సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌కు వామపక్షాలకు మధ్య ఎన్నికల పొత్తు కుదిరిందన్న వార్తల్లో వాస్తవం లేదని సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సీపీఐ, సీపీఎం పార్టీలకు చెరో రెండు అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు సోమవారం విస్తృత ప్రచారం జరిగింది. ఢిల్లీ స్థాయిలో ఈ పొత్తు కుదిరిందని, సీపీఎంకు మిర్యాలగూడ, భద్రాచలం, సీపీఐకి మునుగోడు, కొత్తగూడెం నియోజకవర్గాలను కేటాయించారని ప్రచారం జరిగింది. అయితే ఈ అంశాన్ని సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క సున్నితంగా తోసిపుచ్చారు.
వామపక్షాలతో పొత్తు చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని, వామపక్షాలకు నాలుగు స్థానాలు కేటాయించినట్లు జరిగిన ప్రచారం కేవలం ఊహాగానమేనని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం త్వర లోనే అధికారికంగా ప్రకటిస్తుందని, అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి మీడియాలో వస్తున్న కథనాలపై పార్టీ శ్రేణులు ఆందోళనకు గురికావద్దని సోమవారం ఆయన వెల్లడించారు. కాగా, వామపక్షాలు అడుగుతున్న నియోజకవర్గా లకు సంబంధించిన సమాచారాన్ని టీపీ సీసీ, అధిష్టానికి పంపించినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా ఈనెల ఒకటో తేదీన సమావేశమై ఉమ్మడిగా ఎన్నికలకు వెళ్లడానికి కార్యాచరణ సిద్ధం చేస్తా మని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పినా.. అలాంటి సమావేశం ఏదీ జరగకపోగా, చెరో రెండు స్థానాలు ఖరారైనా ఏయే నియోజకవర్గాలన్న అంశంపై మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతున్నట్లు కామ్రేడ్లు చెబుతున్నారు.
అప్పుడు బీఆర్‌ఎస్‌తో ఇప్పుడు కాంగ్రెస్‌తో..
‘ఇండియా’కూటమిలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు కీలకంగా ఉన్నాయి. తెలంగాణలోనూ బీజేపీని ఓడించడమే లక్ష్యంగా కమ్యూనిస్టులు ముందుకు సాగుతున్నారు. మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా బీజేపీకి బ్రేక్ వేసేందుకు ఆనాటి పరిస్థితుల్లో బీఆర్‌ఎస్‌తో వామపక్షాలు చేతులు కలిపాయి. ఆ ఎన్నికలో బీజేపీ గెలవకుండా అడ్డుకోవడంలో కమ్యూనిస్టులు కీలక పాత్ర పోషించారు.
ఈ నేపథ్యంలో సాధారణ ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్‌తో కలసి సాగాలని లెఫ్ట్ పార్టిలు భావించాయి. కానీ వివిధ రాజకీయ కారణాలతో అది సాధ్యం కాలేదు. దీంతో రాష్ట్రంలో బీజేపీని, బీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు కాంగ్రెస్‌తో కలవాలని కమ్యూనిస్టులు నిర్ణయించుకున్నారు. ఈ మూడు పార్టీలు కలిస్తే పలు నియోజకవర్గాల్లో కమ్యూనిస్టుల ఓట్లు కాంగ్రెస్‌కు కలసి వస్తాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
గతంలోనే జాతీయ నేతల భేటీ..
తెలంగాణలో పొత్తుపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిలు గతంలోనే భేటీ అయినట్లు తెలంగాణ లెఫ్ట్ నేతలు వెల్లడించారు. మూడు జాతీయ పార్టిల అధినేతలు తెలంగాణలో పొత్తుకు పూర్తి స్థాయిలో ఆమోదం తెలిపారని చెపుతున్నారు.
పొత్తుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఆయా పార్టిల రాష్ట్ర నేతలకు అగ్ర నాయకత్వాలు సూచించాయని సమాచారం. కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలసి జాబితాను ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. కాగా, కమ్యూనిస్టులు కోరుతున్న స్థానాల్లోని కాంగ్రెస్ ఆశావహుల నుంచి ఎలాంటి ప్రతిస్పందన వస్తుందోనన్న ఆందోళన హస్తం నేతల్లో నెలకొని ఉంది.
Comments
Please login to add a commentAdd a comment