన్ వేస్తున్నారన్న అక్కసుతో ఏకంగా అభ్యర్థిని కొట్టడానికి యత్నించారు.
తన సోదరుడి కుమారుడికి పోటీగా కింజరాపు అప్పన్న అనే వ్యక్తి నామినేషన్ వేస్తుండగా అచ్చెన్న సోదరుడు హరిప్రసాద్, ఆయన అనుచరులు చేసిన వీరంగం అంతా కాదు. ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేసేలా దౌర్జన్యానికి దిగారు. పోటీగా దిగిన అభ్యరి్థపై దాడి చేశారు. వారికి మద్దతుగా నిలిచిన వైఎస్సార్‌సీపీ నాయకులు దువ్వాడ శ్రీనివాస్ తదితరులపై దాడికి యత్నించారు. కింజరాపు సోదరులు ఎంతకైనా బరితెగిస్తారని తాజా ఘటన రుజువు చేసింది.
ఎప్పటి నుంచో..
నిమ్మాడలో నియంత పాలన సాగుతోంది. ఎన్నికలొస్తే వారికెవరు పోటీగా ఉండకూడదు. ఏజెంట్ల ఊసే ఉండకూడదు. వారు చెప్పినట్టే తల ఊపాలి. రిగ్గింగ్ చేసుకునేలా పరిస్థితులుండాలి. కాదూ కూడదంటే దాడులకైనా తెగబడతారు. అక్కడెప్పుడు ఎన్నికలు జరిగినా రిగ్గింగేనని స్థానికులే చెబుతున్నారు. అక్కడొకచోటే కాదు కోటబొమ్మాళి మండలంలో దాదాపు 15చోట్ల రిగ్గింగ్ చేసుకుని ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారనేది జనాలందరికీ తెలిసిన విషయమే. పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సొసైటీ ఎన్నికల్లోనూ అదే పరిస్థితి. పంచాయతీ ఎన్నికల్లో సాధ్యమైనంతవరకు బలవంతంగా ఏకగ్రీవం చేసుకోవాలని చూస్తారు. ఎవరైనా అడ్డు తగిలితే తొలగించుకోవడానికి ప్రయత్నిస్తారు.
ఇక్కడ జరిగే ఎన్నికల్లో ఇవి సర్వసాధారణమైపోయాయి. అచ్చెన్న, ఆయన బృందం అరాచకాలతో ప్రజలు విగిసిపోవడమే కాకుండా మాట్లాడటానికే భయపడిపోతున్నారు. నోరెత్తి మాట్లాడలేని పరిస్థితి అక్కడుంది. ఒకరిద్దరు ఎదురు తిరిగి మాట్లాడితే వారిని గ్రామ, సామాజిక బహిష్కరణ చేస్తారు. ఎప్పుడో ఏళ్ల క్రితం అచ్చెన్నాయుడు కుటుంబానికి ఎదురు తిరిగారన్న కక్షతో 22 కుటుంబాలను బహిష్కరించారు. అచ్చెన్నాయుడు, ఆయన సోదరుడు హరిప్రసాద్ చెప్పినట్టు చేయలేదని మెండ రామ్మూర్తి అనే రైతుకు చెందిన 18 ఎకరాల భూముల్లో పంటలు సాగు చేసుకోనివ్వ లేదు. ఇప్పటికీ అదే పరిస్థితి. తన భూములను తక్కువ ధరకు లాక్కోవాలని చూసిన అచ్చెన్నాయుడు కుటుంబీకులను కాదన్నందుకు ఆ రైతుకు ఏకంగా సామాజిక బహిష్కరణ కూడా చేశారు.
వారి ఇళ్లల్లో చావు పుట్టుకలకు ఎవరూ వెళ్లకూడదని హుకుం జారీ చేశారు. రజకులు, నాయీ బ్రాహ్మణులు ఇతర కుల వృత్తుల వారు వారి పనులు చేయకూడదని ఆంక్షలు పెట్టారు. చివరికి వారి పంట పొలాల్లో పనులకు సైతం కూలీలు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు.ఇదే నిమ్మాడ గ్రామంలో గతంలో ఎన్నికల నేపథ్యంలో ఓ మహిళను అచ్చెన్నాయుడు వివస్త్రను చేసిన సంఘటన చోటు చేసుకుంది. దీన్ని బట్టి నిమ్మాడలో అచ్చెన్న కుటుంబం ఎంత నియంతగా వ్యవహరిస్తోందో అర్థం చేసుకోవచ్చు.
ఉద్యోగులపైనా..
ఉద్యోగులపైనా అచ్చెన్నాయుడు వైఖరి ఇలాగే ఉంటుంది. అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యులకు చెందిన గ్రానైట్ పాలిషింగ్ యూనిట్లు నిమ్మాడ సమీపంలో ఉండడంతో యథేచ్ఛగా అక్రమ మార్గంలో కోట్ల రూపాయల విలువైన బ్లాకులను తరలించారు. ప్రతి గ్రానైట్ క్వారీ నుంచి కొంత మేరకు బ్లాకులను కింజరాపు కుటుంబ సభ్యులకు చెందిన పాలిషింగ్ యూనిట్లకు మామూలుగా పంపించాలంటూ క్వారీ నిర్వాహకులకు సైతం హుకుం జారీ చేసే వారనేది బహిరంగ రహస్యం. వీటితో పాటు క్వారీల్లో బ్లాకులు తవి్వన తరువాత వచ్చిన వేస్ట్ మెటిరీయల్ రవాణా విషయంలో సైతం ఎలాంటి అధికార అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా క్రషర్స్, రోడ్డు పనులకు తరలించేవారు. వారి అక్రమాలను బయటపెడుతున్నారని అప్పటి మైనింగ్ అధికారి ప్రతాప్‌రెడ్డిని యుద్ధ ప్రాతిపదికన బదిలీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment