అడవుల జిల్లా ఆదిలాబాద్‌లో కమలం పార్టీని కోవర్టుల భయం వెంటాడుతోందా? ప్రత్యర్థి పార్టీలతో కుమ్మకై పార్టీలోని బలమైన నేతల్ని దెబ్బతీయడానికి కుట్రలు చేస్తున్నారా? కాషాయ సేనలో కోవర్టులను చేరదీస్తున్నదెవరు? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీజేపీలో అసలేం జరుగుతోంది?
బండి నడిపించాం, టికెట్ ఇవ్వండి..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్మల్ జిల్లాలో జరిపిన ప్రజా సంగ్రామ యాత్ర పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. వారిలో బలాన్ని పెంచింది. జిల్లా అంతటా నిర్వహించిన సభలు, సమావేశాలతో కేడర్‌కు ఊపునిచ్చింది. భారీగా తరలివచ్చిన ప్రజలు కమలం పార్టీ పట్ల వారికున్న అభిమానాన్ని చాటుకున్నారు. దీంతో పార్టీ టిక్కెట్ వస్తే చాలు.. విజయం సాధించడం ఖాయమనే నమ్మకం నాయకుల్లో కలిగించింది. దీంతో అనేక మంది నాయకులు ఎన్నికల్లో టిక్కెట్ల కోసం పోటీ పడుతున్నారు. ద్వితీయ శ్రేణి నేతలు సైతం తమకు కూడా టిక్కెట్ ఇస్తే గెలిచి చూపిస్తామంటూ రాష్ట్ర నేతల దగ్గర పైరవీలు చేస్తున్నారని టాక్. టిక్కెట్ల కోసం పెరుగుతున్న పోటీ.. పార్టీని డ్యామేజ్ చేయాలనుకునేవారికి అవకాశం కలిగిస్తోందనే ప్రచారం సాగుతోంది. ఈ వ్యవహారం పార్టీ కోసం కష్టపడుతూ.. కచ్చితంగా టిక్కెట్ పొందడానికి అర్హత ఉన్న నేతల్లో ఆందోళన పెంచుతోంది.
టికెట్ మాత్రం నాకే..
ముథోల్ నియోజకవర్గంలో బండి సంజయ్ పాదయాత్రకు ముగ్గురు నేతలు ఒకరిని మించి మరొకరు జనసమీకరణ చేశారు. అదేవిధంగా టిక్కెట్ తనకే దక్కుతుందని ముగ్గురూ ప్రచారం చేసుకుంటున్నారట. నేతలంతా వర్గాలుగా విడిపోయి నియోజకవర్గంలో పట్టు బిగిస్తూ.. తమ వ్యతిరేకుల్ని చిత్తు చేయడానికి ప్రయత్నిస్తున్నారని నియోజకవర్గంలో కేడర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలో మాజీ ఎంపీ రమేష్ రాథోడ్‌తో పాటు మరో ముగ్గురు పోటీ పడుతున్నారు. నలుగురూ నాలుగు వర్గాలుగా చీలిపోయారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేసి అనుభవం ఉన్న రమేష్ రాథోడ్ బలమైన అభ్యర్థిగా పార్టీ నిర్వహించిన సర్వేలో తేలిందట. అయితే రమేష్ రాథోడ్‌కు టిక్కెట్ ఇస్తే మిగిలిన వారు పనిచేయరనే టాక్ వినిపిస్తోంది. ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓడించేందుకు ఇప్పటినుంచే పావులు కదుపుతున్నారట. ఈ విషయమై రమేష్ రాథోడ్ తన సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
మా వాడికి టికెట్ ఇవ్వాల్సిందే..
బోధ్ నియోజకవర్గానికి చెందిన ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు.. తన నియోజకవర్గంలో ఇటీవలే పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగి దశరథ్‌కు మద్దతిస్తున్నట్లు సమాచారం. దశరథ్ కూడా టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. ఇక జిల్లా కేంద్రం ఆదిలాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో పోటీకి జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ సీరియస్‌గా ప్రయత్నిస్తున్నారు. ఆయన గతంలో రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయారు. అయితే జిల్లా పరిషత్ చైర్మన్ సుహసినిరెడ్డి, ఎన్అర్ఐ కంది శ్రీనివాస్ తామే అభ్యర్థులమంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే పార్టీ నాయకత్వం ఏ పిలుపునిచ్చినా కలిసి పనిచేయలేని పరిస్థితులు జిల్లా కమలం పార్టీ నాయకుల మధ్య ఉన్నట్లు చెబుతున్నారు. కొందరు నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి విభేదాలు చేరాయట. ఇటీవల బండి సంజయ్ సమక్షంలోనే ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంత మంది పోటీ పడుతున్న ఈ పరిస్థితుల్లో ఒకరికి టిక్కెట్ ఇస్తే మిగిలినవారు పనిచేయరనే టాక్ వినిపిస్తోంది.
ఒకరికి టికెట్ ఇస్తే.. ఇంకొకరు ఓడిస్తారు
ఇక పూర్తిగా ఆదివాసీల కోట ఆసిఫాబాద్ నియోజకవర్గంలో.. ఆదివాసీ, లంబాడ వర్గాల నేతలు టిక్కెట్ కోసం పోటీపడుతున్నారు. ఇక్కడ ఆదివాసీలే గెలుపోటములు నిర్ణయిస్తారు. ఆదివాసీ నేత విజయ్‌కుమార్.. లంబాడా వర్గం నేత ఆత్మారామ్ నాయక్ టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారు. ఆత్మారామ్ గత ఎన్నికల్లో పోటీ చేసి డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. అయినా ఈసారి కూడా తనకే టిక్కెట్ ఇస్తారంటూ ఆయన ధీమాగా ఉన్నారు. ఇక సిర్పూర్ కాగజ్ నగర్లో పోటీ పడుతున్న ఇద్దరు నేతల మధ్య సర్దుబాటు చేసినా.. కుదరడంలేదట. ఈ విధంగా ప్రతీ నియోజకవర్గంలోనూ పార్టీలో బహుముఖ పోటీలు రాష్ట్ర నాయకత్వాన్ని చికాకు పెడుతున్నట్లు సమాచారం. ఒకరికి టిక్కెట్ ఇస్తే.. టిక్కెట్ రానివారు కచ్చితంగా కోవర్ట్ ఆపరేషన్ చేసి.. తమ పార్టీ అభ్యర్థినే ఓడించేందుకు ప్రయత్నిస్తారని కమలం నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను వేధిస్తున్న ఈ సమస్యను కాషాయ పార్టీ నాయకత్వం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.
పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment