సాక్షి, సూర్యాపేట: గుర్రంపోడు గిరిజన రైతులకు బీజేపీ అండగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. న్యాయం కోసం పోరాడితే పోలీసులు లాఠీఛార్జ్ చేశారని మండిపడ్డారు. ఆదివారం ఆయన బీజేపీ ఎమ్మెల్యేలు రాజా సింగ్,రఘునందన్ రావు, ఆ పార్టీ సీనియర్ నాయకురాలు విజయ శాంతి,మాజీ ఎంపీ వివేక్‌లతో కలిసి ‘గిరిజన భరోసాయాత్ర’ పేరుతో గిరిజన భూముల సందర్శించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. గిరిజనుల దాడిపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేవారు. గిరిజనుల ప్రతి కన్నీటి చుక్క టీఆర్‌ఎస్‌పై ఎదురుదాడికి దిగుతుందని హెచ్చరించారు. టీఆర్‌ఎస్ కరెప్షన్ ఉన్న క్యారెక్టర్ లేని పార్టీ అని విమర్శించారు. బీజేపీకి ఓట్లు, సీట్లు ముఖ్యం కాదని, పేదల బాగోగులే ముఖ్యమని చెప్పారు. పేదల ఉసురు సీఎం కేసీఆర్‌కు తగలకమానదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
బీజేపీ అధికారంలోకి వస్తేనే ప్రజలకు న్యాయం: విజయశాంతి
అధికారం ఉందని సీఎం కేసీఆర్ దోచుకుంటున్నారని బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి విమర్శించారు. కేసీఆర్‌తో కలిసి పనిచేసినందుకు సిగ్గు పడుతున్నానని అన్నారు. టీఆర్‌ఎస్‌కు రెండోసారి అధికారం ఇచ్చి ప్రజలు తప్పు చేశారని ఆమె పేర్కొన్నారు. ఇంకా పదేళ్లు కేసీఆర్ సీఎంగా ఉంటే తెలంగాణ ఏమై పోతుందోనని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు టీఆర్‌ఎస్ నేతలపై తిరగబడాలని పిలుపునిచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని విజయశాంతి చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment