రసూల్‌పురా: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు జై తెలంగాణ అని నినదించి ఇపుడు ఎందుకని విమోచన దినోత్సవం జరపడం లేదో సమాధానం చెప్పాలని కేంద్రమంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. నిజాం నవాబు, రజాకార్ల అరాచకాలకు ఎదురొడ్డి పోరాడిన అమరవీరుల విశేషాలను తెలియజేసే ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో బండి సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రధాని నరేంద్రమోదీ ఆదేశాల మేరకు కేంద్ర సాంస్కృతిక, హోంశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తు న్నామని తెలిపారు.
ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రతీ ఒక్కరు చూడాలని భావిత రాలకు నిజాం నిరంకుశ పాలనలో రజాకార్ల ఆకృత్యాల వల్ల ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు, అవమానాలు పడ్డారో, ఏయే ప్రాంతాల్లో ఉద్యమాలు జరిగాయో ఫొటో ఎగ్జిబిషన్ తెలియజేస్తుందని చెప్పారు. గతంలో ఉన్న రజాకార్ల దళం నేడు ఎంఐఎం పార్టీగా మారిందని అలాంటి దళాన్ని నాటి బీఆర్‌ఎస్, నేటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పొగుడుతున్నారని విమర్శించారు.
బీఆర్‌ఎస్ సమైక్యదినం అంటే కాంగ్రెస్ వాళ్లు ప్రజాపాలన అంటున్నారని ప్రజావంచన దినోత్సవం అని పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. పాఠ్యాంశాల్లో తెలంగాణచరిత్ర చేర్చాలన్న ఆలోచన త్వరలో ఫలిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్. చింతల రామచంద్రారెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, పీఎల్.శ్రీనివాస్ నగర నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment