అధికారమే లక్ష్యంగా తెలంగాణలో పావులు కదుపుతున్న కమలం పార్టీ రిజర్వుడ్ పాలసీ అమలు చేయబోతోంది. బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో పాగా వేయడానికి సరికొత్త రూట్ మ్యాప్ తయారుచేసింది. ఆదిలాబాద్ ఎంపీ సీటు సాధించడంతో రిజర్వుడు స్థానాల్లో విజయం కోసం బీజేపీ హైకమాండ్ వ్యూహం రచించినట్లు చెబుతున్నారు. ఇంతకీ కాషాయ సేన ప్లాన్ ఏంటి? వాచ్ దిస్ స్టోరీ.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో జెండా ఎగరేయాలని కమలం పార్టీ తహతహలాడుతోంది. తెలంగాణ పీఠం దక్కించుకోవడానికి ఈ రాష్ట్రానికే పరిమితమైన ప్రత్యేక వ్యూహాలను, కార్యాచరణను సిద్ధం చేసింది కాషాయ సేన. ఇందులో భాగంగా ఓరుగల్లు జిల్లాలోని రిజర్వుడు స్థానాలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండు పార్లమెంటు, 12 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
పార్లమెంటు స్థానాల్లో వరంగల్ ఎస్సీ, మహబూబాబాద్ ఎస్టీలకు రిజర్వు చేశారు. అసెంబ్లీ స్థానాల్లో మహబూబాబాద్, డోర్నకల్, ములుగు మూడు ఎస్టీ రిజర్వు కాగా.. వర్థన్నపేట, స్టేషన్ ఘనపూర్ ఎస్సీలకు కేటాయించారు. లోక్‌సభ, అసెంబ్లీ రిజర్వుడు స్థానాల్లో పాగా వేసేందుకు బిజెపి గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలహీనంగా ఉన్నప్పటికీ ప్రజాబలం పెంచుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు కమలం పార్టీ నేతలు.
బీజేపీ వ్యూహంలో భాగంగానే ములుగు జిల్లాలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అధికార బీఆర్ఎస్‌కు, ములుగులో ఎమ్మెల్యే ఉన్న కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చినంత పని చేశారు. ఊహించని విధంగా కషాయదళం కదలిరావడం రాబోయే రోజుల్లో కమలం వికసించడానికి నాంది పలుకుతున్నట్లు సంకేతాన్ని ఇచ్చారు. ఇదే ఊపుతో మిగతా రిజర్వుడు స్థానాల్లో కూడా సభలు, సమావేశాలు నిర్వహించి సత్తా చాటాలని ప్లాన్ చేస్తున్నారు.
చదవండి: ఈటలను మళ్లీ టార్గెట్ చేసిన గులాబీ బాస్.. హుజూరాబాద్‌లో ఏం జరుగుతోంది?
అదే స్పూర్తితో బండి నేతృత్వంలో ఓరుగల్లులో నిరుద్యోగ పోరుయాత్ర చేపట్టేందుకు సిద్ధమౌతున్నారు. పదో తరగతి పేపర్ లీక్ కేసులో సంజయ్ అరెస్టయి, జైల్ కు వెళ్ళడం హాట్ టాపిక్ మారిన నేపథ్యంలో ఓరుగల్లు నుంచి నిరుద్యోగ ర్యాలీతో ప్రభుత్వ కుట్రను బట్టబయలు చేయాలని నిర్ణయించుకున్నట్లు కమలనాధులు చెబుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలను విస్మరించి..ప్రశ్నించే వారిని ఇబ్బందులకు గురి చేస్తున్న విషయాన్ని జనంలోకి తీసుకెళ్ళి విస్తృత ప్రచారం చేయాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. పేపర్ల లీక్ కేసు నుంచి ప్రజల దృష్టిని మళ్ళించేందుకే.. కమలాపూర్‌లో టెన్త్ పేపర్ లీక్ కేసును తెరపైకి తెచ్చారనే విషయాన్ని జనంలోకి తీసుకువెళ్ళాలని బీజేపీ చూస్తోందట.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడినే తొలి ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ చెప్పిన మాట ఏమైందని ప్రశ్నిస్తూనే, దేశంలో అత్యున్నతమైన రాష్ట్రపతి పదవికి గిరిజన మహిళను ఎంపిక చేసిన ఘనత బిజేపిదని చాటిచెప్పే ప్రయత్నం చేస్తోంది. అందుకే రిజర్వ్ స్థానాలను లక్ష్యంగా చేసుకొని రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను, నెరవేరని హామీలను ప్రజల్లోకి తీసుకెళ్ళే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు.
ములుగు సభ వేదికగా బండి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి కేసిఆర్ వెన్నంటి ఉండి రాష్ట్ర సాధన ఉద్యమంలో లాఠీదెబ్బలు తిన్న మాజీ ఎంపీ రవీంద్రనాయక్ పరిస్థితిని ఉదహారణగా చెబుతూ కేసీఆర్ వైఖరిని ఎండగట్టారు. రవీంద్ర నాయక్‌ను చూపిస్తూ వచ్చే ఎన్నికల్లో ఇలాంటి నాయకుడు మనకు కావాలని మహాబూబాబాద్ పార్లమెంటు సీటుకు అభ్యర్థి అనే సంకేతం ఇచ్చారు. దళితులు, గిరిజనులను రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తుందో వివరిస్తూ రిజర్వుడు స్థానాల్లో ఆయా వర్గాల మద్దతు కూడాగట్టుకునే ప్రణాళిక అమలు దిశగా పావులు కదుపుతున్నారు.
-పొలిటికల్ ఎడిటర్, సాక్షి వెబ్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment