ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆ నియోజకవర్గం కాషాయ కోటగా పేరు తెచ్చుకుంది. అన్ని చోట్లా డిపాజిట్లు పోయినా.. అక్కడ మాత్రం గులాబీ పార్టీకి కాషాయ దళం చెమటలు పట్టించింది. ఓటమి భయం కలిగించింది. ఇప్పుడు అదే నియోజకవర్గం మీద కాషాయ సేన రాష్ట్ర దళపతి గురి పెట్టారా? మజ్లిస్ పార్టీ బలంగా ఉన్న ఆ స్థానంలో బండి సంజయ్ పోటీ చేయబోతున్నారా?
బండి టార్గెట్ మజ్లిస్.?
కమలం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. తన ఐదో విడత పాదయాత్రను నిర్మల్ జిల్లా బైంసా మాటేగామ్ నుంచి బండి సంజయ్ ప్రారంభించారు. భైంసాలో సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో.. కోర్టు ఆదేశాల మేరకు మూడు కిలోమీటర్ల దూరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి రాగానే భైంసా పేరును మహిషాగా మార్చుతామన్నారు. అలాగే ముథోల్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటామన్నారాయన. వీటితో పాటు భైంసా అల్లర్ల సందర్భంగా కేసుల్లో చిక్కుకున్న వారికి అండగా నిలబడతామని హామీ ఇచ్చారు సంజయ్. ఎంఐఎం కోటను బద్దలు చేయడమే బీజేపీ లక్ష్యమన్నారు.
సామాజిక వర్గం కలిసొస్తుందా?
బహిరంగ సభలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలతో.. బండి సంజయ్ ముథోల్ నియోజకవర్గం నుండే అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతారనే ప్రచారం జరుగుతోంది. అందుకే భైంసా పేరు మార్చుతామని...ముథోల్ను దత్తత తీసుకుంటానని ప్రకటించారంటూ కాషాయ శిబిరంలో చర్చ సాగుగుతోందట. సంజయ్ సామాజిక వర్గానికి చెందిన మున్నూరు కాపులు నియోజకవర్గంలో బలమైన వర్గంగా ఉన్నారు. ఈ వర్గానికి చెందినవారే 47 వేల మంది ఓటర్లున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి నుండి పోటీ చేస్తే తన సామాజిక వర్గం అంతా పార్టీ వైపు నిలబడే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారట. దీనికి తోడు నియోజకవర్గంలో హిందుత్వ ఓట్లు కూడా బాగానే ఉండటంతో..విజయం ఖాయమని భావిస్తున్నారని సమాచారం. అలాగే..ఎంఐఎం పార్టీ బైంసా మున్సిపాలీటిని అనేక సంవత్సరాలుగా ఏలుతోంది. ఎంఐఎం కోటను కూల్చడమే తనలక్ష్యమంటున్నారు సంజయ్.
కమలం వ్యూహమేంటీ?
గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాషాయ పార్టీ ముథోల్ నియోజకవర్గంలో భారీగా ఓట్లు సాధించింది. రాష్ట్రంలోని వందకుపైగా నియోజకవర్గాలలో కమలం డిపాజిట్లు కోల్పోయినా.. ఇక్కడ మాత్రం పార్టీ అభ్యర్థి రమాదేవి రెండు సార్లూ అదికార పార్టీకి ఓడిపోతామనే భయాన్ని కలిగించింది. పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉన్నందున రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తే, గెలుపు ఖాయమని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయట. ముథోల్ నుంచి బండి బరిలోకి దిగడం వల్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోపార్టీకి ఒక ఊపు వస్తుందని.. అదేవిధంగా ఉత్తర తెలంగాణ అంతటా దీని ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. భైంసా పట్టణం ఉన్న ముథోల్ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు పోటీ చేస్తే..హిందూ ఓటు బ్యాంకు పై రాష్ట్ర వ్యాప్తంగా ప్రబావం ఉంటుందట. అన్నీ దృష్టిలో ఉంచుకునే బండి సంజయ్ ముథోల్ నుంచి పోటీ చేసే అవకాశాలు బాగా ఉన్నట్లు చెబుతున్నారు.
బండి సంజయ్ ముథోల్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారంపై పార్టీలో తీవ్రమైన చర్చ జరుగుతోందట. అయితే ఈ విషయాన్ని పార్టీలోని సీనియర్లు కొట్టిపారేస్తున్నట్లు సమాచారం. సంజయ్ సొంత జిల్లాలోని కరీంనగర్ లేదా వేములవాడ నుంచే బరిలో దిగుతారని అంటున్నారట. మరి ఆఖరు నిమిషంలో పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment