సాక్షి, బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో కర్ణాటకలో రాజకీయ వేడి మొదలు కాబోతోంది. అధికారం నిలబెట్టుకునేందుకు భారతీయ జనతా పార్టీ ఇతర పార్టీ నేతలకు ఆహ్వానం పలుకుతోంది. ఇందులో భాగంగా కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్యకు బీజేపీ గాలం వేసినట్లు తెలిసింది. ఇప్పటికే సీట్ల సర్దుబాటు విషయం కూడా చర్చించినట్లు సమాచారం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విధానసభ ఎన్నికల్లో తన వర్గానికి మొత్తం 20 అసెంబ్లీ సీట్లు కావాలని సిద్ధరామయ్య అడిగారట. దీనిపై బీజేపీ అధిష్టానం పునరాలోచిస్తున్నట్లు సమాచారం. అన్నీ కుదిరితే సిద్ధరామయ్య కమలం గూటికి చేరడం ఖాయమనిపిస్తోంది.
మంత్రివర్గంలో సిద్ధూ అనుచరులు
కర్ణాటక కేబినెట్‌లో ఇప్పటికే సుమారు 15 మంది మంత్రులు సిద్ధూ అనుచరులు అని చెప్పవచ్చు. కాంగ్రెస్ – జేడీఎస్ సంకీర్ణంలో అమాత్యగిరి దక్కలేదని అసమ్మతి వ్యక్తం చేస్తూ బీజేపీలో చేరిన వారంతా సిద్ధూ అనుచరులుగానే చెబుతారు. వారందరిలో ఒకరిద్దరు మినహా అందరికీ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంలో మంత్రి పదవులు లభించాయి. దీంతో అసెంబ్లీ ఎన్నికలవేళకి సిద్ధరామయ్య కూడా కమలం గూటికి చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. సీట్ల సర్దుబాటు తేలకపోవడంతో ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది.
20 స్థానాలపై సిద్ధూ పట్టు
బీజేపీ నేతల ఆహ్వానానికి ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే తన వర్గానికి సుమారు 20 అసెంబ్లీ స్థానాల టికెట్లు ఇవ్వాలని పట్టుబట్టారు. వరుణ, చాముండేశ్వరి, హుణసూరు, హెబ్బాళ, చామరాజపేటె, కోలారు తదితర స్థానాలను సిద్ధూ ఆశించారు. మైసూరు జిల్లా హుణసూరు నుంచి సిద్ధూ పోటీ చేసినా తనకు ఇష్టమే అని మాజీ మంత్రి హెచ్.విశ్వనాథ్ అన్నారు. సిద్ధరామయ్య కోసం తన సీటును వదులుకుంటానని స్పష్టం చేశారు.
పాత మైసూరుపై పట్టు కోసమే..
వచ్చే ఎన్నికల్లో బీజేపీ సొంతబలంతో అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ఇతర పార్టీల నేతలకు గాలం వేస్తోంది. ఇందులో భాగంగా బీజేపీ ప్రాబల్యం లేని పాత మైసూరు ప్రాంతంలో పట్టు సాధించేందుకు అక్కడి నేతలపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా మాజీ సీఎం సిద్ధరామయ్యను బీజేపీలో చేర్చుకునేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. పాత మైసూరు ప్రాంతంలో మొత్తం 89 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ప్రస్తుతం 10 చోట్ల మాత్రమే బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తోంది.
త్వరలోనే కాంగ్రెస్‌కు సిద్ధూ గుడ్‌బై: మరి కొన్ని రోజుల్లో మాజీ సీఎం సిద్ధరామయ్య కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి.. బీజేపీలో చేరుతారని రాష్ట్ర మంత్రి ఆర్.మునిరత్న వ్యాఖ్యానించారు. గురువారం ఆయన విధానసౌధలో మీడియాతో మాట్లాడారు. వచ్చే 2023 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఘోర పరాభవం తప్పదని జోస్యం చెప్పారు. గతంలో రామకృష్ణ హెగ్డేకు వచ్చిన పరిస్థితే.. ఇప్పుడు సిద్ధరామయ్యకు వస్తుందన్నారు. అదేవిధంగా మండ్య ఎంపీ సుమలతను బీజేపీలో చేర్చుకునే అంశంపై పార్టీ పెద్దలు నిర్ణయిస్తారని చెప్పారు.
కర్ణాటక అసెంబ్లీ స్థానాలు –
224+1 (నామినేటెడ్),
బీజేపీ – 122
(స్పీకర్ విశ్వేశ్వర హెగ్డే కాగేరితో కలిపి)
కాంగ్రెస్ – 69
జేడీఎస్ – 32
స్వతం్రత్రులు– 2
కన్నడనాట కాంగ్రెస్‌కు భారీ షాక్?
Published Sun, May 8 2022 5:06 AM | Last Updated on Sun, May 8 2022 10:51 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment