సాక్షి, హైదరాబాద్: సినీ నటిగానే కాదు.. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర కోసం ప్రయత్నించారు విజయశాంతి. ఆమె రాజకీయాలు పూర్తి చేసుకుని ఈ జనవరి 26తో పాతికేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా శుక్రవారం బీజేపీ సంబురాలు నిర్వహించగా.. పార్టీ కీలక నేతల సమక్షంలో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బీజేపీతోనే తన రాజకీయ ప్రస్థానం మొదలైందన్న ఆమె.. గతంలో బాధగానే ఆ పార్టీని వీడినట్లు.. ఇప్పుడు ఆ పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పోరాడతానని ప్రకటించారామె. మాజీ ఎంపీ విజయశాంతి మాట్లాడుతూ.. ‘‘43ఏళ్లుగా సినిమా పరిశ్రమ లో పనిచేసాను. కానీ, ఈ 25 ఏళ్లు సుదీర్ఘ ప్రయాణంగా అనిపించింది. అప్పట్లో విద్యాసాగర్ రావు, వెంకయ్య నాయుడులు నన్ను బీజేపీ లో చేరమని అడిగారు. 1998 జనవరి 26న వాజ్‌పేయి, అద్వానీల సమక్షంలో బీజేపీలో చేరాను. అవినీతి లేని, క్రమశిక్షణ గల పార్టీ కాబట్టే బీజేపీని ఎంచుకున్నా. తెలంగాణ కావాలి.. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని నాకు చిన్నప్పటి నుంచి ఉంది.
తెలంగాణ కోసం మొదటి నుంచి పోరాటం చేసిన పార్టీ బీజేపీ. సోనియా గాంధీ కి వ్యతిరేకంగా పోటీ చేయమని అద్వానీ కోరారు. కష్టాలైనా , నష్టాలైనా ఇబ్బందులు, వెన్ను పోటులు పడినా పోరాడుతూ వచ్చాను. తెలంగాణ కోసం పోరాడుతూ అందరికీ శత్రువు గా మారాను. తెలంగాణ వాదం వదులుకుంటే ఎన్నో పదవులు వచ్చేవి. అసలు తెలంగాణ కోసమే నేను బీజేపీ నుంచి బయటకు వచ్చాను. సమైక్య వాదులు నాపై ఒత్తిడి చేస్తూ వచ్చారు.. ఎంతో బాధతో బీజేపీ నుంచి బయటకు వచ్చా. ఆ తర్వాత తెలంగాణ సమస్యలపై పోరాడుతుంటే.. కేసీఆర్ అనే రాక్షసుడు నా జీవితంలో ఎంటర్ అయ్యాడు
యూపీఏలో కేసీఆర్ కేంద్రమంత్రిగా తీసుకున్నప్పుడు.. బుద్దుందా? అని అడిగాను. మెదక్ లో ఎంపీ గా టికెట్ ఇచ్చి కేసీఆర్ నన్ను ఓడించేందుకు కుట్ర చేశాడు. ఆ తర్వాత అకారణంగా నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. బిల్లు రోజు నన్ను పోడియం వద్దకు పంపించి కేసీఆర్ సభ నుంచి జారుకున్నాడు. అందమైన తెలంగాణ ఇప్పుడు అసమర్దుడి చేతిలోకి వెళ్ళింది. కానీ, తెలంగాణను బీజేపీ అభివృద్ధి చేస్తుందనే నమ్మకం నాకుంది. కేసీఆర్ ను అధికారంలో నుండి దింపడానికి అంతా కలిసి పనిచేద్దాం. ఇదొక్కసారి కష్టపడితే బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అని ఆమె పేర్కొన్నారు.
తెలంగాణలో మరోసారి కేసీఆర్‌కు అధికారం దక్కితే.. ఎవరూ బ్రతకరు. కేసీఆర్ అనే వ్యక్తి ఒక విషసర్పం. అందరినీ చాపకింద నీరులా చంపేస్తూ వస్తాడు. మరోసారి అధికారంలోకి వస్తే ఏ పెన్షన్లు ఇవ్వడు. నేతలు లేరు అనే విమర్శలు పట్టించుకోకుండా పని చేసుకుపోవాలి. బీజేపీ అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలి అని ఆమె పిలుపు ఇచ్చారు.
ఆమెది కీలక పాత్ర
బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్ మాట్లాడుతూ విజయశాంతిపై ప్రశంసలు గుప్పించారు. ‘‘25ఏళ్ల రాజకీయ ప్రస్థానం లో అనేక పెద్ద పెద్ద కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ ఉద్యమం లో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ అస్తిత్వం కోసం చేసిన పోరాటాలు మరువలేనివి. లోక్ సభ లో కూడా విజయశాంతి తెలంగాణ కోసం పోరాటం చేసింది. బిల్లు అమలు సమయంలో కూడా కేసీఆర్ సభలో లేడు. బంగారు తెలంగాణ కావాలన్న ప్రజలను కలలను పక్కన పెట్టి కుటుంబం ను బంగారు కుటుంబం చేసుకుంటున్నారు. మరో 50ఏళ్ళు ఆమె బీజేపీ లోనే ఉండాలని కోరుకుంటున్నా అని పేర్కొన్నారు.
ఆ పని చేసింది విజయశాంతి మాత్రమే
పాతికేళ్లపాటు రాజకీయాల్లో కొనసాగడం మామూలు విషయమేమీ కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. విజయశాంతిని ఉద్దేశించి పేర్కొన్నారు. తెలంగాణ కోసం పార్లమెంట్ లో కొట్లాడింది విజయశాంతి మాత్రమే అని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమ స్పూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి విజయ శాంతి అని కొనియాడారు. అలాగే.. కేసీఆర్ ఎంతో మంది ఉద్యమకారులను మోసం చేశారని విమర్శించారు బండి సంజయ్. పార్టీని వీడిన నేతలంతా తిరిగి కాషాయ కండువా కప్పుకోవాలన్న ఆయన.. చిన్న చిన్న సమస్యలుంటే సర్థుకుని సిద్దాంతం కోసం పనిచేద్దామన్న పిలుపు ఇచ్చారు.
బీజేపీలో ఉంటేనే అవకాశాలు వస్తాయి. బీజేపీలో ప్రజాస్వామ్యం ఉంటుంది. పని చేయకపోతే పక్కకు తప్పించి బాధ్యతలు వేరే వాళ్ళకు ఇస్తారు. ప్రాంతీయ, కుటుంబ పార్టీల్లో ఇలాంటి అవకాశం ఉండదు. బీజేపీ కోసం రెండు తరాలు త్యాగం చేశాయి. ఇంకా ఎంతో మంది త్యాగాలు చేస్తున్నారు. చిన్న చిన్న సమస్యలతో పార్టీ వీడిన నేతలంతా సిద్దాంతం కోసం పనిచేద్దాం తిరిగి రండి. తెలంగాణలో ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు.. వారిని ఆదుకునేందుకు కలిసి పోరాటం చేద్దాం అని పిలుపు ఇచ్చారాయన.
Comments
Please login to add a commentAdd a comment