సమావేశంలో మాట్లాడుతున్న సంజయ్. చిత్రంలో రాజాసింగ్, లక్ష్మణ్, ఇంద్రసేనా తదితరులు
సాక్షి, హైదరాబాద్/సైదాబాద్: ‘వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంసహా దాని పరిధిలోని శాసనసభా నియోజకవర్గాలన్నింటినీ బీజేపీ కైవసం చేసుకుంటుంది’అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ సమాజం మార్పును కోరుకుంటోందని, అది బీజేపీ వల్లే సాధ్యమని నమ్ముతోందని అన్నారు.
బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు సంరెడ్డి సురేందర్‌రెడ్డి అధ్యక్షతన ఆ పార్టీ హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకర్గస్థాయి సమీక్షాసమావేశం ఆదివారం ఇక్కడ చంపాపేటలోని మినర్వా గార్డెన్‌లో నిర్వహించారు. దొంగ ఓట్లతో ఎంఐఎం గెలుస్తోందని, ఒకవర్గం ఓట్లను జాబితా నుంచి తొలగించేందుకు యత్నిస్తోందని, ఈ విషయంలో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సంజయ్ అన్నారు.
తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అయోధ్య రామమందిరం తరహా లో భాగ్యనగరంలో భాగ్యలక్ష్మీ అమ్మవారి దేవాలయాన్ని నిర్మిస్తామని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలు తెలంగాణను నయా రజాకార్ల రాజ్యంగా మార్చాయని, ఇక్కడ రజాకార్ల పాలన కావాలో... సుభిక్షంగా ఉండే రామరాజ్యం కావాలో.. ప్రజలే తేల్చుకోవాలని పిలుపునిచ్చారు.
దారుస్సలాంను ఆక్రమిస్తాం..
తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు 1969లో అప్పటి ఆంధ్రాపాలకులతో నాటి ఎంఐఎం అధినేత రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని, అందులో భాగంగానే దారుస్సలాంను రాయించుకున్నారని సంజయ్ ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే దానిని ఆక్రమించుకుని తీరుతామని స్పష్టం చేశారు. పాతబస్తీలో ఎంఐఎం అరాచకాలకు తట్టుకోలేక ఒకవర్గం ప్రజలెందరో తమ ఆస్తులను వదిలేసి మూసీ అవతలకు వెళ్లిపోయారని, బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాతబస్తీ నుంచే ఘర్‌వాపసీ మొదలుపెడతామని పేర్కొన్నారు. ‘బీజేపీ కార్యకర్తలు కేసులకు భయపడరు. అవసరమైతే, అసెంబ్లీలో పెట్టబోయే బడ్జెట్‌లో లాఠీలు కొనేందుకు, అరెస్ట్ చేసి లోపల పెట్టేందుకు జైళ్ల నిర్మాణానికి నిధుల కేటాయింపులు చేసుకోవచ్చు’అని అన్నారు. భాగ్యలక్ష్మి ఆలయాన్ని తెలంగాణ ఐకాన్‌గా అభివృద్ధి చేస్తామని చెప్పారు.
టీఆర్‌ఎస్ ఓటమి ఖాయం : కిషన్‌రెడ్డి
‘సీఎం కేసీఆర్ ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని దేశాలు తిరిగినా, చివరికి పాకిస్తాన్ ప్రధానిని, అక్కడి ఉగ్రవాదులను కలిసినా తెలంగాణలో టీఆర్‌ఎస్ ఓడిపోవడం ఖాయం’అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను పేదలకు అందకుండా తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆయన ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment