ఉమ్మడి ఓరుగల్లు జిల్లాలో పొలిటికల్ బర్త్‌డే పార్టీలు జోరందుకున్నాయి. రెండు పార్టీలు..ఇద్దరు గిరిజన నేతలు..మరో బీసీ నేత పుట్టిన రోజు వేడుకల్ని అట్టహాసంగా నిర్వహించుకున్నారు. గిరిజన నేతలిద్దరూ స్వపక్షంలోనే ప్రతిపక్షంలా మారిపోయారు. సొంత పార్టీలోని ప్రత్యర్థులపై పై చేయి సాధించడానికి ప్రయత్నిస్తున్నారు. అసలు గజమాలల బర్త్‌డే వేడుకల వెనుక రహస్యం ఏంటి?
మానుకోటలో ఏం జరిగింది?
పోరాటాల పురిటిగడ్డ ఓరుగల్లులో పార్టీల మధ్య..ఒకే పార్టీలోని ప్రత్యర్థుల మధ్య పోరు తీవ్రమవుతోంది. అంతర్గత విభేదాలతో రగిలిపోతున్న కొందరు నేతలు రాజకీయంగా పంతం నెగ్గించుకునేందుకు.. ఎదుటివారిని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తమ సత్తా చాటేందుకు సరికొత్త వ్యూహాలతో జనంలోకి వెళ్తున్నారు. అవకాశం దొరికితే చాలు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు బర్త్ డే వేడుకలను వేదికగా చేసుకొని బలనిరూపణకు దిగుతున్నారు. మానుకోటలో అధికార పార్టీ ఎంపీ మాలోతు కవిత, ములుగు జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే పోదెం వీరయ్య నిర్వహించిన బర్త్ డే వేడుకలు ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇద్దరు నేతలు సృష్టించిన హంగామా చర్చనీయాంశంగా మారింది.
చదవండి: (TS: కాంగ్రెస్‌లో ఎవరిగోల వారిదే.. ఠాక్రే ముందున్న సవాళ్లేంటీ?)
గజమాల వెనక రాజకీయం
పోటాపోటీ కార్యక్రమాలకు అధికార, విపక్ష పార్టీలనే తేడా లేదు. కొత్త సంవత్సరం తొలిరోజున మహబూబాబాద్ ఎంపీ, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోతు కవిత పుట్టినరోజు. ఆరోజు కవిత, ఆమె అనుచరులు సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. భారీ క్రేన్ సహాయంతో గజమాల వేసుకుని మానుకోటలో జనసందోహంతో ఊరేగింపు నిర్వహించారు. భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అనుచరులతో రాజకీయ ప్రత్యర్థులకు సవాల్ విసిరారు. కవిత ఆమె అనుచరులు సృష్టించిన హంగామా వెనుక అసలు రాజకీయం వేరే ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
కొంతకాలంగా మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఎంపీ కవిత మధ్య కోల్డ్ వార్ కొనసాగుతుంది. రాబోయే ఎన్నికల్లో మహబూబాబాద్ అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్న కవిత సిట్టింగ్ ఎమ్మెల్యేకు చెక్ పెట్టేందుకే బర్త్ డే వేడుకలతో సత్తా చాటే ప్రయత్నం చేశారని ప్రచారం సాగుతోంది. రైతు దీక్ష, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధనకై బిఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఎంపీ కవిత నుంచి మైక్ లాక్కుని అవమానపరిచేలా వ్యవహరించారు. ఈ వ్యవహారంతో రగిలిపోతున్న కవిత వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ టార్గెట్ గా పావులు కదుపుతున్నట్లు చర్చ జరుగుతోంది.
నేనూ లైన్లో ఉన్నాను..!
రాజకీయాల్లోకి వచ్చాక ఏనాడూ బర్త్ డే సెలబ్రేషన్స్ జరుపుకోని భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే పోదెం వీరయ్య ఈసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ములుగు జిల్లా వెంకటాపూర్ లో జనవరి 2న బర్త్ డే వేడుకలతో హంగామా చేశారు. భారీ క్రేన్ సహాయంతో గజమాల ధరించి వెంకటాపూర్‌లో ఊరేగింపు మొదలుపెట్టి నియోజకవర్గంలోని మెజార్టీ గ్రామాల్లో పర్యటించారు. పోదెం వీరయ్య పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన నిర్వహించుకున్న బర్త్‌డే వేడుకలు జరుగుతున్న ప్రచారం నిజమే అనిపిస్తున్నాయని అంటున్నారు. వీరయ్య హస్తానికి హ్మాండిచ్చి కారెక్కేందుకు సిద్ధమవుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే కారు ఎక్కడానికి సిద్ధమవుతున్న వీరయ్య, అక్కడా ఉంటా.. ఇక్కడ ఉంటా అంటున్నారట. భద్రాచలం, ములుగు రెండు నియోజకవర్గాలు తనవే అని నిరూపించుకునేందుకు బల ప్రదర్శన నిర్వహించినట్లు ప్రచారం సాగుతుంది.
వీరయ్య వ్యూహమేంటీ?
ములుగు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీతక్కకు చెక్ పెట్టేందుకు అదే సామాజిక వర్గానికి చెందిన పోదెం వీరయ్యకు గులాబీ పార్టీ గాలం వేసినట్లు తెలుస్తుంది. ముందుగా సీతక్కనే గులాబీ గూటిలో చేర్చుకునేందుకు ఆ పార్టీ నేతలు యత్నించినప్పటికీ రేవంత్ రెడ్డి నమ్మిన బంటులా ఉన్న సీతక్క పార్టీ మారేందుకు ససేమిరా అనడంతో పోదెం వీరయ్యతో సీతక్కకు చెక్ పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే వీరయ్య గులాబీ బాస్ ముందు కొన్ని షరతులు పెట్టినట్లు ప్రచారం సాగుతోంది. బీఆర్ఎస్‌లో చేరి ములుగులో తాను పోటీలో నిలిచినా.. భద్రాచలంలో మాత్రం తాను సూచించిన వ్యక్తికే టికెట్ ఇవ్వాలని ప్రతిపాదన పెట్టినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అందులో భాగంగానే ఎన్నడు లేని విధంగా బర్త్ డే సెలబ్రేషన్ పేరుతో ములుగు నియోజకవర్గంలో భారీ ఊరేగింపు నిర్వహించి అక్కడా ఉంటా.. ఇక్కడ ఉంటానని చాటి చెప్పినట్లు జనం భావిస్తున్నారు. వీరయ్య వ్యూహం జనానికి అవగతం అవుతున్నా.. గులాబీ బాస్ మదిలో ఏముందో తేట తెల్లం కావాలంటే మరి కొద్ది రోజులు ఓపిక పట్టాల్సిందే.
తగ్గేదేలే..!
బర్త్ డే రాజకీయం ములుగు, మహబూబాబాద్‌లోనే కాదు అటు భూపాలపల్లిలో సైతం సాగుతోంది. మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి బర్త్ డే సందర్భంగా ఇటీవల గ్రాండ్ గా వేడుకలు నిర్వహించి అనుచరుల్లో కొత్త ఊపును తీసుకొచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి చెక్ పెట్టి వచ్చే ఎన్నికల్లో టికెట్ సాధించడమే లక్ష్యంగా చారీ సాబ్ బర్త్ డే పార్టీతో సత్తా చాటే ప్రయత్నం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. బర్త్ డే వేడుకలు.. విందు భోజనాలతో రాజకీయాలను మలుపు తిప్పే ప్రయత్నం చేస్తున్నారు ఓరుగల్లు నేతలు. ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా ఎన్నికల ఎత్తుగడలతో నాయకులంతా ముందుకు సాగుతున్నారు.
- పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment