సాక్షి, హైదరాబాద్: మిడ్ మానేరు ప్రాజెక్టు ముంపు పరిహారం చెల్లింపు విషయంలో అర్హత లేకపోయినా రాజ్యసభ సభ్యుడు జె. సంతోష్ రావు, ఆయన కుటుంబ సభ్యులతోపాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువులకు సైతం ప్యాకేజీ కింద పరిహారం చెల్లించారని కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు. ఆ మేరకు ఆయన సోమవారం లేఖ రాశారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న మిడ్‌మానేరు బాధితుల సమస్యలను పరిష్కరించాలని, రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
అసలు మిడ్ మానేరు సమస్య ఏమిటంటే..
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు రేవంత్‌కు అభినందనలు తెలియజేసిన సంజయ్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఎన్నో ఏళ్ల తరబడి అపరి ష్కృతంగా ఉన్న మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యలను, ప్రభుత్వం ఇచ్చిన హామీ లను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో 17 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభు త్వం ప్రారంభించిన ప్రాజెక్టు మిడ్ మానేరు.
లక్ష లాది ఎకరాలకు సాగు నీటితోపాటు తాగునీటి అవ సరాలను తీరుస్తుందనే భావనతో ప్రాజెక్టు ముంపు పరిధిలోని 12 గ్రామాల ప్రజలు ఇళ్లు, భూములు త్యాగం చేశారు. ‘ప్రభుత్వ లెక్కల ప్రకారం 12,500 మంది బాధితులున్నారు. వీరికి సహాయ పునరావాస ప్యాకేజీ కింద 2005–06లో నాటి ప్రభుత్వం జీవో నెం.69 ప్రకారం ఐఏవై కింద ఇళ్లు మంజూరు చేసింది. ముంపు పరిహారం చెల్లిస్తామని పేర్కొంది. వీటి అమలులో తీవ్రమైన జాప్యం జరిగింది.
2018 జూన్ 15న నాటి సీఎం కేసీఆర్ ఈ ప్రాంతానికి వచ్చి మిడ్ మానేరు బాధితులకు ఐఏవై ఇళ్లకు బదులుగా డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తామని, అందులో భాగంగా ఒక్కో బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల 4 వేలు చెల్లిస్తానని హమీ ఇచ్చారు. పన్నెండు గ్రామాల రైతులంతా సాగు భూమిని కోల్పోయిన నేపథ్యంలో నీలోజిపల్లి నుండి నందిగామ, అగ్రహారం వరకు ఇండస్ట్రియల్ కారిడార్‌ను, స్కిల్ డెవలెప్‌మెంట్ కాలేజీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
తద్వారా వారిలో నైపుణ్యత పెంచి స్వయం ఉపాధి కల్పిస్తామని ప్రకటించారు. అలాగే 2009 కొత్త గెజిట్ ప్రకారం తేది 01–01–2015 నాటికి 18 ఏళ్లు నిండిన యువతీ యువకులకు ముంపు పరిహారం, పట్టా ఇస్తామన్నారు. కానీ నేటికి ఒక్క అడుగు ముందుకు పడలేదు’ అని సంజయ్ ఆ లేఖలో వివరించారు. వెంటనే సంబంధిత మంత్రి, స్థానిక శాసనసభ్యుడు, ప్రజా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి ఈ సమస్యల పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
రేవంత్ హామీ ఇచ్చారని గుర్తు చేసిన సంజయ్
‘రెండేళ్ల క్రితం మిడ్ మానేరు ముంపు బాధితుల కోసం కొదురుపాకలో నిర్వహించిన అఖిలపక్ష ‘మహాధర్నా’లో మీరు, నేను హాజరై ముంపు బాధితులకు సంఘీభావం తెలిపాం. నాటి ధర్నాలో మిడ్‌మానేరు బాధితుల సమస్యలను పరిష్కరించేదాకా వారి పక్షాన పోరాటం చేస్తామని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వాటిని పరిష్కరిస్తామని మీరు హామీ ఇచ్చారు’ అని సంజయ్ గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment