బిహార్‌ ఎన్నికల ఎఫెక్ట్‌; కాంగ్రెస్‌ సీట్లకు కోత! | Bihar Election Result 2020: Regional Parties Curtail Congress Share | Sakshi
Sakshi News home page

బిహార్‌ ఎన్నికల ఎఫెక్ట్‌; కాంగ్రెస్‌ సీట్లకు కోత!

Published Thu, Nov 12 2020 2:55 PM | Last Updated on Thu, Nov 12 2020 3:26 PM

Bihar Election Result 2020: Regional Parties Curtail Congress Share - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ పార్టీకి పరాభవం ఎదురయింది. ఏకంగా 70 సీట్లకు పోటీచేసి కేవలం 19 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. ప్రధాన ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీతో 33 స్థానాల్లో తలపడి కేవలం ఆరు స్థానాల్లో మాత్రమే విజయం సాధించగలిగింది. తమ ఓటమిని కాంగ్రెస్‌ నాయకులు ఇతరులపైకి నెట్టేందుకు ప్రయత్నించారు. ఏఐఎంఐఎం సెక్యులర్‌ ఓట్లను చీల్చడమే తమ ఓటమికి కారణమని కాంగ్రెస్‌ నాయకులు ఆరోపిస్తుండగా, బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌ పార్టీకి లేకుండా పోయిందని, పైగా ఆ రెండు పార్టీలు కూడా ఒకే నాణెంకు రెండు ముఖాలని ఏఐఎంఐఎం నాయకుడు అసదుద్దీన్‌ ఓవైసీ ఎదురు దాడికి దిగారు.

ప్రతిపక్ష పార్టీ కాకపోయినప్పటికీ ప్రధాన పాత్ర పోషించాల్సిన బిహార్‌లోనే కాంగ్రెస్‌ పార్టీ ఇలా చతికిల పడితే వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి పాత్ర నిర్వహించగలదని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఆ రెండు రాష్ట్రాల్లో ప్రధానంగా ప్రాంతీయ పార్టీల ప్రాబల్యమే ఎక్కువనే విషయం తెల్సిందే. గత కొన్నేళ్లుగా కాంగ్రెస్‌ పార్టీ తగినన్ని సీట్లను గెలుచుకోలేక పోయినప్పటికీ తన పూర్వ వైభవాన్ని చెప్పుకొని ప్రాంతీయ పార్టీల నుంచి ఎక్కువ సీట్లను దక్కించుకుంటూ వస్తోంది. (బిహార్‌ ఎన్నికల్లో సత్తా చాటిన ఎంఐఎం)

2016లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ, డీఎంకే నాయకత్వంలో కూటమిలో 41 సీట్లను పంచుకొంది. అయితే వాటిలో ఎనిమిది సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. నాటి ఎన్నికల్లో ఏఐఏడిఎంకే ఏకంగా 134 సీట్లను గెలుచుకోగా, దాని ప్రధాన ప్రత్యర్థి పార్టీ అయిన డీఎంకే కేవలం 98 సీట్లను మాత్రమే గెలుచుకుంది. ఏఐఏడిఎంకే తాను గెలుచుకున్న స్థానాల్లో సగటున 40.78 శాతం ఓట్లు సాధించగా, డిఎంకే తాను గెలిచిన స్థానాల్లో 41.05 శాతం ఓట్లను సాధించింది. ఏఐఏడిఎంకేతో 41 స్థానాల్లో పోటీ పడిన కాంగ్రెస్‌ పార్టీ 33 చోట్ల ఓడిపోయింది. ఆ పార్టీకి 36.46 శాతం ఓట్లు సాధించింది. ఈ లెక్కన నాడు ఎన్నికల్లో డీఎంకే విజయావకాశాలను కాంగ్రెస్‌ పార్టీయే దెబ్బతీసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2017లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీతో పొత్తు పెట్టుకొని 105 సీట్లకు పోటీ చేసిన కాంగ్రెస్‌ కేవలం ఏడు సీట్లలో మాత్రమే విజయం సాధించింది.

2016లో జరిగిన బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎంతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్‌ 92 సీట్లకు పోటీ చేసి 44 సీట్లను గెలుచుకుంది. సీపీఏం 148 సీట్లకు పోటీచేసి కేవలం 26 సీట్లను మాత్రమే గెలుచుకుంది. రానున్న తమిళనాడు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ పార్టీలో కలసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని, అయితే గతంలో ఇచ్చినన్ని సీట్లు ఇవ్వమని ఓ డీఎంకే నాయకుడు తెలిపారు. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ పార్టీ బలహీనతను మరోసారి చాటి చెప్పాయని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఆ నాయకుడు వ్యాఖ్యానించారు. ఈ లెక్కన వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకాల్లో కాంగ్రెస్‌ పార్టీకి తక్కువ సీట్లు వచ్చే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. డీఎంకే–కాంగ్రెస్‌ పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో డీఎంకే కాదని కాంగ్రెస్‌ పార్టీ ఎక్కువ సీట్లను డిమాండ్‌ చేసే అవకాశం లేదని, అందుకు బిహార్‌ ఎన్నికల ఫలితాలు కూడా దోహదపడతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. (చదవండి: తేజస్వీపై బీజేపీ ఫైర్‌ బ్రాండ్‌ ప్రశంసలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement