సమావేశంలో మాట్లాడుతున్న బండి సంజయ్ కుమార్ చిత్రంలో ఈటల రాజేందర్
హుజూరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి కేసీఆర్ గడీలను బద్దలు కొట్టి బయటకు వచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఈటల దెబ్బకు.. ఫాంహౌస్ నుంచి కేసీఆర్ బయటకు వచ్చారని ఎద్దేవా చేశారు. శనివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో జరిగిన బీజేపీ మండల స్థాయి కార్యకర్తల సమావేశంలో సంజయ్ మాట్లాడారు. సీఎం నియంతృత్వ పాలనకు విసిగి ఆ పార్టీ నేతలు బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. దీంతో కేసీఆర్‌కు భయం పట్టుకుందన్నారు.
హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్ ముఠా దిగిందని, డబ్బులు పంచి ఎన్నికలో గెలవాలని చూస్తోందని ఆరోపించారు. అయితే.. వారి ఆటలు సాగనివ్వమని చెప్పారు. పార్టీలకతీతంగా ఈటల అభివృద్ధిని ఆకాంక్షించారని గుర్తు చేశారు. కేంద్రం విడుదల చేసిన నిధులపై శ్వేత పత్రం విడుదల చేయాలని బండి డిమాండ్ చేశారు. కరోనా సంక్షోభంలో ప్రజలకు భరోసా కల్పించేందుకు ఆరోగ్య మంత్రి హోదాలో ఈటల రాజేందర్ నిత్యం ఆస్పత్రుల చుట్టూ తిరిగితే.. ముఖ్యమంత్రి, మిగిలిన మంత్రులు పట్టించుకోలేదని విమర్శించారు. కాగా, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆత్మగౌరవం ప్రశ్నార్థకంగా మారిందని ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న నియంతృత్వ పాలనతో ప్రజలు హక్కుదారులు కాకుండా మారే పరిస్థితి నెలకొందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment